mt_logo

పాలకుర్తి గాయం వీరకిశోరాల త్యాగం

వేలాది మంది పోలీసులు ఉంటారని తెలుసు. చంద్రదండు దుడ్డు కర్రలతో వస్తుందన్న సంగతీ తెలుసు. అయినా వారిని తెలంగాణ ఆకాంక్ష ముందుకు నడిపించింది. ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ చంద్రబాబుకు తెలంగాణ ఆకాంక్ష వినిపిస్తున్నామన్న మొండి ధైర్యంతో ఆ యువకులు చంద్రబాబు సభకు వెళ్లారు. బాబు సమక్షంలో కిశోరాలై గర్జించారు. వేలాదిమంది పోలీసులు, చంద్రదండు కళ్లు కప్పి పాలకుర్తి సభలోకి ఒక్కొక్కరుగా ప్రవేశించారు పలువురు తెలంగాణ యువకులు. కొందరు మూడు రోజుల ముందే పాలకుర్తికి చేరుకున్నారు. మరికొందరు సభ జరిగే రోజు ఉదయం 9 గంటలకు టీడీపీ కండువా మెడలో వేసుకుని, పచ్చ టోపీ పెట్టుకుని పార్టీ కార్యకర్తల్లాగా సభాస్థలికి చేరుకున్నారు. అనుకున్న ప్రకారం ముందు గ్యాలరీలలో రెండు గంటల ముందే కూర్చున్నారు. అప్పటికే గుండెనిండా తెలంగాణ ఆకాంక్ష రగిలి ఉంది. చంద్రబాబు ప్రసంగించడానికి లేవగానే వారిలోని ఆకాంక్ష బయటికి తన్నుకొచ్చింది. జై తెలంగాణ… ఆంధ్రాబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బూట్లు, చెప్పులు వేదికపైకి విసిరారు. అంతే.. పొద్దంతా రౌడీదండులా ప్రవర్తించిన చంద్రదండు ఒక్కసారిగా ఆ వీరకిశోరాలపై దాడికి దిగింది. దుడ్డు కర్రలు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా బాదిపడేశారు. రక్తాలు కారినా చలించలేదు. ఎయ్యండిరా… దంచండిరా… చంపండిరా అంటూ వారిపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో నాడు మానుకోట.. ఇప్పుడు పాలకుర్తి! తెలంగాణ ఉద్యమంలో మరో నెత్తుటిగాయం!

‘పాలకుర్తి గాయం’పై ఆ వీరకిశోరాల మాటల్లోనే…

టీడీపీ కార్యకర్త వేషంలో వెళ్లా..
– కంచర్ల మనోజ్‌కుమార్, కేయు విద్యార్థి

మధ్యాహ్నం 12గంటలకు ఆటోలో 10మందితో కలిసి బయలుదేరాను. పోలీసుల పికెట్ల దగ్గర, టీడీపీ నాయకుల గుంపులు కనిపిస్తే జై తెలుగుదేశం నినాదాలు చేస్తూ సభ వరకు వెళ్లాను. ముందు అనుకున్నట్టుగానే చంద్రబాబు మాట్లాడుతుంటే జై తెలంగాణ.. ఆంధ్రాబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశాను. అంతే చంద్రదండు దుడ్డు కర్రలతో, ఇనుప రాడ్లతో ఎయ్యిరా ఎయ్ అంటూ కొట్టారు. పోలీసులే ఆసుపత్రికి తరలించారు.

మూడు రోజుల ముందే వెళ్లా…
– గోగుల మహేందర్‌డ్డి కేయు విద్యార్థి

చంద్రబాబు సభలో తెలంగాణవాదం వినిపించాలని మూడు రోజుల ముందే పాలకుర్తికి వెళ్లాను. ఆ రోజు మధ్యాహ్నం 3గంటలకే సభలోకి ప్రవేశించాను. చంద్రబాబు మాట్లాడటం మొదలుపెట్టగానే జై తెలంగాణ నినాదాలు చేశాను. బాబు ప్రైవేటు సైన్యం ఇనుప రాడ్లు, కర్రలతో దాడులు చేసింది. ఎర్రబెల్లి కొట్టండంటూ సైగలు చేయడంతో మరింత రెచ్చిపోయారు.

