mt_logo

4 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రం పనులు త్వరలో ప్రారంభం

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మూడురోజుల క్రితం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి అధికమొత్తంలో పన్నులు, నిధులు వస్తాయని ఆశించామని, అయితే చాలా సంస్థలు వాట్ ను ఆంధ్రప్రదేశ్ కే చెల్లిస్తున్నాయని, దానివల్ల తాము ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు.

గత పదేళ్లుగా మిగిలిన రాష్ట్రాలనుండి వసూలు చేసిన సుమారు పదివేల కోట్ల వాటాను ఉమ్మడి రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉండగా కేంద్రం ఆ వాటాను పెండింగ్ లో ఉంచింది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ అరుణ్ జైట్లీకి తెలిపారు. రాష్ట్ర్త విభజనను, కొత్త రాష్ట్ర ఏర్పాటును దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని కోరగా అందుకు అరుణ్ జైట్లీ అంగీకరించారని తెలిసింది. దీంతో మొత్తం పదివేల కోట్లలో తెలంగాణ రాష్ట్ర వాటా రూ. 4,700 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తం వాటా ఒకేసారి కాకుండా ఏడాదికి కొంత చొప్పున ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని సమాచారం.

నూతన రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్ మెంట్ (ఎఫ్ఆర్బీఎం) చట్టం పరిధిని సడలించాలని చేసిన విజ్ఞప్తిని కూడా కేంద్రం అంగీకరించిందని ఉన్నతాధికారులు కొందరు తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తామని కేంద్రం ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోవాలని కేసీఆర్ కోరారు. అనంతరం సీఎం ఎన్టీపీసీ చైర్మన్ తో భేటీ అయ్యి రాష్ట్రం తీవ్ర విద్యుత్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని, కొత్త విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటు పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. దీనిపై స్పందించిన సంస్థ చైర్మన్ ఎన్టీపీసీ బోర్డులో ఆమోదం తెలిపి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *