పీఏసీ చైర్మన్ నియామకంపై తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. సహజంగా ప్రశ్నించే ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం దేశంలో ఆనవాయితీగా వస్తోంది. పీఏసీ చైర్మన్ పదవిని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యకు ఇవ్వడం పార్లమెంటరీ స్ఫూర్తికి, సాంప్రదాయాలకు విరుద్ధం.. దుర్మార్గం అని మండిపడ్డారు.
పీఏసీలో మొత్తం 13 సభ్యులు ఉండాలని ఇందులో తొమ్మిది మంది అసెంబ్లీ నుంచి ఉండాలని అసెంబ్లీ రూల్ బుక్‌లో స్పష్టంగా ఉంది. పీఏసీ సభ్యులను సెలక్షన్ పద్దతిన కాకుండా ఎలెక్షన్ పద్ధతిలో ఉంటుంది అని అన్నారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ ఫైనాన్షియల్ కమిటీల ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటిస్తారు. గత అసెంబ్లీ సమావేశాల చివరి రోజున కమిటీల ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించారు. రెండు గంటల్లో నామినేషన్లు వేయడం, ఉపసంహరించడానికి సమయం ఇచ్చారు.. అంతా హడావుడిగా జరిగింది. పీఏసీ ఎన్నిక పూర్తయిన తర్వాత స్పీకర్ అసెంబ్లీలోనే కమిటీ సభ్యుల పేర్లు ప్రకటించాలి. దానికి విరుద్ధంగా 38 రోజుల తర్వాత అసెంబ్లీ కమిటీలను ప్రకటించారు అని విమర్శించారు.
అసెంబ్లీ రూల్ బుక్‌లో 250 రూల్ కింద పీఏసీకి సంబంధించి ప్రతిపక్షానికి సంఖ్యను బట్టి సభ్యుల సంఖ్యను కేటాయిస్తారు. బీఆర్ఎస్‌కు నిబంధనల ప్రకారం పీఏసీలో ముగ్గురు సభ్యులకు అవకాశం ఉంటుందని చెబితే నామినేషన్లు వేశాము. నేను, హరీష్ రావు, గంగుల కమలాకర్ నామినేషన్లు వేశాము.. మధ్యలో అరికెపూడి గాంధీ పేరు ఎక్కడ్నుంచి వచ్చింది అని ప్రశ్నించారు.
పీఏసీ సభ్యుల కన్నా ఎక్కువ నామినేషన్లు వస్తే ఓటింగ్ జరగాలి. ఓటింగ్ జరగకుండానే హరీష్ రావు నామినేషన్‌ను ఎలా తొలగించారు. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేయడానికి ఎవరు అనుమతించారు. అరికెపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ప్రపంచమంతా చూసింది. అన్ని పత్రికల్లో గాంధీ కాంగ్రెస్‌లో చేరినట్టు ఫోటోలతో సహా వచ్చింది. తాను కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదని ఇపుడు గాంధీ బుకాయిస్తే ఎలా కుదురుతోంది అని అడిగారు.
పేపర్లో కాంగ్రెస్‌లో చేరినట్టు వచ్చిన వార్తలు తప్పయితే మరుసటి రోజు గాంధీ ఎందుకు ఖండించలేదు..గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చి కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీ సాక్షిగా ఖూనీ చేసింది. ప్రతిపక్ష నేతను సంప్రదించే పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం దేశంలో ఆనాదిగా వస్తోంది. ఇప్పుడు ఎవర్ని అడిగి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు. బహుశా ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వకపోవడం దేశంలో ఇదే మొదటిసారి కావొచ్చు అని ప్రశాంత్ రెడ్డి దుయ్యబట్టారు.
తెలంగాణ అసెంబ్లీ మెంబెర్స్ హ్యాండ్ బుక్ 65 వ పేజీలో పీఏసీ చైర్మన్ పదవి ఎవరికిస్తారో స్పష్టంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణలో మొన్నటి వరకు ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది అని తెలిపారు.
తెలంగాణ ఏర్పడ్డాక కిష్టా రెడ్డి, గీతా రెడ్డి, ఒవైసీలకు నిబంధనల ప్రకారం పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చాము. ఇందిరా గాంధీ హయాంలో బీజేపీకి చెందిన వాజపేయికి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు. మోడీ హయాంలో మొదటి రెండు పర్యాయాలు కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లేకున్నా పీఏసీ చైర్మన్ పదవులు దక్కాయి. మొన్నటికి మొన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సూచన మేరకు కేసీ వేణుగోపాల్‌ను కేంద్రంలో పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు అని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఓ సూత్రం.. తెలంగాణలో మరో సూత్రమా.. రేవంత్ విధానాన్ని ఢిల్లీలో పాటిస్తే అక్కడ కేసీ వేణుగోపాల్‌కు పీఏసీ చైర్మన్ పదవి వచ్చేదా? రాహుల్ రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరుగుతారు.. ఆ రాజ్యాంగం తెలంగాణకు వర్తించదా? అని ధ్వజమెత్తారు.
హిమాచల్‌లో పార్టీ మారిన ఎమ్మెల్యేల పెన్షన్ తొలగిస్తున్నారు.. తెలంగాణలో నేమో పార్టీ మారిన ఎమ్మెల్యేకు పిలిచి పీఏసీ పదవి ఇచ్చారు. రాహుల్ విధానాలు తెలంగాణలో అమలు కావా? అని ఫైర్ అయ్యారు.
అరికెపూడి గాంధీ మీద అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉండగా స్పీకరు ఆయనకు పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారు? హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే పీఏసీ చైర్మన్‌కు సంబంధించి పాలకపక్షం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. పీఏసీ నుంచి నామినేషన్ వేసిన హరీష్ రావును ఎందుకు బయటకు పంపించారు? నామినేషన్ వేయని గాంధీని లోపలికి తీసుకొచ్చారు. హరీష్ రావు అంటే రేవంత్‌కు భయమా అని అడిగారు.
గాంధీని అడ్డం పెట్టుకుని రేవంత్ శిఖండి రాజకీయం చేస్తున్నారు.. స్పీకర్ భుజం మీద తుపాకీ పెట్టి సీఎం రేవంత్ బీఆర్ఎస్‌ను కాల్చాలని చూస్తున్నారు. మొన్న జర్నలిస్టుల మీటింగ్‌లో సీఎం రేవంత్ నీతులు చెప్పారు.. తెల్లారే గోతులు తవ్వారు అని విమర్శించారు.
వ్యవస్థల్ని ద్వంసం చేశారని కేసీఆర్‌ను విమర్శించిన రేవంత్ పీఏసీ కమిటీల విషయంలో అతి పెద్ద ధ్వంసం చేశారు. రాహుల్ గాంధీ మాట కూడా వినలేని స్థాయికి రేవంత్ వెళ్లారా? కాంగ్రెస్‌లో సీనియర్ అయిన జానారెడ్డి లాంటి వారు కూడా రేవంత్‌కు చెప్పే స్థితిలో లేరా? అని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.
పీఏసీపై పునరాలోచన చేయాలని స్పీకర్‌ను కోరుతున్నాం.. పీఏసీ నియామాకంపై తెలంగాణ బుద్ధిజీవులు స్పందించాలి. పీఏసీపై స్పీకర్ నిర్ణయం మారకపోతే గవర్నర్‌ను కలవడం ఇతర మార్గాలను అన్వేషిస్తాం. గాంధీ బీఆర్ఎస్‌కు చెందిన వాడే అని మంత్రి శ్రీధర్ బాబు చెబుతున్నారు. గాంధీని పీఏసీ చైర్మన్‌గా నియమించమని ప్రతిపక్ష నేత కేసీఆర్ సూచించారా.. కేసీఆర్‌ను ఎప్పుడు సంప్రదించారో శ్రీధర్ బాబు చెప్పాలి అని సవాల్ విసిరారు.
అన్ని నిబంధనల ప్రకారమే నియామకాలు జరిగాయని శ్రీధర్ బాబు అంటున్నారు.. కేసీ వేణుగోపాల్ పీఏసీ చైర్మన్ ఎలా అయ్యారో శ్రీధర్ బాబు అడగాలి. రేవంత్ రెడ్డి పెద్ద నియంతగా మారాడు.. ఆయన తీరును ప్రతిఘటించి తీరుతాం అని స్పష్టం చేశారు.