తెలంగాణలోని విద్యుత్ తో పాటు బొగ్గును కూడా కాజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. సింగరేణి, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లు కలిసి వెలికితీయాల్సిన 28వేల కోట్ల విలువైన 140మిలియన్ టన్నుల బొగ్గును ఏపీ జెన్కోకు తరలించాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. వచ్చే మూడేళ్ళలో తెలంగాణలో భారీగా విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్న సమయంలో బొగ్గును గద్దలా తన్నుకుపోవడానికి ఆంధ్రా సర్కార్ గోతికాడి నక్కలా కాచుకునిఉంది.
మధ్యప్రదేశ్ లోని సింగ్రోలీ జిల్లా సులియారి – బెల్వార్ బొగ్గుగనిలోని బొగ్గు వెలికితీయడానికి సింగరేణి, ఏపీఎండీసీలు కలిసి ఒక జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేశాయి. దీనిద్వారా ఉత్పత్తి చేసే 140మిలియన్ టన్నుల బొగ్గును ఏపీ జెన్కో వినియోగించుకోవాలని గతంలో నిర్ణయించారు. అయితే పేరు సాకుగా చెప్పి ఆంధ్రా ప్రభుత్వం బొగ్గు మొత్తం తమకే దక్కాలని వింత సాకు చూపెడుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ పేరు ఏపీ జెన్కో అయినందున తమకే బొగ్గు మొత్తం దక్కాలని చెప్తుంది.
సింగరేణి తో పాటు ఏపీఎండీసీ నుండి వేరు చేయనున్న తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మాత్రమే బొగ్గు వెలికితీయాల్సిన అవసరం ఉండి. ఏపీ జెన్కో నుండి ఏర్పడిన తెలంగాణ జెన్కో కు ఆస్తుల పంపకం ప్రకారం బొగ్గును కూడా పంచాలి. అంతేకాకుండా సింగరేణి సంస్థ పూర్తిగా తెలంగాణకు చెందినది. తెలంగాణ సంస్థ తవ్వితీసిన బొగ్గు కూడా ఆంధ్రప్రదేశ్ కే చెందాలని అనడం హాస్యాస్పదమని పలువురు తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్ లోని సులియారి – బెల్వార్ బొగ్గుక్షేత్రం సింగరేణికి, తెలంగాణకు మాత్రమే దక్కుతుందని, ఏపీ జెన్కోకు కేటాయిస్తే ఉద్యమం తప్పదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తేల్చిచెప్పారు.