mt_logo

నేటినుంచి మెట్రో పొలిస్ సదస్సు

-హెచ్‌ఐసీసీలో ఏర్పాట్లు పూర్తి
-ప్రారంభించనున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
-రేపు గవర్నర్ నరసింహన్ ప్రారంభోపన్యాసం
-పాల్గొననున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ వేదికగా ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ 11వ మేయర్ల సదస్సు (మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్) కు సర్వం సిద్ధమైంది. నగరంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు సోమవారం ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించనున్నారు. స్మార్ట్ సిటీస్ అండ్ సిటీస్ ఫర్ ఆల్ అనే ఎజెండాతో ఐదురోజులపాటు జరుగనున్న ఈ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ సకల ఏర్పాట్లు చేశాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరంలో జరుగుతున్న తొలి అంతర్జాతీయ సదస్సు కావడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని.. సౌకర్యాలు కల్పించాయి. నగరాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలపై చర్చించనున్న ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు చెందిన 400మంది విదేశీ ప్రతినిధులు, దేశంలోని 458 నగరాల నుంచి 1,653 మంది మేయర్లు, ఇతర ప్రతినిధులు పాల్గొననున్నారు. గవర్నర్ నరసింహన్ మంగళవారం సదస్సుకు హాజరై.. అంతర్జాతీయ ప్రతినిధులను ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేయనున్నారు.

అదేరోజున ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. 9న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ముగింపు ఉపన్యాసం చేస్తారు. జొహాన్నెస్‌బర్గ్, బార్సిలోనా, బెర్లిన్, టెహరాన్ వంటి దేశాల నుంచి సాంకేతికంగా, పరిపాలనాపరంగా అనుభవజ్ఞులైన వారు ఈ సదస్సులో పాల్గొని వారి అనుభవాలను వివరిస్తారు. సదస్సులో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలన అనే అంశంపై ప్రధాన ప్రసంగం చేయనున్నారు. రక్షణశాఖ పరిశోధన విభాగం మాజీ చీఫ్ వీకే సారస్వత్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత రాజేంద్రపచౌరి కూడా తమ అనుభవాలను పంచుకోనున్నారు. పట్ణణాలు, నగరాల అభివృద్ధికి ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలను వారు వివరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితి.. మారుతున్న నగరాలు అనే అంశంపై వీరు ప్రసంగించనున్నారు.

స్మార్ట్‌సిటీస్, హెల్త్‌సిటీస్‌పై ప్రజంటేషన్..
ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న పరిస్థితులపై అన్ని ప్రాంతాల ప్రజాప్రతినిధులు చర్చించుకొని.. అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ఏర్పాటుచేసిన వేదిక అంతర్జాతీయ మేయర్ల సదస్సు. ఇది 1985లో ఏర్పాటైంది. ఇందులో వివిధ దేశాలకు చెందిన 130 మంది సభ్యులుగా ఉన్నారు. పలు దేశాల్లో అమలులో ఉన్న స్మార్ట్ సిటీ, హెల్త్ సిటీ, శాటిలైట్ హౌసింగ్ టౌన్‌షిప్‌ల నిర్మాణంపై ఈసారి సదస్సులో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.

బార్సిలోనా, మెక్సికో, సియోల్ వంటి ప్రదేశాల్లో మహిళలు, పర్యావరణ రక్షణ కోసం నిర్మించిన భవనాలపై ఆయా దేశాల ప్రతినిధులు వివరిస్తారు. దేశవిదేశాల నుంచి వస్తున్న ప్రతినిధుల కోసం హెచ్‌ఐసీసీలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. మేయర్ల సదస్సు చివరిరోజున హాజరైన ప్రతినిధులు హైదరాబాద్ నగరంలోని మెట్రోరైల్, హుస్సేన్ సాగర్, హరిత భవన్, సైబరాబాద్ పరిధిలోని ఐటీ కారిడార్‌లను సందర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే మహిళా స్వయం సహాయక బృందాలతో సమావేశం ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ మేయర్ల సదస్సు భద్రత కోసం 750 మంది పోలీసులను ఏర్పాటుచేశామని, విదేశీ ప్రతినిధులకు నగర సందర్శనలో సహాయపడేందుకు 60 మంది పోలీసులను గైడ్స్‌గా నియమించినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు
మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగనున్న మెట్రోపొలిస్ సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హెచ్‌ఐసీసీలోని హాళ్లు, వేదికలు, ప్లీనరీ సమావేశ మందిరాలు సిద్ధమయ్యాయి. సదస్సు జరిగే ప్రాంతాలతోపాటు, దేశవిదేశాల ప్రతినిధులు సందర్శించే ప్రదేశాలు, రాకపోకలు సాగించే రహదారులను ఇప్పటికే అందంగా తీర్చిదిద్దారు. రహదారులపై రంగురంగుల పూలకుండీలను ఏర్పాటుచేశారు. పలుచోట్ల స్వాగత తోరణాలు ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మాదాపూర్ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన బతుకమ్మ, బోనాల నమూనాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే సదస్సు పరిసరాలను తమ అధీనంలోకి తీసుకొని కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.

