హైదరాబాద్, జూన్ 14: రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాడు జరిగిన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా …ప్రముఖ ప్రభుత్వ దవాఖాన నిమ్స్’ విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా నిర్మించనున్న దశాబ్ధి వైద్య భవనాల్లో నూతనంగా 2000 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి రానున్నాయి. అత్యంత అధునాతన ఆపరేషన్ థియేటర్లు సహా వర్తమాన వైద్య రంగంలో ప్రజల వైద్యసేవలకు అవసరమయ్యే పలు రకాల వైద్య సేవలు అందనున్నాయి.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే మనిషి తపన ఒకచోట ఆగేదీ కాదు వొడిసేదీ కాదు. నిరంతరం కొనసాగుతూనే వుంటుంద’’ని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే పలు రంగాలతో పాటు రాష్ట్ర వైద్యారోగ్య రంగంలో కూడా అద్భుతమైన అభివృద్ధిని నమోదుచేసుకున్న నేపథ్యంలో, అత్యద్భుత రీతిలో నిర్మించబోయే నిమ్స్ దవాఖానా విస్తరణ పనులకు శంఖుస్థాపన చేయడం భారతదేశ వైద్యారోగ్య రంగంలోనే చారిత్రక సందర్భమని సీఎం స్పష్టం చేశారు. నిమ్స్ దవాఖాన విస్తరణ లో భాగంగా నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం… వైద్యారోగ్య అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ గారి మాట్లాడుతూ.. శతకకారులు చెప్పిన విషయాన్ని నేను మీకు చెప్తున్నా..
“గురువుగారిని శిష్యుడు నివాసయోగ్యమైన ప్రాంతం ఏదంటే
అప్పిచ్చువాడు, వైద్యుడు,
ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్
చొప్పడిన, యూరనుండుము
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ”
సమాజ పురోగమనానికి అప్పిచ్చేవాడు ఉండాలి. వైద్యుడు ఉండాలి అంటూ వైద్యుని ప్రాముఖ్యత గురించి శతకకారుడు వివరంగా చెప్పారు. వైద్యానికి, మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉంటుంది. ఈ ప్రపంచంలో మానవ జీవనం ఉన్నంత కాలం వైద్యం కూడా తప్పకుండా కొనసాగుతూనే ఉంటుందన్నారు. మంత్రి హరీష్ రావు ప్రసంగం ఒక్క మాటలో చెప్పాలంటే.. 2014 లో వైద్యరంగానికి బడ్జెట్ లో నిధుల కేటాయింపు రూ. 2,100 కోట్లు. 2023-24 లో కేటాయింపులు రూ. 12,367 కోట్లు. అన్నం ఉడికిందా అని కుండంత పిసికి చూడాల్సిన అవసరం లేదు. దీన్నే బట్టే మనకు తెలంగాణ పురోగమనం అర్థం అవుతుందన్నారు.
వైద్యారోగ్య శాఖ చాలా ప్రాధాన్యత కలిగిన శాఖ. ఏ సందర్భంలోనైనా చాలా లైవ్ గా ఉండాల్సిన శాఖ. వైద్యారోగ్య శాఖను చాలా అనూహ్యంగా విస్తరిస్తున్నాం. 17 వేల పడకల నుండి 50 వేల పడకలకు విస్తరించాం. వందో రెండొందలో ఉన్న ఆక్సిజన్ బెడ్లను 50 వేలకు పెంచుకున్నామని తెలిపారు. కేంద్రాన్ని ప్రాధేయపడకుండా సొంతంగా 550 టన్నులు ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నామన్నారు.
ఎక్కడైతే వైద్యారోగ్య వ్యవస్థ పకడ్బందీగా ఉంటుందో అక్కడ తక్కువ నష్టాలు
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్ని ఎలా రక్షించుకోవాలో సలహాలివ్వాలని అడిగితే, ఎక్కడైతే వైద్యారోగ్య వ్యవస్థ పకడ్బందీగా ఉంటుందో అక్కడ తక్కువ నష్టాలు జరుగుతాయని వారు చెప్పారు. లేకపోతే నష్టాలు ఎక్కువగా జరుగుతాయని వారు తెలిపారు. ఆరోగ్యశాఖ ప్రాధాన్యతను దీన్ని ద్వారా అర్థం చేసుకోవచ్చు. అప్పటి నుండి ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేలా ఆరోగ్యశాఖను తీర్చిదిద్దాలని భావించి, ఆరోగ్య శాఖ మంత్రులను, అధికారులను పిలిచి గంటలు, రోజులు, వారాల తరబడి చర్చించి అవసరమైన ఆర్థిక ప్రేరణ ఇవ్వడానికి బడ్జెట్ కేటాయింపులు కూడా భారీగా పెంచి ఈ శాఖను మనం ముందుకు తీసుకుపోతున్నామన్నారు.