తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన తొలి ప్రసంగం స్వీయ అస్థిత్వ విజయ ప్రకటనగా ఆకట్టుకున్నది. ఒక ఉద్యమం, ఆ ఉద్యమ విజయం ఫలితంగా సిద్ధించిన స్వీయ రాజకీయ అస్థిత్వపు ఆత్మగౌరవ ప్రకటనగా కేసీఆర్ ప్రసంగం సాగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ అనంతరం ముఖ్యమంత్రి సమాధానం కనుక కేసీఆర్ స్వయంగా తాము రూపొందించిన మ్యానిఫెస్టో, ఆ విషయాలన్నీ అధికారికంగా ప్రభుత్వం తరఫున గవర్నర్ ప్రకటించడాన్ని పూర్తిగా సమర్థించుకున్నారు. నిజమే. గవర్నర్ ప్రసంగం టీఆర్‌ఎస్ కరపత్రం లాగే ఉండాలి. ఒక పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన పనులు అమలు చేస్తామని చెప్పడమే సరైనది అంటూ రాజకీయ తత్వవేత్తలు హెగెల్, ప్లేటోలను కూడా ఆయన ఉటంకించారు. రాబోయే అయిదేళ్ల కాలంలో టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలోని తమ ప్రభుత్వం ఏమి చేయబోతున్నది? బంగారు తెలంగాణ నిర్మించుకోవడానికి సావకాశాలు ఏమిటి? ఏఏ రంగాలకు ప్రాధాన్యతలు కల్పిస్తున్నదీ కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగంలో వివరించారు.
ప్రతిపక్షాల సభ్యులు గవర్నర్ ప్రసంగంలో కాలపరిమితిలేని, సమగ్ర ప్రణాళికలేని అనేక విషయాలను చెప్పారని, ప్రభుత్వం చెబుతున్న విషయాలపై స్పష్టత లేదని అన్న విమర్శలకు, చాలా వివరంగా కేసీఆర్ సమాధానం చెప్పారు. తెలంగాణ నిర్మాణంలో ప్రధానపాత్ర వహించే నీటి పారుదల, వ్యవసాయం, ముఖ్యంగా లోటును ఎదుర్కుంటున్న విద్యుత్ రంగం లాంటి అంశాలపై ఆయన స్పష్టతగా, ఒక భవిష్యత్ ప్రణాళికతో వివరించారు. నిజంగానే తెలంగాణకు సంబంధించిన సకల అంశాల మీద ఒక స్పష్టత ఉన్నది కనుకనే భవిష్యత్తులో ఏఏ రంగాల్లో ఏమి చేయాలి? ఇప్పుడేమి చేయగలం, అనంతర కాలంలో ఏమి సాధించగలం అన్న అంశాలపై కేసీఆర్ మాట్లాడారు. తక్షణ సమస్యలపై స్పందన, దూరదృష్టితో భవిష్యత్ కార్యాచరణ అన్న అంశాలుగా దేనికదిగా విడమరచి ఒక గొప్ప విజన్‌ను తెలంగాణ ప్రజల ముందు ఉంచడంలో కేసీఆర్ సఫలీకృతులయ్యారు.
రైతుల రుణమాఫీకి సంబంధించి ఏర్పడిన అస్పష్టతలను తొలగించి మొత్తంగా రుణమాఫీ చేస్తామని, పంట రుణాలే కాకుండా, బంగారం కుదువపెట్టి తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తామని కేసీఆర్ విస్పష్టంగా ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడిన కేవలం మూడు రోజులకే రుణ మాఫీపై ప్రకటనతో ప్రతిపక్షాలు ఒక అవకాశంగా తీసుకొని సృష్టించిన గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ రుణమాఫీపై స్పష్టత ఇచ్చారు.
నిజానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా, రుణమాఫీ విషయంలో భిన్నాభిప్రాయాలున్నా, బ్యాంకర్లు అభ్యంతరాలు చెప్పినా, రాష్ట్ర ఖజానాకు భారమైనా తెలంగాణ ప్రభుత్వం వెనుకంజ వేయకూడదని, ఎన్నికల హామీల్లో ఇది ప్రధానమైందని భావించాలి. తెలంగాణ రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. అడపాదడపా అయినా అవి జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యవసరంగా ఈ సమస్యపై స్పందించడంలో భాగంగానే కేసీఆర్ ఇవ్వాళ్టి ప్రసంగంలో స్పష్టత ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యమం తర్వాత ఏర్పడిన ప్రభుత్వం. ప్రజల ఆకాంక్షలు అనేకం. కానీ వాటిని సత్వరమే తీర్చడం అతి పెద్ద సమస్య. అందువల్ల ఈ ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని, టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ మళ్లీ ఒకసారి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రస్తావించి ప్రతి హామీని నెరవేరుస్తామని ధృఢచిత్తం ప్రకటించారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే, పాలన ఏకపక్షంగా కేంద్రీకృతంగా ఉండబోదని, తెలంగాణలోని అన్ని శక్తులనూ, ప్రతిపక్షాల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుని ముందుకు నడుస్తామని ఆయన చెప్పడం సమ్మిళిత పాలనకు ఒక సూచికగా భావించవచ్చు. ప్రసంగంలో తెలంగాణ ఏ ఒక్కరి వల్లా రాలేదని, విజయం ఒక్కరి సొంతం కాదని జనసభతో సహా అందరి భాగస్వామ్యాన్ని గుర్తుచేయడం ద్వారా ఉద్యమం పట్ల వినమ్రత ప్రకటించారు. అట్లాగే జాతీయ పార్టీల సహకారం, సోనియాగాంధీ అంకితభావం, పట్టుదల, భారతీయ జనతాపార్టీ సహకారంతో పాటు 33 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడాన్నీ ఆయన ప్రస్తావించారు.
ఈ ఉద్యమ స్వభావ స్ఫూర్తి నుంచి, ఆ ఉద్యమం బహుళమైనదీ, విస్తృతమైనదీ అనే అర్థం నుంచే రాబోయే పాలనకూడా అందరిని కలుపుకొని, అందరి అభిప్రాయాలను తీసుకొని జరుగుతుందని కేసీఆర్ అనగలిగారు. ఇది స్ఫూర్తిదాయకమైన ప్రకటన. వలసపాలన అవశేషాలు అంతరించి, స్వీయపాలన పూర్తిగా పాదుకోవడానికి ముందు ఉండే సంధికాలపు పరిస్థితులపై అవగాహన ఉంటే తప్ప ఈ మాటలు రావు. నీటిపారుదల, పోలవరం నుంచి బోనాలు, రంజాన్ పండుగ ఏర్పాట్ల దాకా ఆయన అఖిలపక్షం సమావేశాలలోనే నిర్ణయాలుంటాయని అనేకసార్లు ప్రస్తావించారు.
చివరగా సీమాంధ్ర మీడియా ఎంత దుర్మార్గంగా తెలంగాణను, ప్రభుత్వాన్ని కించపరుస్తున్నదో వివరించడం ద్వారా ఈ సంధి స్థితిలో ఆత్మగౌరవంతో ఎట్లా నిలబడాలో? పిలుపు ఇవ్వగలిగారు. ఒక ఉద్యమం నుంచి ఏర్పడిన స్వీయ అస్థిత్వ ప్రకటనలాగానే ఇవ్వాళ్టి కేసీఆర్ ప్రసంగాన్ని చూడవలసి ఉంటుంది. తెలంగాణ ప్రజలకు ఇది కూడా ఒక కొత్త ఒరవడి, కొత్త చరిత్రగా భావించవలసి ఉంటుంది. కలసి నడుద్దాం.. బంగారు తెలంగాణ నిర్మిద్దాం అన్న ముఖ్యమంత్రి పిలుపు రాబోయే రోజుల్లో ఆచరణాత్మకంగా మారాల్సి ఉన్నది. అదే తెలంగాణ సాఫల్యం. అదే తెలంగాణ ఉద్యమ ఫలం.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..