పిల్లల కార్యక్రమంతో మొదలు..
వరల్డ్ మెట్రోపొలిస్ సదస్సు సోమవారం పిల్లల కార్యక్రమంతో ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు వాయిస్ ఆఫ్ చిల్డ్రన్ కార్యక్రమంతో సదస్సును లాంఛనంగా ప్రారంభిస్తారు. మెట్రోపాలిటన్ నగరాల్లోని బాలల పరిస్థితులు, స్థితిగతులపై ఈ కార్యక్రమంలో చర్చించనున్నారు.

సోమవారం నాటి ఎజెండా ఇది
మెట్రోపొలిస్ సదస్సులో భాగంగా సోమవారం ఉదయ 9 గంటల నుంచి 11 గంటల వరకు హాబిటేట్ అర్బన్ ఇండియాపై చర్చ, మెట్రోపొలిస్ రీజినల్ సెక్రటరీల సమావేశం, హౌసింగ్ ఫర్ ఆల్ అంశంపై ఓపెస్ సెషన్, మెట్రోపొలిస్ హైదరాబాద్ అర్బన్ హాకథాన్ (విజన్ 2022) జరుగనున్నాయి. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మెట్రోపొలిస్ యూత్ డ్రైవింగ్‌పై చర్చ, హౌజింగ్ ఫర్ ఆల్‌పై రౌండ్ టేబుల్ సమావేశం, మెట్రోపొలిస్ ట్రైనింగ్ ఎమ్‌ఐటీఐ వార్షిక సమావేశం జరుగుతాయి. అలాగే రైట్ టు హౌసింగ్- రైట్ టు లైవ్లీహుడ్, హాబిటేట్ అర్బన్ ఇండియాపై, మెట్రో పొలిస్ హైదరాబాద్ అర్బన్ హాకథాన్‌పై చర్చ కొనసాగుతుంది.

మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు మెట్రోపాలిటన్ గవర్నెన్స్, హౌజింగ్ ఫర్ ఆల్ మొబలైజింగ్ ది రీసోర్సెస్, ఇన్‌క్లూజివ్ సేఫ్, రీసైలెంట్ అండ్ సస్టెనెబుల్ సిటీ హాబిటేట్, హైదరాబాద్ అర్బన్ హాకథాన్ (విజన్ 2022), మెట్రోపొలిస్ జ్యూరీ మీటింగ్ జరుగుతాయి. సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు మెట్రోపాలిటన్ గవర్నెన్స్, మెట్రోపొలిస్ రిజినల్ సెక్రటరీల సమావేశం, హౌజింగ్ ఫర్ ఆల్ ది అదర్ సైడ్ (నాస్వీ, నిదాన్, సేవా, డబ్బావాలాపై ప్రత్యేక ఫీచర్), మెట్రోపొలిస్ హైదరాబాద్ అర్బన్ హాకథాన్ జరుగుతాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు తారామతి బారాదరిలో ఆర్ట్ ఆఫ్ తెలంగాణ కార్యక్రమం ఉంటుంది. 8 నుంచి 10 గంటల వరకు తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో తారామతి బారాదరిలో ప్రతినిధులకు భోజనవసతి ఏర్పాటు చేశారు.

10 చర్చనీయాంశాలు..
మెట్రో పొలిస్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సులో భాగంగా 10 కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. నగరాల్లో సమస్యలు, అభివృద్ధి, ఆర్థికవృద్ధి, ఉపాధి, సుపరిపాలన, వ్యాపార వృద్ధి, పట్టణ నిర్వహణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ నెట్‌వర్కింగ్, రవాణా, రోడ్డు, మురికివాడల అభివృద్ధి, గృహనిర్మాణం, మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్య సదుపాయాల మెరుగు, కాలుష్య నియంత్రణ, స్మార్ట్ సిటీ లాంటి అంశాలపై చర్చిస్తారు. గత 10 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, అమలు, వచ్చిన ఫలితాలు, తెలంగాణలోని నగరాల్లో సమస్యలు, ఇతర సాంకేతిక అంశాలపై అన్ని రంగాల వారు ప్రసంగిస్తారు. చర్చల్లో పాల్గొంటారు. వారి అనుభవాల ఆధారంగా ఈ సమస్యల పరిష్కారానికి కొత్త పరిష్కార మార్గాలను సదస్సులో అన్వేషిస్తారు.

