వంకరబుద్ధి కలిగిన ఆంధ్రా పాలకులు నల్గొండ జిల్లాను వికలాంగ జిల్లాగా మార్చారని ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఆరోపించారు. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం కొండగడపలో పలు అభివృద్ధి పనులను గురువారం కేటీఆర్ విద్యా శాఖ మంత్రి జీ జగదీష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరోసిస్ మహమ్మారిని ఐదేళ్లలోపే శాశ్వతంగా రూపుమాపుతామని, ఇందుకు జిల్లాలో జాతీయ ఫ్లోరోసిస్ పరిశోధన సంస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
టీఆర్ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుందని, 19వేల కోట్ల భారం పడుతున్నా లక్ష రూపాయలలోపు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తుందని, దసరా, దీపావళి పర్వదినాల్లో రేషన్ కార్డులు, నవంబర్ మొదటినెల నుండి పెన్షన్లు ఇస్తామని చెప్పారు. దళిత, గిరిజన కుటుంబాల ఆడపిల్లలకోసం కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేయబోతున్నామని, 1200 పైగా తండాలను పంచాయితీలుగా మారుస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, తనపై వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికే చంద్రబాబు తెలంగాణపై కుట్రలు చేస్తున్నాడని, ఏపీకి చెందిన విద్యార్థులకు కూడా ఫీజులు చెల్లించాలని అంటున్నాడని విమర్శించారు. ఇక్కడున్న కరెంటు కష్టాలకు కారణం ఆంధ్రా పాలకులేనని, కాంగ్రెస్ నేతలు, తెలంగాణ టీడీపీ నేతలు నోరు మెదపకుండా బాబుకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.