mt_logo

తెలంగాణ శాసనమండలి మనుగడకు ప్రమాదం ఏర్పడింది: వినోద్ కుమార్

తెలంగాణ భవన్‌లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ శాసనమండలి మనుగడకు ప్రమాదం ఏర్పడింది. శాసనమండలి పూర్తిగా రద్దు అయ్యే ప్రమాదం ఉంది అని పేర్కొన్నారు.

ఆర్టికల్ 169 ప్రకారం శాసనమండలిలో సీట్లు 40 కంటే తక్కువ ఉండకూడదు. ఆర్టికల్ 171 ప్రకారం శాసనసభ సీట్లలో 1/3 వంతు కౌన్సిల్ సభ్యులు ఉండాలి. కానీ ప్రస్తుతం శాసనమండలి ఉనికి ప్రమాదంలో పడింది అని అన్నారు.

ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను తొలగించడం వల్ల అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 119కి తగ్గింది. ఇప్పుడు రాజ్యాంగ నిబంధనల ప్రకారం 1/3 అంటే కౌన్సిల్ సంఖ్య 39కి పడిపోయింది. దీంతో తెలంగాణ కౌన్సిల్ మనుగడ ప్రమాదంలో పడింది అని తెలిపారు.

తెలంగాణ శాసనమండలి కొనసాగాలి అంటే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగాలి. చంద్రబాబు ప్రస్తుతం కేంద్రంలో కీలకంగా ఉన్నారు. ఇద్దరు సీఎంలు కలిసి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుకు కృషి చేయాలి అని వినోద్ కుమార్ అన్నారు.

తెలంగాణ ఆస్తుల విషయంలో సీఎం రేవంత్ కాంప్రమైజ్ కావద్దని కోరుతున్న. శాసనసభ సీట్లను పెంచాలని ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 26లో స్పష్టంగా ఉంది. దీనికోసం మేము మోడీని, లా మినిస్టర్‌ను కలిసి చాలాసార్లు కోరాం.. కానీ మోడీ దాన్ని దాట వేశారు. కానీ అదే మోడీ కాశ్మీర్‌లో సీట్లను పెంచుకున్నారు అని ఎద్దేవా చేశారు.