mt_logo

దళితులకు ౩ ఎకరాల భూపంపిణీ చేయనున్న సీఎం కేసీఆర్

ఎస్సీ సబ్ ప్లాన్ ను ఎలాంటి పొరపాట్లు లేకుండా అమలు చేస్తామని, భూమిలేని వ్యవసాయాధార దళిత కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున సాగుభూమిని అందజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఈ పథకం ఆగస్టు 15న ప్రారంభం అవుతుందని, కరీంనగర్ లో మొదట తాను ప్రారంభిస్తానని, తర్వాత నుండి అన్ని జిల్లాల్లో చేపట్టబోయే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని కేసీఆర్ తెలిపారు.

ఈ మూడెకరాల సాగుభూమి దళిత మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేస్తామని, ఈలోపు గ్రామాల్లో దళితుల స్థితిగతులకు సంబంధించి గ్రామాల్లో సర్వే నిర్వహించి ఆగస్టు 15 లోపు నివేదిక ఇవ్వాలని సీఎం సూచించారు. దళితులకు భూపంపిణీ కార్యక్రమాన్ని ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా ప్రజాప్రతినిధుల సహకారంతో పూర్తి చేయాలని దళితవాడలతో మమేకం కావాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటివరకు దళితుల అభివృద్ధి పేరిట ప్రచారం బాగా జరిగింది కానీ వాళ్ళ బతుకుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని, వారి అభివృద్ధి కోసం రూపొందించే పథకాలు, కార్యక్రమాల విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలవాలని పేర్కొన్నారు.

సాంఘిక సంక్షేమ శాఖ పేరును ఎస్సీ అభివృద్ధి శాఖగా మార్చాలని అధికారులకు సూచించారు. దళితుల కోసం కేటాయించే 15.4 శాతం నిధులను కేవలం ఎస్సీ డెవలప్మెంట్ డిపార్టుమెంటుకే ఇస్తుందని, దళితులు ఎందుకు అభివృద్ధి చెందరో తేల్చుకుందామనే ఉద్దేశంతోనే సాంఘిక సంక్షేమ శాఖ తన వద్ద పెట్టుకున్నానని సీఎం స్పష్టం చేశారు. గ్రామాల వారీగా దళితుల విద్య, ఆరోగ్యం, వయస్సు, భూమి, ఉద్యోగం తదితర అంశాలపై సమగ్ర వివరాలతో నివేదిక తయారు చేయాలని, దాని ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కేసీఆర్ కలెక్టర్లను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *