టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బంపర్ బొనాంజా ప్రకటించారు. కార్మికులు అడిగిన 43% కాకుండా ఊహించనివిధంగా 44% ఫిట్ మెంట్ ఇచ్చి ఆర్టీసీ కార్మికుల్లో సీఎం కేసీఆర్ సంతోషాన్ని నింపారు. దీంతో గత ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెను ఉద్యోగులు విరమించారు. అన్ని డిపోల్లో పటాకులు పేల్చి మిఠాయిలు పంచుకుని కార్మికులు సంబురాలు జరుపుకున్నారు. బుధవారం సాయంత్రం నుండి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు రోడ్లమీదకు వచ్చాయి. ఆర్టీసీ కార్మికులకు సౌకర్యాలు, ఫిట్ మెంట్ కు సంబంధించి బుధవారం ఉదయం నుండి సాయంత్రం 4 గంటల వరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులతో పాటు ఆర్టీసీ అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు 44% ఫిట్ మెంట్ ఇస్తున్నట్లు, పెరిగిన జీతాలు జూన్ నెలనుండి అమలులోకి వస్తాయని చెప్పారు. కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిల్లో 50% దసరా, ఉగాది, మళ్ళీ వచ్చే దసరా పండుగలకు ఇస్తామని, మరో 50శాతం బకాయిలను బాండ్ల రూపంలో ఇస్తామని, ఈ బాండ్లను ఐదేళ్ళ తర్వాత నగదుగా మార్చుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా సమ్మె సందర్భంగా కార్మికులపై పెట్టిన కేసులను యాజమాన్యం ఉపసంహరించుకుంటుందని సీఎం చెప్పారు. ఫిట్ మెంట్ ప్రకటన వెలువడగానే మీడియా సమావేశంలో ఉన్న కార్మిక సంఘాల నాయకులు పుష్పగుచ్చాలు ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అభినందనలు తెలిపారు.
సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆర్టీసీ సంస్థ ఈరోజు తీవ్ర నష్టాల్లో ఉందని, రూ. 1900 కోట్ల మేరకు అప్పుల్లో ఉందని, కార్మికులు చెప్పిన ప్రకారం వేతనాలు పెంచి ఇస్తే రూ. 1387 కోట్లు ఎరియర్స్ ఇవ్వాల్సి ఉంటుందని సీఎం వివరించారు. ఆర్టీసీ కార్మికుల వేతనాలు ఇతర సంస్థల ఉద్యోగులతో పోల్చితే అతి తక్కువగా ఉన్నాయని, పే రివిజన్ ను సకాలంలో అమలు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని, రెండేళ్లుగా పీఆర్సీని పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు. సంవత్సరానికి రూ. 821 కోట్ల అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుందని, ఇప్పటికే ఆర్టీసీ రూ. 400 కోట్లకు పైగా నష్టాల్లో నడుస్తుందని సీఎం వివరించారు.
ప్రతి ఏటా బడ్జెట్ లో ఆర్టీసీకి ప్రత్యేక గ్రాంట్ ఇస్తామని, హైదరాబాద్ లో తిరిగే బస్సుల బాధ్యతను జీహెచ్ఎంసీకి అప్పగిస్తామన్నారు. హైదరాబాద్ లో తిరిగే బస్సులన్నింటికీ రూ. 200 కోట్ల సబ్సిడీని తప్పనిసరిగా జీహెచ్ఎంసీ భరిస్తే సంస్థపై ఆర్ధికభారం తగ్గుతుందని, ప్రభుత్వం కూడా నష్టాన్ని భరిస్తూ సంస్థను ముందుకు తీసుకుపోవాలని సీఎం స్పష్టం చేశారు. బస్సు ఛార్జీలు స్వల్పంగా పెంచక తప్పదని, ప్రజలు కూడా పంచుకోవాలని, ఆర్టీసీ నుండి ప్రజలు వేరుకాదని అన్నారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు లక్షల్లో ఉన్నాయని, అనేక కుటుంబాలు సంస్థపై ఆధారపడి బతుకుతున్నాయని, వాళ్ళ భారాన్ని కూడా ప్రజలు భరించాలని సీఎం కేసీఆర్ కోరారు. ఆర్టీసీలో 4300 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని, వారందరినీ రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ రేపటినుండే ప్రారంభమవుతుందన్నారు. రిటైర్డ్ కార్మికులకు ఉచిత ప్రయాణం గురించి కార్మికులు అడుగగా, దీనిపై స్పందించిన సీఎం సంస్థలో పుట్టి పెరిగి రిటైర్ అయ్యారు కాబట్టి వారికి ఆ అవకాశం ఇవ్వడం ధర్మమని, తప్పకుండా ఎక్స్ ప్రెస్ బస్సుల వరకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తామని చెప్పారు.