తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశంతో పొత్తుపెట్టుకుని నష్టపోయామని పలువురు తెలంగాణ బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీలు కలిసి తెలంగాణలో బీజేపీని నిలునునా ముంచుతారేమోననే ఆందోళనలో తెలంగాణ బీజేపీ నేతలు ఉన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించినట్లుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిందని మోడీ అన్న వ్యాఖ్యలపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడిందని, మోడీ ప్రచారంతో లాభం చేకూరుతుందని తాము భావించినా చివరికి అది నష్టం కలిగించేదిగా మారిందని తెలంగాణ బీజేపీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.
నరేంద్రమోడీకి రెండుపక్కలా ఆంధ్రోళ్ళే ఉన్నారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను ఉద్దేశిస్తూ కేసీఆర్ ప్రచారం చేసినా తాము ఏమీ అనలేకపోయామని మరొక నేత అన్నారు. తెలంగాణ కేసీఆర్ వల్లే వచ్చిందని తెలంగాణ ప్రాంత ప్రజలు భావిస్తున్న తరుణంలో పవన్ ఇష్టమొచ్చినట్లు విమర్శించడం టీఆర్ఎస్ కే లాభం కలిగించిందని, బీజేపీకి మాత్రం దానివల్ల నష్టం వాటిల్లిందని, పవన్ కళ్యాణ్ ప్రచారం వల్లే టీఆర్ఎస్ కు మూడుశాతం ఓట్లు పెరిగాయని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే 10కన్నా ఎక్కువ స్థానాలు వచ్చేవని, పొత్తు వల్లే తమకు శాసనసభ స్థానాలసంఖ్య తగ్గనుందని, తెలంగాణలో పార్టీ పరిస్థితి దిగజారిపోయిందనే అభిప్రాయానికి తెలంగాణ బీజేపీ నేతలు వచ్చారు.
టీడీపీతో మొదట్నుంచీ పొత్తు వద్దని చెప్పినా వినకుండా జాతీయనాయకత్వం టీడీపీతో పొత్తు వ్యవహారం నడిపిందని, తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రపడిన టీడీపీతో పొత్తు వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని, బీజేపీ, టీడీపీ నేతలు ఎక్కడా కూడా కలిసి ప్రచారం చేయకపోవడంతో కార్యకర్తలే పొత్తు ధర్మానికి అనుకూలంగా ఓటు వేయలేకపోయారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలోని అసెంబ్లీ స్థానాలపై టీడీపీ పొత్తు వ్యతిరేకత చూపిందని, టీఆర్ఎస్ కే అనుకూలంగా ఓట్లు పడ్డాయని, తెలంగాణకు మద్దతు పలికినా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఆ క్రెడిట్ దక్కలేదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.