mt_logo

తెలంగాణలో కొత్తగా మరో 12 జిల్లాలు?

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 10 నుండి 12 జిల్లాలు ఏర్పాటుచేసే అవకాశమున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాల విభజన ప్రక్రియ కూడా ఆచరణలోకి తేవడానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సీమాంధ్రలో కూడా జిల్లాల పునర్విభజన జరగనుంది. జనాభా విస్తీర్ణం, వెనుకబాటుతనం ఆధారంగా జిల్లాలను పునర్విభజించాలని నిర్ణయం తీసుకున్నారు. పక్క రాష్ట్రాల జనాభా, భౌగోళిక విస్తీర్ణం, జిల్లాల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని ఇప్పుడున్న జిల్లాలకు తోడు మరికొన్ని జిల్లాలను భారీగా పెంచనున్నారు. పొరుగున ఉన్న కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల విస్తీర్ణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే చాలా తక్కువే అయినా జిల్లాలు మాత్రం అధికంగా ఉన్నాయి. తెలంగాణలో 12, సీమాంధ్రలో మరో 10 జిల్లాల రూపకల్పనకు శ్రీకారం చుట్టనున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలను పెంచాలన్న డిమాండ్ ఇప్పటిది కాదు. 1970 లోనే గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలను పునర్విభజించి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం,విశాఖ జిల్లాలనుండి విజయనగరం ను జిల్లాగా ఏర్పాటు చేశారు. 1978లో హైదరాబాద్ చుట్టూ ఉన్న శివారు ప్రాంతాలను కలిపి రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజనతో పాటే జిల్లాల విభజన కూడా త్వరలో కార్యరూపం దాల్చనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *