పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలి-కేసీఆర్

  • August 29, 2020 11:12 am

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించాలని, ఇందుకోసం వచ్చేనెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం ప్రగతి భవన్ లో పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ లో పీవీ స్మారకాన్ని నిర్మించాలని, నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞానమార్గ్ గా పేరుపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. పీవీ ప్రధానిగా చేపట్టిన ఆర్ధిక సంస్కరణల ఫలితంగానే నేడు దేశం ఆర్ధికంగా నిలదొక్కుకున్నదని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని అద్భుతమైన పద్దతుల్లో స్మరించుకోవాలని, కరోనా నిబంధనలు అమల్లో ఉన్న ఈ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? నిబందనలు సడలించాక పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వాములను చేస్తూ ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి? అనే విషయాలను విభజించుకుని కార్యాచరణ రూపొందించాలని పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు:

– నెక్లెస్‌ రోడ్‌ను పీవీ జ్ఞాన్‌మార్గ్ గా అభివృద్ధి చేయాలి. ఆ మార్గమంతా అందమైన ఉద్యానవనాలు నిర్మించాలి. పీవీ విగ్రహం పెట్టాలి.

– పీవీ పుట్టిన లక్నెపల్లి, పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి. త్వరలోనే ఆ గ్రామాలను సందర్శించి అభివృద్ధి ప్రణాళిక తయారుచేయాల్సిందిగా సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను సీఎం ఆదేశించారు.

– హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో పీవీ మెమోరియల్‌ ఏర్పాటుచేయాలి. వివిధరంగాల్లో చేసిన కృషి ప్రస్ఫుటించేలా దీన్ని ఏర్పాటుచేయాలి. ఇందుకోసం అనువైన స్థలాన్ని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది.

– పీవీ పేరుమీద విద్యా వైజ్ఞానిక, సాహితీ రంగాల్లో సేవ చేసినవారికి అంతర్జాతీయ అవార్డు ఇవ్వాలని యునెస్కోకు ప్రతిపాదించాలి. అవార్డు కోసం నగదు బహుమతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.

– పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలను ప్రపంచంలోని వివిధ దేశాల్లో నిర్వహించాలి. ఇప్పటికే అమెరికా, సింగపూర్‌, సౌతాఫ్రికా, మలేషియా, మారిషస్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కెనడా తదితర దేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిగతా దేశాల్లోనూ షెడ్యూల్‌ రూపొందించాలి.

– ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా పీవీకి వివిధదేశాల అధ్యక్షులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, బ్రిటన్‌ మాజీ అధ్యక్షులు జాన్‌మేజర్‌, కామెరూన్‌ తదితరులను కూడా శతజయంతి ఉత్సవాలకు ఆహ్వానించాలి.

– శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ రాష్ట్రపతి, ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం కేసీఆర్‌ స్వయంగా లేఖలు రాస్తారు.

– ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో పీవీ విగ్రహం పెట్టాలి. ఢిల్లీతోపాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, పంజాబ్‌, తమిళనాడు తదితర రాష్ర్టాలతో పీవీకి ఎక్కువ అనుబంధం, అక్కడి వారితో పరిచయాలు ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలి. అన్ని జిల్లాల్లో ఉత్సవాలు నిర్వహించాలి.

– అముద్రితాలుగా ఉన్న పీవీ రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ తరఫున ముద్రించాలి. పత్రికల్లో వచ్చిన వ్యాసాలతో ప్రత్యేక పుస్తకం తీసుకురావాలి. వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలు, ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతులతో ప్రత్యేక పుస్తకం ముద్రించాలి. జీవిత విశేషాలతో కాఫీ టేబుల్‌ బుక్‌ తయారుచేయాలి.

– పీవీ జీవిత విశేషాలతో సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహించాలి. తెలంగాణ సంబురాల తరహాలో సాంస్కృతిక కార్యక్రమాలు, అద్భుత వంటకాలతో ఈ ఎగ్జిబిషన్‌ నిర్వహించాలి.

– ఢిల్లీ, హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో నెలకొల్పడానికి పీవీ విగ్రహాల కోసం వెంటనే ఆర్డర్‌ ఇవ్వాలి.

– పీవీ ఆధ్యాత్మిక కోణాన్ని స్పృశించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి.

పీవీ నరసింహారావు తెలంగాణ అస్తిత్వ ప్రతీక. ప్రధానిగా ఎదిగిన తెలంగాణ బిడ్డ. దేశంలో సంస్కరణలను అమలుచేసిన గొప్ప సంస్కర్త. ప్రపంచం గుర్తించిన మహామనిషి. అలాంటి మహోన్నతవ్యక్తి గొప్పతనాన్ని అసెంబ్లీలో చర్చిస్తాం. ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని తీర్మానం చేస్తాం. అసెంబ్లీలో తైల వర్ణచిత్రం పెడతాం. పార్లమెంట్‌ లోనూ పెట్టాలని కేంద్రాన్ని కోరతాం. సెంట్రల్‌ యూనివర్సిటీకి పీవీపేరు పెట్టాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ కేకే, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, పీవీ కుమారుడు ప్రభాకర్ రావు, పీవీ కుమార్తె వాణీదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పీవీ రచించిన పలు పుస్తకాలు, ఆయనపై ప్రచురితమైన పుస్తకాలను పీవీ కుమార్తె వాణీదేవి ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు అందించారు.


Connect with us

Videos

MORE

Telugu

MORE

Featured

MORE