గ్రూపులుగా విడిపోయి సభలో ప్రవేశించాం..
– నీలం రాజ్‌కిషోర్, టీఆర్‌ఎస్‌వి నాయకుడు

సభ జరిగే రోజు మధ్యాహ్నం వరంగల్ నుంచి బయలుదేరాను. సరిగ్గా గంట ముందు సభలోకి ప్రవేశించాం. గ్రూపులుగా విడిపోయాం. చంద్రబాబు ప్రసంగిస్తుండగానే ఒక్కసారిగా జై తెలంగాణ నినాదాలు చేశాం. అంతే వెనక నుంచి కర్రల దెబ్బలు మీద పడ్డాయి. పక్కనే పోలీసులు ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయారు.

జై తెలంగాణ అన్నాను.. అంతే దంచారు
– మోడెం ప్రవీణ్, కేయువిద్యార్థి

రెండు రోజుల క్రితమే నిర్ణయించుకున్నా… చచ్చినా పర్వాలేదు చంద్రబాబు సభలో తెలంగాణ నినాదాలు చేయాలనుకున్నా. టీడీపీ జెండా పట్టుకుని కార్యకర్తలాగా సభలోకి వెళ్లాను. చంద్రబాబు మాట్లాడుతుండగానే జై తెలంగాణ నినాదాలు చేశాను. అంతే 20మంది తెలుగుదేశం టీషర్టులు వేసుకున్న వ్యక్తులు మీద పడి కర్రలతో కొట్టారు. సివిల్ పోలీసులు అడ్డుకుని కాపాడి ఆస్పవూతికి తరలించారు.

దెబ్బలకు స్పృహ తప్పి పడిపోయా…
– బాలకృష్ణ కేయు విద్యార్థి

మూడు రోజుల ముందే పాలకుర్తి చేరుకున్నాం. నలుగురు స్నేహితులం కలిసి వెళ్లాం. ఎలాగైనా సభలో తెలంగాణ వాణి వినిపించాలని సభలోకి ప్రవేశించాం. సభలో జై తెలంగాణ నినాదాలు చేయడమే ఆలస్యం పిడిగుద్దులు మొదలయ్యాయి. రెండు నిమిషాల్లోనే ఆ దెబ్బలకు స్పృహ తప్పాను. లేచేసరికి జనగామ దవాఖానలో ఉన్నాను.

పోలీసులు కాపాడారు…
– సురేష్, కేయు విద్యార్థి

పోలీసులు లేకుంటే చంపేసేవారే. సభలో తెలంగాణ నినాదాలు చేయగానే చంపండిరా అంటూ ‘దయన్న నాయకత్వం వర్థిల్లాలి’ అని రాసున్న టీ షర్టులు వేసుకున్న వ్యక్తులు కొట్టడం మొదలుపెట్టారు. సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు అడ్డుపడి కాపాడారు.

సచ్చినా సరే అనుకున్నా..
– రాజు యాదవ్, కేయు విద్యార్థి

సచ్చినా సరే తెలంగాణ నినాదాలు చేయాలనుకున్నా. మూడు రోజుల ముందే బాలకృష్ణ, సురేష్‌తో కలిసి పాలకుర్తికి వెళ్లాను. చంద్రబాబు మాట్లాడుతుండగానే జై తెలంగాణ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టాను. అంతే వెనుక నుండి గూండాలు కొట్టడం మొదలుపెట్టారు. అంతలోనే పక్కనున్న స్నేహితులు కూడా నినాదాలు చేయడం మొదలు పెట్టారు. ఎవరు ఎవరిని కొడుతున్నారో అర్థం కాలేదు. పోలీసులు చంద్రబాబు గూండాల నుంచి తప్పించి బయటికి తీసుకువచ్చారు.

****

బాబు యాత్ర దండయాత్రే

హైదరాబాద్: అడుగడుగునా ఆటంకాలతో, టీడీపీ గూండాలు, పోలీసుల సహాయంతో తెలంగాణ ప్రజల మీద దాడులు చేస్తూ సాగిన బాబు యాత్ర రైతు యాత్ర అనడం భాషకే అవమానం. అది తెలంగాణ మీద దండయాత్ర. వరంగల్ మీదకు ఢిల్లీ సుల్తానులు ఐదుసార్లు దండెత్తి విఫలమై పేరుకు ప్రతాపరుద్రుడిని నిర్బంధించినప్పటికీ వాళ్ల రాజ్యం కొనసాగలేదు. చాకలి ఐలమ్మను, ఆమెకు సహకరించిన వారిని కుట్రకేసులో ఇరికించి జైలుపాలు చేసినా రైతాంగ పోరాటం ఆగలేదు. అదే వరంగల్‌లో ఈ రోజు పోలీసు పహారాలో సభ నిర్వహించిన టీడీపీకి తెలంగాణలో నూకలు చెల్లినట్లే.
– ఎన్. వేణుగోపాల్, వీక్షణం ఎడిటర్

తెలంగాణపై దాడి

వరంగల్ చంద్రబాబు యాత్రను పరిశీలిస్తే ఇది పూర్తిగా ప్రతిపక్షం, ప్రభుత్వం ఒక్కటై తెలంగాణ ప్రజలపై విరుచుకుపడ్డట్లు కనిపిస్తుంది. జగన్ మహబూబాబాద్‌కు వెళ్లినప్పుడు అరెస్టు చేసిన ప్రభుత్వం , మిగతా వాళ్ల విషయంలో దాన్ని ఎందుకు అనుసరించలేదు. ప్రజల మధ్యకు కర్రలు పట్టుకొని రావడాన్ని ఎందుకు ఆపలేదు. అదే తీరుగా తెలంగాణ నాయకులు కర్రలు పట్టుకొని వెళ్లడానికి అనుమతిస్తారా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రశ్నించే హక్కులేనప్పుడు తిరిగే హక్కు ఎక్కడిది. తెలంగాణ ప్రజానీకమంతా వద్దంటున్నా, ప్రజలపై దాడులు చేయిస్తూ బాబు వచ్చారు. ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో వారే తగిన జవాబు ఇస్తారు.
– స్వామిగౌడ్, టీఎన్‌జీఓ అధ్యక్షుడు

ప్రతిపక్ష నేతేనా?

ప్రతిపక్ష నాయకుడే ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడు. ప్రశ్నించి, గళమెత్తి ప్రజల పక్షాన నిలబడాల్సిన నాయకుడే అలా చేస్తున్నారు. పాలక పక్షం, ప్రతిపక్షం ఏకమై తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని పాతరేయడానికి జరిగిన ప్రయత్నంలో భాగమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన. ప్రజలందరూ మా ప్రాంతానికి రావద్దని ప్రకటించినప్పటికీ, బలవంతంగా రావడం, వేలాది మంది పోలీసులతో, చంద్రదండు గుండాలతో ప్రజలపై దాడులు చేయడాన్ని ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా భావించాలి.
– దేవీప్రసాద్, టీఎన్‌జీఓ ప్రధాన కార్యదర్శి

వద్దన్నా వెళ్తారా?
ప్రజలు వద్దన్నా యాత్రకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రజలను ఉద్రిక్తత వాతావరణంలోకి నెట్టడం మంచిది కాదు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలే తెలంగాణను రాకుండా అడ్డుకున్నాయన్న భావన ప్రజల్లో ఉంది. తెలంగాణ ప్రజలు రాజకీయ పార్టీలను తెలంగాణపై మాత్రమే నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణపై సమాధానం చెప్పకుండా ప్రజాసమస్యల పేరుతో తెలంగాణాలో పర్యటించాల్సిన అవసరం లేదు.
– రాములు, తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు

***

నమస్తే తెలంగాణ నుండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *