mt_logo

అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోంది! – ఉమాభారతి

ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమాభారతితో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులతో పాటు చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ గురించి సీఎం కేసీఆర్ మంత్రి ఉమాభారతికి వివరించారు. అంతేకాకుండా ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, ప్రాజెక్టు సాధ్యమైనంత త్వరగా పూర్తి కావడానికి పర్యావరణ, హైడ్రాలజీ అనుమతులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన మంత్రి మాట్లాడుతూ వారంలోగా రాష్ట్ర అధికారులతో పాటు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ అధికారులను సమావేశపరిచి నిర్ణయం తీసుకుంటామని, ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడానికి కేంద్రం సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ అభివృద్ధిలో మాత్రం వేగంగా దూసుకుపోతుందని ఆమె ప్రశంసించారు.

చెరువుల పునరుద్ధరణ వ్యవసాయానికి ఎలా మేలు కలిగించనుందో చెబుతూ తాము తలపెట్టిన మిషన్ కాకతీయ గురించి కేసీఆర్ వివరించగా మంత్రి ఆసక్తి కనపరిచారు. ఈ ప్రాజెక్టు దీర్ఘకాలిక ప్రాజెక్టు కాబట్టి సుమారు 22,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, కేంద్రం ఆర్ధిక సాయం అందించి ఆదుకోవాలని సీఎం కోరారు. మిషన్ కాకతీయ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కేసీఆర్ ఆహ్వానించగా తప్పకుండా వస్తానని ఉమాభారతి చెప్పారు.

దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుండి 2013-14 సంవత్సరానికి గాను రూ. 113 కోట్లు, 2014-15 సంవత్సరానికి గాను రూ. 63 కోట్లు ఏఐబీపీ నిధులు రావాల్సిఉందని, ప్రాజెక్టు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నందున వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని కేసీఆర్ కోరగా మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఈ ప్రాజెక్టుకు సంబంధించి బకాయిలు రూ. 64 కోట్ల నిధులు వారంలోగా విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు ఎంపీలు కేకే, జితేందర్ రెడ్డి, కవిత, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డాక్టర్ బూరనర్సయ్య గౌడ్, బీ వినోద్ కుమార్, కడియం శ్రీహరి, ప్రొఫెసర్ సీతారాం నాయక్, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *