హైదరాబాద్ నగరంలో త్వరలో 4జీ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నగరంలో 4జీ సేవల విస్తరణకు ఇటీవల రిలయన్స్ కంపెనీ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 4జీ వైఫై నగరంగా హైదరాబాద్ అనే అంశంపై గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఐటీ మంత్రి కేటీఆర్, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, రిలయన్స్ సంస్థ రాష్ట్ర సీఈఓ కే ఎస్ వేణుగోపాల్, కో ఆర్డినేటర్ పీవీఎల్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సేవలు వీలైనంత త్వరలో అందరికీ అందుబాటులోకి తేవాలన్నదే తమ ఉద్దేశమని, సేవలు విస్తరించడానికి ముందుకు వచ్చిన రిలయన్స్ కు సహకరించాలని సీఎం అధికారులకు సూచించారు. వైఫైతో ఇంటర్నెట్ సేవలు ఎంతో చౌకగా ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయని, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో కూడా 4జీ సేవలు ఎంతగానో దోహదపడతాయని కేసీఆర్ చెప్పారు. డిసెంబర్ నెలాఖరునాటికి నగరం మొత్తం 4జీ వైఫై నగరంగా మారాలని రిలయన్స్ అధికారులకు సీఎం సూచించారు.
వైఫై సేవలకోసం 4100 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని, హైదరాబాద్ నగరంలోనే 1700కి.మీ లలో ఆప్టిక్ ఫైబర్ కేబుల్ లైన్లు వేస్తున్నామని, ఇప్పటికే 500 కి.మీ మేర లైన్ల నిర్మాణం పూర్తయినట్లు, మొదటి ఆరునెలల వరకు ఉచితంగా వైఫై సేవలు అందిస్తామని రిలయన్స్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని వైఫై నగరంగా మారుస్తామని కూడా వారు చెప్పారు.