mt_logo

అధికారులంతా సర్పంచుకే జవాబుదారీ – కేసీఆర్

ప్రతి గ్రామాన్ని సచివాలయంగా, గ్రామసభలను అసెంబ్లీలుగా, గ్రామానికి సర్పంచే సీఎంగా అధికారాలు కట్టబెట్టడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కృషి చేస్తున్నారు. గ్రామాభివృద్ధికి క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రచించి గ్రామ ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామస్వరాజ్యం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికోసం గ్రామ సర్పంచుకే పూర్తి అధికారాలు కల్పించడంతో పాటు, అధికారులందరూ సర్పంచ్ కే జవాబుదారీగా ఉండేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సుమారు 36శాఖల అధికారులు, ఉద్యోగులు సర్పంచ్ పర్యవేక్షణలో పనిచేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ వ్యవస్థ రూపురేఖలు మార్చేందుకు వేగవంతంగా ప్రణాళికలు రచిస్తున్నారు. గ్రామాల్లో ఇకపై కొత్తగా రేషన్ కార్డు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు తీసుకోవాలన్నా, ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్దిదారుల జాబితా రూపొందించాలన్నా గ్రామసభలకు, గ్రామ పంచాయితీ పాలకవర్గం, సర్పంచ్ లకే పూర్తి అధికారం ఉంటుంది.

అపార్డ్ లో జరిగిన రెండు రోజుల సమావేశంలో ఇదే అంశానికి సంబంధించి గ్రామస్థాయి ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రికి అన్ని శాఖల అధికారులు ఏవిధంగా జవాబుదారీగా ఉంటారో, అదేవిధంగా సర్పంచ్ కు కూడా గ్రామస్థాయికి సంబంధించిన ప్రభుత్వ సిబ్బంది జవాబుదారీగా ఉంటారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామస్వరాజ్యం ఇక గ్రామప్రజల ద్వారానే సాకారం కాబోతోంది. తెలంగాణ జిల్లాలైన గంగదేవిపల్లి, ముల్కనూరు, అంకాపూర్ వంటి గ్రామాలు తమంతట తామే కమిటీలు నియమించుకుని స్వయం అభివృద్ది సాధించడమే ఇందుకు ఉదాహరణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *