By: రేరాజ..!
అవును నిజంగానే అద్భుతం మరి. చాలా ఏళ్ళ తర్వాత మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అర్థవంతంగా జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూడటం జరిగింది. నిజంగా ఇది రాబోయే కాలానికి దిక్సూచిగా ఉండబోతోంది. నిజానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరే అసెంబ్లీతో పోల్చతగదు. ఎందుకంటే సుదీర్ఘకాల పోరాటంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు, ఆలోచనలు భిన్నరీతిలో ఉంటాయి. తమ ఆశలు ఇంకెప్పుడు తీరుతాయన్న ఆందోళనలు ఉంటాయి. తొందరపాటు ఉంటుంది. ప్రజల ఆకాంక్షలకనుగుణంగా కొత్త రాష్ట్ర అసెంబ్లీ జరగడం కష్టమే. అయినా ఆ బాధ్యతను ప్రధాన ప్రతిపక్షం, ప్రభుత్వపక్షం కలిసి విజయవంతంగా నిర్వహించాయి.
ముఖ్యంగా ఈ సమావేశాల గురించి చెప్పుకోవాల్సింది ఏందంటే చాల ఏళ్ల తర్వాత సుమారు పాతికేళ్ళ తర్వాత బడ్జెట్ పద్దులఫై పూర్తి స్థాయి చర్చ జరిగింది. బడ్జెట్ లోని అన్ని పద్దులఫై పద్దుల వారీగా చర్చ జరగడం చాలా శుభ పరిణామం. బడ్జెట్ లో పూర్తిగా పద్దులఫై చర్చ జరిగితేనే ప్రభుత్వ జమ ఖర్చులఫై ప్రజలకు అవగాహన వస్తుంది. ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం వస్తుంది.
వెల్లివిరిసిన సమన్వయం:
ఏ అసెంబ్లీ సమావేశాలన్నా సజావుగా సాగాలంటే ప్రతిపక్షం, పాలకపక్షందే బాద్యత. మరీ ముఖ్యంగా పాలకపక్షం అందరిని కలుపుకొని పోయి సమావేశాలు సజావుగా నిర్వహించుకోవాలి. ఈ సమావేశాల్లో వారిద్దరూ సక్సెస్ అయ్యారు. కొంత వరకు టీటీడీపీ వారు గలాట చేయ ప్రయత్నించినా వారి గొడవకు కారణం, సహేతుకత లేకపోవడం, జాతీయ గీతాలాపన సమయంలో గొడవచేయడం వారు సస్పెండ్ అయి బయటే ఉండాల్సి వచ్చింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి డీకే అరుణ విషయంలో తన మంత్రి చేత క్షమాపణ చెప్పించడం, ఆ తర్వాత ఆమె కూడా సారీ చెప్పడం, ఒక సందర్భంలో జానారెడ్డి గారు జాతీయ గీతం అవమానం విషయంలో తన సభ్యుడినే తప్పుపట్టి క్షమాపణ చెప్పించడం బాగుంది. సమావేశాల చివరి రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి, చిన్నారెడ్డి గొడవ విషయంలో తన మంత్రులనే భాద్యతతో వ్యవహరించాలని మందలించడం, దాంతో ఆ గొడవ టీ కప్పులో తుఫాన్ మాదిరిగా సమసిపోవడం కేవలం ‘తెలంగాణా అసెంబ్లీ’ లోనే సాధ్యం. ఇలాగే మన అసెంబ్లీ దేశంలో వేరే చట్టసభలకు ఆదర్శం కావాలని కోరుకుందాం. జయహో.. తెలంగాణా!
కొసమెరుపు: కరీంనగర్ జిల్లా మారుమూల గ్రామం రేగుంటలో ఓ ఇంట్లో ముసల్ది మల్లక్క “ఒరేయ్ రాజన్నా.. ఆ దిక్కుమాలిన మీటింగుల చానెల్ బంద్ చేసెయ్ రా.. గా ‘జబర్దస్త్’ అచ్చే ఛానెల్ జర పెట్టురా” అలవాటయిన పానం మరి గట్లనే ఉంటది.