mt_logo

ఆహ! ఏమి ఈ ఆంధ్రనేతలు..

– అల్లం నారాయణ

కిరణ్‌కుమార్‌ రెడ్డిలో ఇంత అద్భుతమైన అపరిచితుడు ఉన్నాడని మొన్నటిదాకా కనిపెట్టలేకపోయాము. ఆయన భాష వల్ల విశేష ప్రతిభాపాటవాలున్నాయని తెలుసు. కానీ ఇంత నటనా ప్రతిభ ఉందని ‘తెల్వకండా’ పోయినందుకు చింతించవచ్చు. కిరణ్ ఇంత ద్విపాత్రాభినయం చెయ్యగలడని కూడా ముఖ్యంగా సినిమావాళ్లకు ‘తెల్వకండా’పోవడం కూడా మన అదృష్టం కావచ్చు. కానీ ఆయనలో ఒక గొప్ప ప్రజాస్వామ్యవాది కూడా ఉన్నారు. తెలంగాణలో ఉద్యమం జరిగినప్పుడు ఎంపీలను కూడా జైల్లల్ల పెట్టిండు, కనీసం ఎవరిని కూడా మెసలనియ్యలేదని ఆయనను ప్రజాస్వామ్యవిరోధి, నియంత అని కూడా భావించినవాళ్లు ఇప్పుడు తప్పు ఒప్పుకొని చెంపలేసుకోవాలి. తెలంగాణ ప్రకటించిన తర్వాత సీమాంధ్రలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమం చేసుకోవచ్చని చెబుతుంటే ఆహా! ఈ దేశంల కిరణ్ కన్నా ప్రజాస్వామ్యవాదులెవరని అనని వాళ్లు ప్రజాస్వామ్యవిరోధులే అనుకోవచ్చు.

పోలీసులతో కలిసి ఎట్లా ఉద్యమం చేయవచ్చో? ఎంత స్వేచ్ఛగా, పురుసత్‌గా ఇందిరాగాంధీ, నెహ్రూ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను కూల్చివేయవచ్చో? మంచిగ పగ్గాలు తెచ్చుకొని విగ్రహాల మెడలల్ల వేసి బల్మీటికి గుంజిపడేసి, మంచిగ సకులం ముకులం పెట్టుకొని కూసోని సుత్తెలు, గన్నులతోటి విగ్రహాలను ఎట్లా ధ్వంసం చెయ్యవచ్చో? కిరణ్ మార్కు ప్రజాస్వామ్యంలో మాత్రమే సాధ్యం. ముఖ్యమంత్రి కిరణ్ మహా ప్రజాస్వామ్యవాది కనుక ఉద్యమం కొత్తపుంతలు తొక్కింది. మంచిగ రోడ్ల మీద ఆరామ్‌గ టైర్లేసి కాల్చవచ్చు. ఏటీఎంలు పగులగొట్టవచ్చు. మంత్రుల ఇళ్లను తీరుపాటంగ పొయ్యి కుర్సీలు, బల్లలు ఇరుగకొట్టవచ్చు. నిజంగనే కిరణ్‌కుమార్‌డ్డి ఎంత ప్రజాస్వామ్యవాది, ఆయన గనుక లేకపోతే సీమాంధ్రల ప్రజాస్వామ్యం ఇంతగా పరిఢవిల్లేదా? అని కళ్లు చెమర్చనూవచ్చు. కిరణ్‌కుమార్‌రెడ్డిలో ఇంత ప్రజాస్వామ్యం దాగుందని కనిపెట్టలేకపోయినం. అదొక్కటే కాదు. మళ్లీ తెలంగాణల ఉద్యమం అవసరమైతే ఈ కిరణ్ మార్కు ప్రజాస్వామ్యం, ఎంత ఉపయోగకరమో. అందుకు కృతజ్ఞతలు.

కిరణ్‌కుమార్‌ రెడ్డి డబల్ యాక్షన్‌లో దిట్ట అని కూడా తెలియక అపార్థం చేసుకున్నం. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పినప్పుడు ఆయన ముఖం బాగా గుర్తున్నది. చాలాసార్లు సభలల్ల చెప్పిండు. మనమంత తెలంగాణే కద అన్నడు. నిజమే అనుకున్నం. ఎందుకంటే సీఎం డబల్ యాక్షన్ నిపుణత‘తెల్వకండా’ పోయినందుకు. మనల్ని మనం తిట్టుకోవాలి. తొమ్మిదిరోజులు ఆయన ఏమీ మాట్లాడనే లేదు. కానీ మొన్న మల్లా క్యాంపు ఆఫీసుల ఎంత బాగా నటించిండు. జబర్దస్త్. కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి ఎవరూ అక్కరకురారు. ముఖం పూర్తిగ మార్చిండు. ఏవో నోటికొచ్చిన లెక్కలు కూడ ధీమాతోటి చెప్పిండు. నోటికొచ్చిన అనుమానాలన్నీ ఫటాఫట్ చెప్పిండు. అప్పుడు తెలంగాణకు అనుకూలంగా ఉంటాడని, అనుకున్నప్పుడు ఎంత మంచి మొఖం పెట్టిండో? ఇప్పుడు లోపల తన్నుకులాడ్తున్న సీమాంధ్ర ఆత్మ ప్రతిఫలించేటట్టు ఎంత గంటు మొఖం పెట్టిండో.. ఈ మొఖాన్ని నేనైతేమరచిపోలేను. ఏదో ముల్లెపోయినట్టు ఎంతబాగ నటించిండో? అందుకని కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇంగ అపార్థం చేసుకోవద్దు. ఆయనలో ఒక గొప్ప ప్రజాస్వామ్యవాది, గొప్ప డబుల్‌యాక్షన్ సామర్థ్యంగల నటుడూ ఉన్నడు. అపార్థం చేసుకోవద్దు. అర్థం చేసుకోరూ.

ఒక్క కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రమే కాదు. డీజీపీ దినేష్‌రెడ్డి మీద కూడా ఆయన ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచివేస్తడు అని నాకో అనుమానం ఉండె. తెలంగాణలో ఆంధ్రా ప్రాంతీయ బుద్ధితో ఆయన పిల్లల మీద పోలీసులను ఉసికొల్పుతున్నడని కూడా ఉండె. కానీ.. జూలై 30 తర్వాత సీమాంధ్రలో ఉద్యమాలు నడుస్తున్న తీరు, మంచిగ అందరుకూడి ఉద్యమాలు చేస్తున్నతీరు, విగ్రహాలను, అంత మంచిగ కూలగొడ్తున్న తీరు, అయినా సెటాన సెంపదెబ్బ కొట్టకుండా ప్రజాస్వామ్యం నాలుగు కాళ్ల మీద నడుస్తున్న తీరు చూస్తుంటే దినేష్‌రెడ్డి మీద కూడా గౌరవం పెరిగిపోయింది. సోషలిస్టు రాజ్యాలల్ల మాత్రం పోలీసులు ఇట్లుంటరా. ఉద్యమాల పట్ల ఇంత సానుభూతిగా,సామరస్యంగా ఉంటరా? నిజానికి ఊర్కెనే తెలంగాణవాదులు, ఉద్యమకారులు పోలీసుల మీదపడి ఏడుస్తుంటరు కని ఇంత మంచి పోలీసు వ్యవస్థ భవిష్యత్‌లో ఇంకెంత మంచిగుంటదో కదా! ఒకవేళ తెలంగాణ ఏదన్న కిందిమీదైతే దినేష్‌రెడ్డి, ఆయన పోలీసు బృందం ఇప్పుడు సీమాంధ్రలో నేర్చుకుని అమలుపరుస్తున్న గొప్ప ప్రజాస్వామ్యస్ఫూర్తితో, పరిణతి పొంది తెలంగాణ ఉద్యమశక్తులకు మార్గదర్శకులు కాకమానరు.

అప్పుడు తెలంగాణల కూడా మంచిగ తీరుపాటంగా ఇష్టంలేని విగ్రహాలను కూలగొట్టవచ్చు. పగ్గాలు తెచ్చుకొని మంచిగ విగ్రహాలను గుంజిగుంజి కిందపడేసి నడిబజార్ల ఈడ్చుకపోవచ్చు. ఇదెంత మంచి మార్గదర్శకం. ప్రజాస్వామ్యాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్నా దినేష్‌రెడ్డి పోలీసు బృందంపైన కక్షగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని ఇప్పటికైనా తెలుసుకోగలిగినందుకు ఎంత ఆనందమో! తెలంగాణ ఉద్యమం మళ్లీ గనుక అనివార్యమైతే వస్తే ముఖ్యంగా మా యూనివర్సిటీ పిల్లలకు ఆ ఎన్‌సీసీ గేటుదా ఆరామ్‌గా వచ్చి విగ్రహాలు కూల్చిపోయే ఛాన్స్‌ను ఊహిస్తుంటెనే ఆహా ఏమి ఈ భారతదేశంలో, అందునా ఆంధ్రప్రదేశ్‌లో పుట్టినందువల్ల కదా! ఈ ప్రజాస్వామ్య ఫలాలు అందుకున్నాం అని ఎంత ఖుషీగ ఉన్నదో? ఒకవేళ విద్యార్థులు రాకున్నా ప్రజాస్వామ్యం కోసం దినేష్‌రెడ్డి గారి పోలీసులు గొరగొర గుంజుకచ్చి ఉద్యమం చేపిస్తరని నమ్మకం వచ్చింది.

