mt_logo

తెలంగాణలో వైద్యారోగ్య వ్యవస్థ ఉత్తమ ప్రణాళికతోనే విజయం సాధించింది : సీఎం కేసీఆర్

హైదరాబాద్, జూన్ 14:  రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాడు జరిగిన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా … ప్రముఖ ప్రభుత్వ దవాఖాన నిమ్స్’ విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందించాం.. పుట్టే బిడ్డలు ఒడ్డూ పొడుగు బాగుండాలంటే వాళ్ళు గర్భంలో ఎదిగే కాలంలో ఎలాంటి ఆటంకం ఉండకూడదు.  ఒకసారి స్టంటింగ్ సమస్య ఏర్పడితే, మళ్ళీ ఎదుగుదల చూడాలంటే వంద సంవత్సరాల కాలం పడుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. పెరుగుదలలో సమస్య రాకుండా ఉండాలంటే ముందస్తుగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు పంచబడుతున్నవే న్యూట్రిషన్ కిట్లు. వీటి పరమార్థం ఇదే అని తెలిపారు. 

ఉత్తమ ప్రణాళికతో విజయం సాధించినట్లే

గతంలో తెలంగాణలో వైద్యారోగ్య వ్యవస్థ ఉత్తమ ప్రణాళికతోనే విజయం సాధించింది అదే విధంగా..ఈ రోజు మనం ఏ స్టేజ్ లో ఉన్నాం, ఇంకా ఎంత ముందుకు పోవాల్సి ఉంది ? జరగాల్సిన కొత్త ఆవిష్కరణలు ఏంటి ? చేపట్టాల్సిన చర్యలు ఏంటి ? అనే ప్రణాళికల కోసం ఎక్కువ సమయం కేటాయించాలని నేను ఆరోగ్యశాఖ అధికారులను కోరుతున్నాను“బెస్ట్ ప్లానింగ్ ఈజ్ హాఫ్ సక్సెస్” ( ఉత్తమ ప్రణాళికతో సగం విజయం సాధించినట్లే) అని చెప్పినట్లు, వైద్యారోగ్య రంగం ఇంకెంత గొప్పగా ఉండాలి. ఇంకా ఎంతో ముందుకు పోవాలి. ఎలా ఈ లక్ష్యాలను ఎలా సాధించవచ్చో మీరు బాగా ఆలోచించగలరు. 

డాక్టర్లు గొప్పవారు. మంచి మనసున్న వాళ్ళు. నిరుపేదల వైద్యం కోసం వస్తే, బెడ్లు అందుబాటులో లేనప్పుడు ఉదారమైన హృదయంతో ఒక అరగంట ఎక్కువ పని చేసైనా కిందనే బెడ్డు వేసి వైద్యం అందిస్తారు.  అది వాస్తవం. కానీ పత్రికలు, జర్నలిస్టులు అవాస్తవాలను ఉస్మానియాలో బెడ్లు లేవు. పేషెంట్లను కింద పడుకోబెడుతున్నరు అంటూ వక్రీకరణలు చేస్తారు.  వైద్యారోగ్య శాఖ అధికారులకు పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) చాలా తక్కువ. మిమ్మల్ని విమర్శించే వాళ్ళు తప్ప మెచ్చుకున్న వాళ్ళు లేరు. నేను మీతో గంటల తరబడి మాట్లాడిన సందర్భాల్లో కలిగిన అనుభవాలు ఇవని గుర్తు చేశారు. 

మనం కూడా మానవత్వ కోణంలో ఆలోచించాలి. వైద్యం ప్రత్యేక చదువు. ప్రత్యేకమైన అర్హత. ఐఏఎస్ లైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా డాక్టర్ల దగ్గరకు రావాల్సిందే. వైద్యారోగ్య శాఖ మంత్రి మంచి చురకైన వ్యక్తి కాబట్టీ వారికి నేను మనవి చేస్తున్నాను. వైద్యశాఖ అందించే సేవలు ప్రజల్లోకి పోయేలా పీఆర్ ను పెంపొందించాలి. ప్రజలతో పెనవేసుకున్న విభాగం కాబట్టీ వైద్యారోగ్య రంగం పీఆర్ బాగా పెరగాలి. వైద్యారోగ్య శాఖ ప్రజల బాగు కోసం ఏం చేస్తుంనేది ప్రజలకు బాగా తెలిసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రయత్నిస్తే ఫలితముంటుందని తెలిపారు.