By: రాజు అసరి
అందరికి సమన్యాయం చేయాలి. లేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా కొనసాగించాలని వైఎస్‌ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది. సమన్యాయం అంటే విభజనకు అంగీకరించినట్టే అని పొద్దున ఓ టీవీ ఛానల్ చర్చలో ఓ సీనియర్ పాత్రికేయుడు అన్నారు. సమన్యాయం అంటే ఏమిటో చెప్పాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌నేతలు విజయమ్మను డిమాండ్ చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి దీనికి నిర్దిష్టమైన సమాధానం లేదు. కానీ విభజనపై కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ఆ పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర కోరుతూ నిరవధిక దీక్ష చేస్తున్నారు. ఇప్పుడు విజయమ్మ కూడా దీక్ష చేస్తారట! ఇక చంద్రబాబు తెలంగాణపై సీడబ్ల్యూసీ, యూపీఏ సమన్వయ కమిటీ తీర్మానాల తర్వాత సీమాంధ్రకు కొత్త రాజధానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయాలు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలాగే సమైక్యాంధ్ర కోసం ఏపీఎన్జీవోల సమ్మెకు మద్దతు ఇవ్వాలని ఆ సంఘం నేతలు బాబును కలిశారట. అయితే తెలంగాణపై తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్నారట, అందుకే వాళ్ల సమ్మెకు మద్దతు ఇవ్వలేను అన్నారని మీడియాలో వచ్చిన సమాచారం. కానీ సీమాంధ్ర టీడీపీ నేతలు మాత్రం తమదే స్వచ్ఛమైన సమైక్యాంధ్ర ఉద్యమం అంటున్నారు. వాళ్లూ దీక్షలు చేస్తున్నారు. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అదీ ఆ పార్టీ అత్యున్నత కమిటీ సీడబ్ల్యూసీ. పార్టీ నిర్ణయాన్ని అందరూ ఆమోదించాల్సిందేనని హస్తిన పెద్దలు చెబుతున్నారు. అయితే దీనికి ఆంధ్రప్రదేశ్‌లోని సీమాంధ్ర నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణపై నిర్ణయం వెలువడగానే ప్రెస్‌మీట్ పెట్టి విభజన పాపం వైఎస్‌దేనని చెప్పారు. అలాగే వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీలు కూడా విభజనకు అంగీకరించాయన్నారు. విభజనను తాను వ్యతిరేకించినట్టు కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పుకున్నారు. అయితే వైఎస్ తెలంగాణకు అనుకూలంగా 41 మంది ఎమ్మెల్యేల సంతకాలతో సోనియాకు లేఖ రాయించినప్పుడు నల్లారి వారు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ విభజన కోరుతున్న టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నప్పుడు అదే పార్టీ ఎమ్మెల్యేగాపోటీచేశారు. వైఎస్ ప్రభుత్వంలో చీఫ్‌విప్‌గా పనిచేశారు. తెలంగాణ అంశాన్ని యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రాం, రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. 2009లోనూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదన్నప్పుడు నల్లారి వారు పార్టీ మారలేదు. అలాగే తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ చేసిన సంప్రదింపుల్లో ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్నారు. నిర్ణయం తీసుకున్నాక కూడా నల్లారి వారి మాట మారింది.కానీ ఆయన పార్టీ మారలేదు. పదవీ మారలేదు. తెలంగాణ అనుకూల ప్రకటన తర్వాత సీమాంధ్రలో లొల్లి చేస్తున్న నేతలంతా ఈ మూడు పార్టీలకు చెందిన వారే కావడం విశేషం. వీళ్లను నమ్ముకుని ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏపీఎన్జీవోలు సమ్మె చేయడమే విడ్డూరం. ఎందుకంటే ఈ సంఘం నేతల ప్రధాన డిమాండు కేంద్ర మంత్రులు మొదలు సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాలి. తమతో కలసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏపీఎన్జీవోల రాజీనామా డిమాండ్‌ను అధికార పార్టీ వాళ్లలో కొందరు ఇప్పటికే తప్పుపట్టారు. తెలంగాణ బిల్లు వస్తే తాము వ్యతిరేకంగా ఓటు వేసి, ఆ బిల్లు వీగిపోయేట్టు చేయాలి కాబట్టి మేం రాజీనామా చేస్తే ఎలా అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇప్పటికే సమైక్యాంధ్ర కోసం చాలామంది రాజీనామా చేశారు. గుంపులో గోవిందాలా రాజీనామా చేస్తే పోయేది ఏముంది (ఆమోదం పొందినా ఎన్నికలు రావు అన్నది వారి నమ్మకం) ‘రాజీ’ నామాల బాట పడుతున్నారు. వీళ్లలో ఎవరివి ఆమోదం పొందుతాయో తెలియదు కానీ అందరూ సమైక్యాంధ్రే అంటున్నారు. ఆ మధ్య తెలంగాణపై ముఖ్యమంత్రి వెటకారంగా ఇక్కడ అందరూ జై తెలంగాణే కాదని ఎవరు అన్నారు అన్నట్టు ఉన్నది సమైక్యాంధ్ర వాదన పరిస్థితి. అయితే ఏపీఎన్జీవోల నేతలు సమైక్యాంధ్ర కోసం ఎవరూ ఉద్యమించినా, ఎవరూ దీక్షలు చేసినా తమ మద్దతు ఉంటుంది అని వారికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి వస్తున్నారు. ఈ వార్తలు మీడియాలో పుంఖానుపుంకాలుగా వస్తున్నాయి. హస్తిన పెద్దలు మాత్రం విభజనపై వెనక్కి వెళ్లేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. అందరూ అంగీకరించాకే కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందని రాజ్యసభలో చిదంబరం ప్రకటించారు. ఈ వార్తలూ మీడియాలో వస్తున్నాయి. ఇంకా ఏపీఎన్జీవోలు ఏం ఆశించి సమ్మె చేస్తున్నారో, సమైక్యాంధ్ర ప్రకటన ఎట్లా వస్తుందో వారికే తెలియాలి. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమానికి ఓ దిశా నిర్దేశం లేదని కొన్నిరోజులుగా అక్కడ జరుగుతున్న వికృత పరిణామాలే సాక్ష్యం. 2009 డిసెంబర్ 9 తర్వాత ఇరు ప్రాంతాల ప్రజల మధ్య మానసిక విభజన వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తర్వాత భౌగోళిక విభజన అనివార్యం అని తేలిపోయంది. దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది అన్నదమ్ముల్లా విడిపోదాం అంటున్న తెలంగాణ వారిపై అక్కసుతో దాడులు చేస్తున్నారు. ఇవన్నీ చూశాక కూడా ఏపీఎన్జీవోలు ఇంకా సమైక్యాంధ్ర అంటే సబబు కాదేమో! తెలంగాణపై నిర్ణయం జరిగాక దానికి కారణం మీరంటే మీరు అని ఒకరినొకరు నిందించుకుంటున్నారు. తెలంగాణలో ఓట్ల కోసం అన్ని పార్టీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడ్డాయన్నది సుస్పష్టం. అయితే వీళ్ల రాజకీయం ఎలా ఉన్నా ఈ ప్రాంత ప్రజలది మాత్రం ఐదున్నర దశాబ్దాల అలుపెరగని పోరాటం. దీన్ని సీమాంధ్ర ఉద్యోగులు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.