‘అయ్యకు పుట్టిన ఆరుగురు పరమబాగోతులు’ అని… ఒక్క కిరణ్‌కుమార్‌డ్డి గొప్పతనం సంగతే కాదు. తెలంగాణను రెండోసారి సీడబ్ల్యూసీ ప్రకటించినంక సీమాంధ్ర మొత్తం నేతల ప్రతిభాపాటవాలు ఎంత బాగా బయటపడ్తున్నవో? అవి ‘తెల్వకండా’ ఎంత అపార్థమో..

ముఖ్యంగా చంద్రబాబు ప్రతిభ సంగతి తెలియజేసుకోవాలె. చంద్రబాబు ‘జ్ఞానం, ప్రతిభ’ మీదా సందేహాలుండె. అవి ఉత్తవని తేలింది. కానీ నిన్నటితోటి చంద్రబాబులో దాగున్న అద్భుత భవిష్యత్ దర్శకుడు బయటపడి నన్నునేను తిట్టుకున్నా. ముందు ఆయన సాత్వికునిలా, రామకృష్ణ పరమహంసలా మాట్లాడారు. ఆ తర్వాత గొప్ప సంయమనంలో రాజధానికి లక్షల కోట్లు కావాలని అన్నడు. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి డబల్‌యాక్షన్ ప్రతిభాపాటవాలకు దిగ్భ్రాంతి చెంది ఉన్నందువల్ల కూడా కావొచ్చు కానీ, ఆయన పోటీ పడ్డారు. సినిమాలల్ల చూపినట్టు ఆయన సంయమన ఆత్మతోటి అద్దంల అసలు సిసల్ అవ్వల్ సీమాంధ్ర ఆత్మ సంఘర్షించినట్టున్నది. దాంతోటి ప్రధానికి ఒక లేఖ రాసిండు. దాంట్ల విజ్ఞాన ప్రతిభ కొంచెం మరుగునపడింది. కని చంద్రబాబులోని నిఖార్సయిన జ్ఞానం ‘తెలుగు జాతి గౌరవం’ అనటంతోటే బయటపడిపోయింది.

చానకాలం నుంచి ఆయనకు సీఎం పదవి లేదు. కని పాపం ఆ లెక్క ఈ లెక్క చెప్పుకుంట సీఎం ననే భ్రాంతితో మనకు అనేక విషయాలు తెలియజేసుకోవటం తోటి, ప్రజల కోసం బాబు పడ్తున్న బాధ మనకు తెల్వలే. కని ఒక గుప్పిచ్చి మల్లా ‘తెలుగుజాతి ఆత్మగౌరవం’ యాత్ర చేస్తా అనేటాళ్లకు అర్థమయింది. అబ్బా బాబు బుర్రలో కదలాడే పాదరసం పవర్. సరిగ్గ ముప్పయేండ్ల కిందట ఎన్టీఆర్ ఇగో సరిగ్గ గీ తెలుగు జాతి ఆత్మగౌరవం తోటి తెలంగాణను మూడుకోలల లోతున పాతిపెట్టి మైరపింపజేసి కనికట్టు చేసిండు. అటెంక చంద్రబాబు అసెంబ్లీల తెలంగాణ అంటె మర్యాదదక్కదని కట్టడీ చేసిండు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. విభజన ఆగుతది. సీమాంధ్ర ఇట్లనే, ఎప్పటిపూక్కనె తెలంగాణ మీద సవారి కూడ చెయ్యవచ్చు. బాబు బ్రెయిన్‌ను గుర్తించనందుకు చాలామంది ఇప్పుడు బాధపడాలె. బాబు గందరగోళం మనిషని అనుకున్నవాళ్లు, రెండు కండ్ల సందిగ్ధవాది అనుకున్నవాళ్లు వీలైతే ఆయనకు సారీ చెప్పాలె. ఎందుకంటె తెలంగాణ ప్రకటన వచ్చినంక ఆయన మహాత్మగాంధీ లెవెల్లో ప్రశాంతంగ మాట్లాడిండు. ప్రధానికి రాసిన ఉత్తరంల కొంత అటు ఇటు కాకుండ రాసిండు. కని ఎంత క్లారిటీ. ‘తెలుగు జాతి ఆత్మగౌరవం’ అంటే తెలంగాణ అందరికి తెలుసు. ఎవరి గౌరవమో. ఇంగ అంతకన్న క్లారిటీ ఉంటదా? అర్థం చేసుకోరూ!

జగన్ మీద నాకు చిన్నచూపు ఉండేది. ఆయన మంచి వ్యాపారవేత్త. వ్యాపారాన్ని ఫ్యూడల్ సంకెళ్ల నుంచి విముక్తి చేసి, వాళ్ల నాయన కొనసాగింపుగా కార్పొరేట్ మహాసామ్రాజ్యాన్ని నిర్మించినప్పటికీ, ఆయన రాజకీయ పాండిత్యం మీద డౌట్ ఉండె. ఎందుకంటే ఇన్ని కంతలు పెట్టుకొని సోనియాగాంధీతోటి గొడవపడడం, వేరే పార్టీ పెట్టడం, తొందరపాటు, ఆవేశం, సీమ నేతల మార్కు మొండితనం అనుకున్నవానికి జగన్ ఒక్కసారి కళ్లు తెరిపించిండు. ఆయన క్రాంతిదర్శి అని తెలిసినంక కండ్లు పత్తికాయలయినయి. తెలంగాణ ఖాయం అని ముందుగాల కనిపెట్టింది జగన్. అందుకే సాఫ్‌సీదా ఆయన కుండబద్దలుకొట్టి నా భవిష్యత్ సీమాంధ్రలనే అని చెప్పిండు. తెలంగాణ నాది కాదన్నడు. ఇంత దూరదృష్టి ఎవరికైనా ఉంటదా? విభజన జరగదనుకున్నప్పుడు, ఏదో అట్లనే అంటరు, అది అయ్యేదుందా? పొయ్యేదుందా? అని నమ్మినప్పుడు, వాళ్లమ్మ విజయమ్మ అమరవీరుల స్తూపాలకు కూడా దండం పెట్టింది. ప్లీనరీల కొంచెం తెలంగాణ గడబిడ రక్తికట్టింది. షిండే దగ్గర మాకు అభ్యతరం లేదన్న ప్రకటనా వచ్చింది. కానీ భవిష్యత్ తెలుసుకోవడమే రాజకీయ చాతుర్యం, లక్షణం. అందుకే జగన్‌సారు ఒక భవిష్యత్ దర్శకుడని అనవచ్చు. ఆయన క్రాంతదర్శి కూడా. ఒకటే డౌటు జైలు ఎంత మంచి స్థలం.

ఎంత మంచి ఊహలు వస్తాయో? తెలంగాణ వస్తుందో? రాదో? ఎట్లాంటి టైములో ఖాయమో చెప్పగలిగిన ఒక పరిపూర్ణ రాజకీయ మార్గదర్శకం జైలులో మాత్రమే సాధ్యమేమో. చంచల్‌గూడ జైలుకేదో మహిమున్నది. తెలంగాణలో జగన్ పార్టీల చేరిన నాయకులకే జ్ఞానరాహిత్యం ఉన్నట్లు ఇప్పుడు అర్థమవుతున్నది. ఇగ అర్థం చేసుకోవాల్సింది తెలంగాణల అడుగుబొడుగున మిగిలిన వాళ్లే. సీమాంధ్ర, ఆత్మలు మేల్కొంటున్నప్పుడు గమనించకపోవడం, ఉల్టా జగన్ ద్రోహి అనడం నా మనసుకైతే బాధ కలుగుతున్నది. ఇంతకాలం ఆయన శక్తియుక్తుల మీద అనుమానం పెంచుకున్నందుకు క్షంతవ్యుణ్ని. అర్థం చేసుకోరూ.

ఇంకా చాలా మంది ఉన్నరు. కని ఒక సీఎం, ఒక ప్రతిపక్షనాయకుడు, ఒక భవిష్యత్ సీఎం (కలలు మాత్రమే)కంటున్న ముగ్గురి ప్రతిభాపాటవాలు, నటనా చాతుర్యం, భవిష్యత్ ధర్మమే. తెలంగాణ వాళ్లు ఒప్పుకోరు కానీ, ఇట్లాంటి నాయకత్వాలు ఎంత అవసరమో? కదా!

స్టేట్స్‌మన్ అంటె అట్లుండాలె ఇట్లుండాలె అని కొందరంటరు. అయితదా? ఈ ప్రపంచంల. స్టేట్స్‌మన్ లెక్క ఉంటే కలుస్తదా? అందుకే కద పాపం కిరణ్, జగన్, బాబు చాలా స్పష్టంగా, సూటిగా మేము ఆంధ్రోళ్లం, మీరు కొట్టినా, తిట్టినా, ప్రాణం తీసినా సరే. ఆంధ్ర, ప్రయోజనాలకే కట్టుబడి ఉంటం. అక్కడ ఉద్యమాలు జరిగితేనే స్పందిస్తం. అక్కడ ఆత్మహత్యలు జరిగితేనే ఏడుస్తం. ఇదే కద ప్రజాస్వామ్యం అని ఇంత సూటిగ ఇప్పటి దాంక ఎవరన్న చెప్పిండ్రా. అందుకే ఈ ముగ్గురు ఎంత మంచోళ్లో. ముద్దొస్తున్నరు. ముఖ్యంగా వారి నటనా పాటవాలకు నాకు ముచ్చటగ అనిపిస్తది. తెలంగాణోళ్లు ఇట్లుంటరా! ముక్కుమీద దెబ్బపూక్క నాయె. నేర్చుకోవాలె. చెప్తే వినరు.

ఇంక ఈ లిస్టుల లగడపాటి, కావూరి, చిరంజీవులు, ఉండవల్లి చాలామంది ఉన్నరు కని వాళ్లదేమిపూక్క.. ఆ ముగ్గురి సాటి ఎవరూ రారు. ఆడిన మాట ఎంత ప్రతిభావంతంగా తప్పవచ్చో చెప్పిన మహాత్ములు ఎందరో?

కోదండరాం శానా కష్టపడి విభజన జరిగిపోయిందని చెప్తండు. బలవంతంగా కలిసి ఉండలేమని, సమైక్య ఉద్యమాల్లో హేతుబద్ధత లేదని పెద్ద పెద్ద ముచ్చట్లు చెబుతండు. కని ఆ ముగ్గురు మేము ఆంధ్రోళ్లమే అని ఎంత సూటిగ చెప్పిండ్రు. ఎంత సూటిగ విడిపోయిండ్రు. తలుపుపెట్టి చెప్తాంటె కొలుపుపెట్టి అడుగుడెందుకు వాళ్లకున్న ‘కమ్యూనికేషన్ స్కిల్స్’ అబ్బుర పరిచేట్టులేవా? కొలువా కుమ్మరియ్యా!మేము ఆంధ్ర సీఎంలమే, ఆంధ్ర ప్రతిపక్షనాయకులమే, మేము భవిష్యత్తులో ఆంధ్ర ముఖ్యమంవూతులమే అని ఇంత సూటిగ చెప్పిన ఆ ముగ్గురి మీద మస్తు ప్రేమ అనిపిస్తుంది. అర్థం చేసుకోరూ! భవిష్యత్‌లో తెలంగాణల కూడా ప్రజాస్వామ్యం గురించి తలుచుకుంటే మంచిగ విగ్రహాలు కూలగొట్టవచ్చు. ఇష్టం లేకపోతే మంచిగ మంత్రుల ఇండ్లూ ముట్టడించవచ్చు. రోడ్లమీద టైర్లేసి కాల్చవచ్చు. అబ్బ ఎంత భవిష్యత్తో. అందుకు సీఎం కిరణ్‌కుమార్‌డ్డికి, డీజీపీ దినేష్‌డ్డికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలో? మా కండ్లు తెరిపిచ్చినందుకు ఆ ముగ్గురు ప్లస్ ఒక్కరికి థ్యాంక్స్.

తాజావార్త..
మనలాగే ఈ ముగ్గురే కాదు, అయ్యకు పుట్టిన పరమ బాగోతుల అసలులోతు అర్థం చేసుకోవడంలో విఫలమై వాళ్లను అపార్థం చేసుకొని ఊసర ఈ ఉద్యమాల నేపథ్యంలో సామూహిక ఆత్మహత్య చేసుకున్నయట! పాపం శమించుగాక.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *