పోలీస్ శాఖలో వివిధ క్యాటగిరీల్లో ప్రస్తుతం ఉన్న పరిమితిని మూడేళ్ళకు పెంచుతూ సంబంధిత ఫైల్ మీద ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంతకం చేశారు. పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల నియామకాల్లో జనరల్ క్యాటగిరీ అభ్యర్థులకు ప్రస్తుతమున్న 22 ఏళ్ల వయో పరిమితిని 25 ఏళ్లకు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితిని 27 ఏళ్ల నుండి 30 ఏళ్లకు పెంచారు. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్(ఎస్సై) పోస్టుల నియామకానికి జనరల్ క్యాటగిరీ అభ్యర్థుల వయోపరిమితిని 25 నుండి 28 ఏళ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్ క్యాటగిరీ అభ్యర్థులకు 30 నుండి 33 ఏళ్లకు పెంచారు. ఇదిలావుండగా పోలీస్ శాఖలో కమ్యూనికేషన్ల విభాగంలో332 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని కూడా సీఎం ఆదేశించారు.
ఉమ్మడి రాష్ట్రంలో గత 12 ఏళ్లుగా పోలీస్ శాఖలో ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. తాజాగా సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలిగింది. స్వరాష్ట్రంలో అన్ని శాఖల్లో భారీ నియామకాలు చేపట్టిన నేపథ్యంలో వయోపరిమితి దాటిపోయిన నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోస్టులన్నీ ఒకేసారి భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు కమ్యూనికేషన్ విభాగంలో 335 కానిస్టేబుల్ పోస్టులను కేటాయించారు. ప్రస్తుతం ఈ విభాగంలో ముగ్గురు మాత్రమే ఉండగా 332 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.