‘ఛాయ’ మిస్టరీ వీడినది .
ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది.
అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్ లెక్చరర్. నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం.
11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం… ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి.
కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది?
ఈ విషయాలనే ప్రయోగాత్మకంగా నిరూపించాడు సూర్యాపేటకు చెందిన మనోహర్.
ఎలా కనిపెట్టాడు?
శేషగాని మనోహర్ గౌడ్ సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర పిజీ కాలేజ్లో పనిచేస్తున్నారు.
ప్రస్తుతం గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఆరేడేళ్ల క్రితం ఒకరోజు కోడి శ్రీనివాస్ అనే స్నేహితుడు ఆయన్ని ఛాయా సోమేశ్వరాలయానికి తీసుకెళ్లాడు. అక్కడి నీడ గురించి చెప్పి ‘నీకు ఫిజిక్స్ అంటే ఇష్టం కదా. నువ్వు ఎందుకు ఈ నీడ రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు’ అని ప్రోత్సహించాడు. ఆ రోజు నుంచి ఆ మిస్టరీ మనోహర్ని వెంటాడింది. ఎలాగైనా ఆ రహస్యాన్ని చేధించాలని ఒంటరిగా వెళ్లి ఆ గుళ్లో ఎన్నోసార్లు కూర్చునేవాడు. అక్కడి నిర్మాణాన్ని అణువణువు పరిశీలించాడు. కొలతలు తీసుకున్నాడు. ఆ గుడికి దక్షిణం వైపు ప్రధాన ద్వారం ఉంటుంది, తూర్పు, పడమర, ఉత్తరంవైపు మూడు గర్భగుళ్లు ఉంటాయి. పడమర వైపు ఉన్న గర్భగుడిలోని శివలింగంపైనే నీడ పడుతుంది. మిగిలిన రెండు గుళ్లలో అంతా చీకటిగా ఉంటుంది. మధ్యలో నాలుగు స్తంభాలుంటాయి. ప్రధాన ద్వారం వద్ద, మూడు గర్భగుళ్ల ముందు సిమెట్రిక్ సిస్టమ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. మధ్యలో నిలబడి ఏ గర్భగుడివైపు చూసినా వాటి నిర్మాణం ఒకేలా ఉంటుంది. ఇదే నమూనాలో థర్మాకోల్తోగుళ్లను, కొవ్వొత్తులను స్తంభాలుగా ఉపయోగించి ఆలయాన్ని రూపొందించాడు మనోహర్.
చీకటి గదిలో టార్చిలైటుని సూర్యునిగా ఉపయోగిస్తూ ఎన్నో ప్రయోగాలు చేశాడు. అలా ఎన్నో రాత్రులు చీకటిలో గడిపి విజయాన్ని సాధించాడు. వందల ఏళ్లుగా గర్భగుడిలో దాగి ఉన్న ఆ రహస్యాన్ని వెలుగులోకి తెచ్చాడు. యురేకా ఛాయా సోమేశ్వరాలయం కాకతీయుల కాలం నాటి నిర్మాణశైలిని కలిగి ఉంటుంది. ఆ కాలంలోనే భౌతిక శాస్త్రం ఆధారంగా కాంతిని దారిమళ్లించి ఒక నీడని గర్భగుడిలో పడేలా చేయడం చూసి ఆశ్చర్యపోయాడు మనోహర్. తను కనుగొన్న విషయాన్ని ఇలా చెప్పుకొచ్చాడు. “ఈ గుడిని పరిక్షేపణ కాంతి ఆధారంగా నిర్మించారు. మనం తెలుసుకోవాలనుకున్నది రెండు విషయాలు… ఒకటి.. నీడ ఏ స్తంభానిది?, రెండు.. ఏ దిశ నుంచి వచ్చే కాంతిది? అని. గుడి నిర్మాణం ఆధారంగా నేను చేసిన ప్రయోగాల్లో అది తేలింది. అలాగే ఆ నీడ ఒకే స్తంభానిది కాదు.. నాలుగు స్తంభాలది. కాంతి కూడా రెండు వైపుల నుంచి వస్తుంది. నీడ పడే గర్భగుడికి ఎదురుగా అంటే తూర్పు గుడి పక్కన రెండు వైపుల నుంచి కాంతి లోపలికి వస్తుంది. ఇది నాలుగు స్తంభాలకు తగిలి పరిక్షేపణం చెందుతుంది. ఆ పరివర్తనం అంతా గర్భగుడిలోని శివ లింగంపై ప్రతిఫలించేలా నిర్మాణం చేశారు. ఇక్కడ మళ్లీ రెండు అనుమానాలు. నిర్మాణం అంతా ఒకేలా ఉన్నప్పుడు, మిగిలిన రెండు గర్భగుళ్లలో కూడా నీడ పడాలి కదా? రెండోది.. సూర్యకాంతి ఆధారంగా వచ్చే నీడ అయితే కదలాలి కదా. మరి స్థిరంగా ఎందుకు ఉంటుంది? సూర్యుడు తూర్పున ఉదయించి పడమటికి కదులుతాడు. దీన్ని సన్ ట్రాక్ అంటారు. అందుకే పడమర వైపు గుళ్లో మాత్రమే నీడ పడేలా కట్టారు. నీడపడే గుడి పక్కన కాంతి వచ్చే ప్రదేశంలో విగ్రహాలు పెట్టి అడ్డువేశారు. అందుకే తూర్పు గర్భగుడిలో నీడ పడదు. అలాగే ఉత్తరం వైపు గుళ్లో పడకుండా దక్షిణం వైపు ఖాళీగా వదిలేశారు. అటువైపు కూడా కట్టి ఉంటే ఉత్తరం గుళ్లో కూడా నీడపడేది.
వాహ్! ఆ కాలంలోనే భౌతికశాస్త్రం ఆధారంగా అద్భుతమైన కట్టడాన్ని నిర్మించిన కుందూరు చోళులకు హ్యాట్సాఫ్. ఇలాంటి కట్టడం ఇప్పుడు శిథిలావస్థలో ఉండడం బాధాకరం.
ఇలాంటి అద్భుత కట్టడాలు మన రాష్ట్రంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత పురావస్తు శాఖకు ఉంది.
అత్యద్భుత కళాసంపదకు నిలయమీ ఆలయం.. నేషనల్ హైవే కు కేవలం పదిహేను కి.మీ. దూరంలో నల్గొండకు ముందుగానే దర్శనమిస్తుందీ ఆలయం… నార్కెట్ పల్లి నుండి నల్గొండకు వెళ్ళే మధ్య దారిలో ఉంటుంది..
teluguvignanamvinodam1.blogspot.in సౌజన్యంతో