శంషాబాద్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై సభ్యులు ఆందోళన చేయడంతో శాసనసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్పీకర్ 10 నిమిషాలపాటు సభను వాయిదా వేశారు. అంతకుముందు ఇదే అంశంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కమ్యూనిస్టుల పేపరైన విశాలాంధ్ర తమ శాఖను మన తెలంగాణ పేరుతో పేపరును ఇక్కడ ప్రారంభిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తుంటే కేంద్రప్రభుత్వం మూర్ఖంగా ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరుపెట్టి తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఒక రాయి వేస్తున్నారని, ఈ చర్యలు మంచివి కావన్నారు.
రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని, అందుకే ఎయిర్ పోర్టుకు ఆ పేరు పెట్టారని, కావాలంటే ఎయిర్ పోర్టుకు తెలంగాణ వీరుల పేర్లు పెట్టాలని, దళిత యోధుడు భాగ్యరెడ్డి వర్మ, గిరిజన యోధుడు కొమురం భీం, చాకలి ఐలమ్మ, సాయుధ పోరాట యోధులు బద్దం ఎల్లారెడ్డి, బందగి, బీం రెడ్డి పేర్లు పెట్టాలి కానీ మాకు సంబంధం లేని ఆంధ్రా ప్రాంతం వ్యక్తి పేరు పెట్టడం ఏమిటని సీఎం ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ, ఇంకా మీ నేతల పేర్లు మాకొద్దని, మీ నేతల పేర్లు ఏపీలోని ఎయిర్ పోర్టులకు పెట్టుకోండని సూచించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై టీఆర్ఎస్, కాంగ్రెస్, మిగతా పార్టీల సభ్యులు ఆందోళన చేస్తున్నా బీజేపీ, టీడీపీ సభ్యులు మాత్రం నోరుమెదపకలేదు. ఎన్టీఆర్ పేరు పెట్టడంపై స్పీకర్ మధుసూదనాచారి అన్ని పక్షాలను సమావేశానికి పిలువగా బీజేపీ, టీడీపీ సభ్యులు ఈ సమావేశానికి వెళ్లకపోవడం గమనార్హం.