కాలుష్య సమస్యకు పరిష్కారం కావాలి..: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో అత్యంత కీలకమైనది కాలుష్యం. నగరాల్లో ఇప్పటివరకు ఉన్న నీరు, వాయువు, శబ్ద కాలుష్యాలకు తాజాగా ఈ వేస్ట్, పారిశ్రామిక వర్థ్యాలు, బయోమెడికల్ వ్యర్థాలు వంటివి తోడై సవాల్ విసురుతున్నాయి. అంతర్జాతీయంగా అనేక నగరాలను పట్టిపీడిస్తున్న ఈ సమస్య గురించి మేయర్ల సదస్సు వేదికగా చర్చించనున్నారు. అంతర్జాతీయంగా వివిధ నగరాల్లో కాలుష్యాన్ని జయించిన తీరును వివరించనున్నారు.

స్మార్ట్ ఈజ్ బెస్ట్..: ప్రజాజీవితాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు అధునిక సాంకేతికను ఉపయోగించుకొని స్మార్ట్‌సిటీలను నిర్మించడమే లక్ష్యం. అంతర్జాతీయ ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ సిటీలను పరిశీలించి ఎనిమిది కీలకాంశాలను గుర్తించింది. పరిపాలన, విద్యుత్, భవనాలు, రవాణా, మౌలిక సదూపాయాలు, టెక్నాలజీ, ఆరోగ్య సేవలు, ఆధునిక టెక్నాలజీ వంటివి ఆధారంగా స్మార్ట్‌సిటీలను నిర్ధారించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశంలో 100 స్మార్ట్‌సిటీలను నిర్మిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌సిటీస్ అంశంపై సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు.

ఆవాసం..అత్యావశ్యకం..: ప్రపంచవ్యాప్తంగా ఆవాసం అత్యావశ్యకంగా మారింది. మనిషి కనీస అవసరాల జాబితాలో ఆవాసాలను పొందుపరిచినా 40 శాతం ప్రజలు ఇప్పటికే ఇండ్లు లేకుండానే నివసిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం హౌసింగ్ ఫర్ ఆల్ హ్యాబిటెట్ అనే అంశంపై సదస్సులో రెండు సెషన్లు జరగనున్నాయి. అలాగే పట్టణ ఆర్థిక వ్యవస్థను (అర్బన్ ఎకానమీ) బలోపేతం చేయడానికి సదస్సులో కీలక చర్చలు సాగనున్నాయి. ప్రముఖ ఆర్థికవేత్త ఓం మాధుర్ ఈ అంశంపై ప్రసంగించనున్నారు. ఆదాయాన్ని పెంచుకోవడం, వనరులను సద్వినియోగం చేసుకోవడమనేది ఈ చర్చల్లో ప్రధానాంశం.

ప్రతిపక్షాలకు దీటైన జవాబు
ప్రతి చిన్న విషయాన్నీ రాద్దాంతం చేస్తున్న ప్రతిపక్షాలపై కూడా టీఆర్‌ఎస్ అధినేత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదేండ్లలో చేయలేని పని.. మూడ్నెళ్ల పసిగుడ్డు చేస్తుందా? మాట్లాడితే అర్థంపర్థం ఉండాలి. ఇది రాజకీయమా? మెదక్ ఉప ఎన్నికల ఫలితాలతోనూ బుద్ధి రాలేదు… ఇక వచ్చేట్టు లేదు. మనమేం చేయలేం… ఆ భగవంతుడే వాళ్లకు సాయం చేయాలి అని మాటల తూటాలు పేల్చారు. సొంత పార్టీ నేత పీవీని విస్మరించిన కాంగ్రెస్ నేతల బానిసత్వం… కరెంటు కష్టాలకు కారణమవుతున్న పచ్చ పార్టీ కర్కశత్వం… చివరకు మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో పేకాట క్లబ్ సిబ్బందిని వినియోగించుకున్న పార్టీల నీచ సంస్కృతిని ఎండగట్టారు.

Source: నమస్తే తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *