mt_logo

టీవీవీపీ ఆసుపత్రుల్లో 6 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం అమానుషం: హరీష్ రావు

తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి 6 నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం అమానుషం అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పుకునే ముఖ్యమంత్రికి వీరి వెతలు కనిపించకపోవడం శోచనీయం. జీతాలు చెల్లించాలని కోరుతూ సిబ్బంది ఎన్నిసార్లు నిరసనలు తెలియజేసినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా ఉండటం లేదు.. వారి గోడును పట్టించుకోవడం లేదు అని విమర్శించారు.

విషజ్వరాలు విజృంభించి రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్న సమయంలో, ఆసుపత్రుల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. నిధులు విడుదల చేయకుండా చోద్యం చూస్తున్నది అని దుయ్యబట్టారు.

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం ఆసుపత్రి సిబ్బందికి శాపంగా మారింది అని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, టీవీవీపీ ఆసుపత్రుల్లో పని చేస్తున్న సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు.