ఆహారభద్రత కార్డులు, పెన్షన్ల జారీ ప్రక్రియకు ఎలాంటి గడుగు విధించలేదని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సోమవారం మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్ లో జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరుతో ఉన్న కార్డులు తొలగించి తెలంగాణ ప్రభుత్వం పేరుతో ఇవ్వడానికే ఈ ప్రక్రియ మొదలుపెట్టాం. కానీ ప్రతిపక్షాలు మాత్రం రేషన్ కార్డులు, పెన్షన్లు తొలగిస్తున్నారంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని, ఇప్పుడు దరఖాస్తు చేసుకోనివారు వచ్చే నెలలో దరఖాస్తు చేసుకున్నా అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు, పెన్షన్లు అందుతాయని హరీష్ రావు చెప్పారు.
ప్రతిపక్షాల తాటాకు చప్పుళ్ళకు భయపడమని, ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో పుట్టగతులుండవనే ప్రతిపక్ష పార్టీలు సర్కార్ ను బద్నాం చేయాలని చూస్తున్నాయని హరీష్ రావు మండిపడ్డారు. గత ప్రభుత్వాల హయాంలో ఒక్కొక్కరికి 4 కిలోల బియ్యం ఇచ్చారని, ఇప్పుడు 6 నుండి 9 కిలోలు ఇచ్చే ప్రతిపాదన చేస్తున్నామని, కోటా పెంపుపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ. 2 వేల కోట్లు, పెన్షన్ల పెంపుతో మరో రూ. వెయ్యి కోట్ల భారం పడనుందని తెలిపారు. వ్యవసాయానికి 6 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని, మానిఫెస్టోలో లేకపోయినా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆహారభద్రత కార్డుల జారీ తదితర అంశాలే సర్కారు పనితీరుకు నిదర్శనమని హరీష్ రావు పేర్కొన్నారు.