mt_logo

దుబాయ్ తెలంగాణ సోదరుల వెతలు తీరుస్తాం: ఈటెల రాజేందర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభపక్ష నేత శ్రీ. ఈటెల రాజేందర్ గారు గత 3 రోజులుగా దుబాయ్ లో పర్యటిస్తున్నారు. వారి పర్యటనలో భాగంగా వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న తెలంగాణా కార్మికులను వారి వారి లేబర్ క్యాంప్ లకు వెళ్ళి కలిసి, వారి సమస్యలను అదిగి తెలుసుకున్నారు.

దుబాయ్ లోని భారత కాన్సుల్ జనరల్ శ్రీ సంజై శర్మ గారిని కలిసి దుబాయ్ లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత కార్మికుల సమస్యలపై ఒక మెమోరాండం సమర్పించారు.

తెలుగులో మాట్లాడే ఒక కాన్సుల్ అధికారిని నియమించాలని, జైళ్ల మగ్గుతున్న తెలుగు వారికి న్యాయసహాయంతో పాటు వివిధ కారణాల వల్ల మృతిచెందిన తెలుగువారి భౌతికకాయాలను వెంటనే స్వస్థలాలకు పంపేందుకు కాన్సులేట్ అధికారులు సహకరించవలసిందింగా ఆ మెమోరాండంలో అభ్యర్దించారు.

కార్మిక దౌత్య అధికారి శ్రీ. ఎంపీ సింగ్ గారితో జరిగిన మీటింగ్ లో ఇక్కడి మన కార్మికులకు వారి వారి కంపనీల నుండి కనీస వేతనాలు ఇప్పించే విషయంలో చొరవతీసుకోవాలని కోరారు. అక్రమంగా ఇక్కడ ఉన్న మన కార్మికులకు ఎటువంటి శిక్షలు పడకుండా తిరిగి పంపించే విషయంలో సహాయం చేయాలని కోరారు.

ఈటెల రాజేందర్ గారు షార్జా, దుబాయ్ లోని లేబర్ క్యాంపులు సందర్శించి అక్కడ నివసిస్తున్న మన ప్రాంత కార్మికులను వారి సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు.

గురువారం సాయంత్రం గల్ఫ్ తెలంగాణ సంక్షేమ సంఘం (GTWCA) ఏర్పాటుచేసిన ఇష్టాగోష్టిలో తెలంగాణా ప్రాంతానికి చెందిన 100 మంది సభ్యులు రాజేందర్ గారిని ప్రస్తుత తెలంగాణా ఉద్యమ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణా సాధనకై ప్రత్యక్ష ఉద్యమంలో కూడా దిగడానికి సిద్దంగా ఉన్నట్టు సమావేశానికి వచ్చిన యువత పేర్కొన్నారు. సమావేశంలో GTWCA ప్రతినిధి జువ్వాడి శ్రీనివాస్ మున్ముందుగా మాట్లాడుతూ, గల్ఫ్ లో GTWCA చేస్తున్న సేవ కార్యక్రమాలు వివరించారు. గల్ఫ్ సమస్యలపై రాష్ట్ర అసెంబ్లీ లో మాట్లాడుతున్నందుకు రాజేందర్ గారికి ధన్యవాదాలు తెలియచేశారు. నరసింహ అనే కార్మికుడు దుబాయ్ లో పరిస్థితులను పాటగా రాసి పాడిన సందర్భంలో రాజేందర్ గారి కళ్ళు చెమర్చాయి.

ఈ సందర్భంగా రాజేందర్ గారు మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్ధిక సంక్షోభం ఒక్క అమెరికా, యూరోప్ లనే కాక అరబ్ దేశాలను కూడా కుదిపిందని దానితో ఇక్కడి పరిస్థితులు కూడా దెబ్బ తిన్నాయని తెలిపారు. GTWCA ద్వారా మన ప్రాంత ప్రజలు ఎటువంటి సమస్యలను తెలిపిన పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శంషాబాద్ ఏర్ పోర్ట్ లో అమలవుతున్న యూసర్ చార్జ్ విషయంలో సంబంధిత అధికారులతో చర్చిస్తామని చెప్పారు. చివరిగా తెలంగాణా ఏర్పాటులో జాప్యానికి అధికార పార్టీనే కారణమని, ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి తెలంగాణా సాధించుకుందామని తెలియచేశారు.

నరేందర్ రెడ్డి ఆధ్వర్యం లో జరిగిన ఈ సమావేశంలో  GTWCA  వై. శ్రీనివాస్ శర్మ, జువ్వాడి శ్రీనివాస రావు, సలాఉద్దిన్, మెట్ట రమేశ్చంద్ర, రఘు అంబటి, కిరణ్ కుమార్, మాదిరెడ్డి శ్రీనివాస్, రఫత్ నవాజ్, తిరుపతి రెడ్డి, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, శంకర్, ఇంకా గుర్రం శ్రీనివాస్ రెడ్డి ప్రభృతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *