mt_logo

తెలంగాణ‌లో గిరిపుత్రుల‌కు స‌ర‌స్వ‌తీ క‌టాక్షం.. సీఎం కేసీఆర్ సంక‌ల్పంతో చేరువైన అక్ష‌రం

స‌మైక్య పాల‌న‌లో నాగ‌రిక జీవ‌నానికి దూరంగా ఉండే గిరిపుత్రుల జీవితాలు దుర్భ‌రంగా ఉండేవి. పొట్ట‌పోసుకొనేందుకే తిప్ప‌లు ప‌డేవారు. ఇక చ‌దువుల సంగ‌తి దేవుడెరుగు. సౌక‌ర్యాలులేని బడుల్లో చ‌దువుకోలేక వెనుక‌బ‌డిపోయారు. పేదిరికంతో అడ‌విబిడ్డ‌లు అనాగ‌రికంలోనే మ‌గ్గిపోయారు. కానీ, స్వ‌రాష్ట్రంలో ఆదివాసీ, గిరిజ‌నుల‌కు మంచి రోజులొచ్చిన‌య్‌. తండాల‌న్నీ గ్రామ పంచాయ‌తీలైన‌య్‌.  సీఎం కేసీఆర్ సంక‌ల్పంతో అభివృద్ధిలో త‌ళుక్కున మెరిసిన‌య్‌. గిరిబిడ్డ‌ల కోసం అత్యాధునిక వ‌స‌తుల‌తో గురుకులాలు వెలిసిన‌య్‌. అత్యుత్త‌మ బోధ‌న అంద‌డంతో గిరిపుత్రులు ప్ర‌తిష్టాత్మ‌క ఇన్‌స్టిట్యూట్ల‌లో సీట్లు సాధించారు. త‌మ‌ను వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించేవారుంటే ఏదైనా సాధిస్తామ‌ని నిరూపించారు. ఇదంతా కేవ‌లం తెలంగాణ స‌ర్కారు చిత్త‌శుద్ధికి నిద‌ర్శ‌న‌మే అంటున్నారు ఐఏఎస్ న‌వీన్ నికోల‌స్‌. గ‌తంలో తెలంగాణ ప్ర‌భుత్వ గిరిజ‌న సంక్షేమ విభాగంలో టీటీడ‌బ్ల్యూఆర్ఈఐఎస్‌కు అద‌న‌పు కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన ఆయ‌న స్వ‌రాష్ట్రంలో గిరిపుత్రుల‌కు ఎలాంటి విద్యావ‌కాశాలు ల‌భించాయో వివ‌రించారు. మ‌రి ఆ విష‌యాలేంటో ఆయ‌న మాట‌ల్లోనే తెలుసుకొందాం.  

షెడ్యూల్డ్‌ తెగల కోసం నాణ్యమైన ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు దిశగా 2014 తర్వాత తెలంగాణలో అద్భుతమైన ప్రగతి నమోదైంది. తెలంగాణ ప్రభుత్వం కేవలం రెసిడెన్షియల్‌ పాఠశాలల మీద మాత్రమే ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిందన్న అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. కానీ, నిజానికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని గిరిజన తెగలకు చెందిన విద్యార్థులకు అత్యుత్తమ ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు అనేక చర్యలు చేపట్టింది. ప్రైవేటు కళాశాలలకు దీటుగా 2017లో షెడ్యూల్డ్‌ తెగల వారికోసం 22 డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా 1,455 రెగ్యులర్‌ టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ పోస్టులను ఈ కాలేజీలకు మంజూరు చేసింది. వీటిని ఉన్నతస్థాయి నైపుణ్యంతో కూడిన  విద్యాసంస్థలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు కూడా చేపడుతున్నది. 169 మంది లెక్చరర్లను మెరుపు వేగంతో పారదర్శకమైన విధానంలో భర్తీ చేసింది. ఈ షెడ్యూల్డ్‌ తెగల రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్‌ ల్యాబ్స్‌, డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌, సైన్స్‌ ల్యాబ్స్‌ తదితర అన్ని మౌలిక వసతులను సమకూర్చుతున్నది. ఫీల్డ్‌ ట్రిప్స్‌, సెమినార్లు, ఈ ప్లస్‌ క్లబ్‌ కార్యకలాపాలు, భారత్‌ దర్శన్‌ మొదలైన సృజనాత్మక కార్యక్రమాలను కూడా ఈ కళాశాలల్లో క్రమం తప్పకుండా అమలు చేస్తున్నారు. సం క్షేమ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లను కూడా ఏర్పాటుచేశారు. కొన్ని రెసిడెన్షియల్‌ కళాశాలల్లో ఎన్‌సీసీ యూనిట్లను సొంత నిధులతో ఏర్పాటుచేశారు.

గిరిజన డిగ్రీ, పీజీ విద్యార్థులు తమ పరిశోధన పత్రాలను ప్రచురించేందుకు వీలుగా తెలంగాణ స్టేట్‌ జర్నల్‌ ఆఫ్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ పేరిట పరిశోధనా పత్రికను టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ ప్రారంభించింది. రికార్డు సమయంలో రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌ పోస్టుల భర్తీకి గాను తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును (టీఆర్‌ఈఐఆర్‌బీ) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న ఎస్టీ విద్యార్థులకు హాస్టళ్ల నిర్వహణ కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా శాశ్వత భవనాలను నిర్మించింది. నివాస వసతి లేని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ హాస్టల్‌ సౌకర్యాలను వినియోగించుకుంటూ చదువులు కొనసాగిస్తున్నారు. సివిల్స్‌ పరీక్షలు రాయాలనుకునే ఎస్టీ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి రెసిడెన్షియల్‌ ఐఏఎస్‌ స్టడీ సెంటర్‌ ఏర్పాటుచేసింది. గిరిజన విద్యార్థులు ఈ రెసిడెన్షియిల్‌ కోచింగ్‌ సెంటర్లలో చేరి వాటిలోని అద్భుతమైన లైబ్రరీ, డిజిటల్‌ సౌకర్యాలను వినియోగించుకొని సివిల్స్‌కు ప్రిపేర్‌ కావచ్చు.

స్థానికంగా న్యాయవాద విద్య అభ్యసించాలనుకునే గిరిజన విద్యార్థుల కోసం సంగారెడ్డి జిల్లాలో ప్రత్యేకంగా ఒక రెసిడెన్షియల్‌ కళాశాలను ఏర్పాటుచేసింది. నాగర్‌కర్నూల్‌, షాద్‌నగర్‌లలో గిరిజన విద్యార్థుల కోసం పీజీ రెసిడెన్షియల్‌ కళాశాలలు ఏర్పాటుచేశారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ మొదలైన కోర్సులను ఈ రెసిడెన్షియల్‌ గిరిజన కళాశాలల్లో ప్రారంభించా రు. తొలిసారిగా ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులను ఈ కళాశాలల్లో ప్రవేశపెట్టారు. ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన గిరిజన విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

గిరిజన విద్యార్థుల కోసం హైదరాబాద్‌లో నాలుగు కాలేజెస్‌ ఆఫ్‌ ఎక్స్‌ లెన్స్‌ (సీవోఈ)ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కోలాం, తోటి, చెంచు, కొండరెడ్డి వంటి తెగలకు చెందిన విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీ, మెడిసిన్‌, లా వంటి కోర్సుల్లో చేరేందుకు దోహదపడేలా వీటిని సకల సౌకర్యాలతో ఏర్పాటు చేశారు.స్థానిక ఎస్టీ విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్‌ టీచర్‌ ఉద్యోగాల్లో చేరేందుకు వీలుగా భద్రాచలం, ఉట్నూరులో ప్రత్యేక బీఈడీ కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిగ్రీ పూర్తిచేసిన తర్వాత పేరున్న విదేశీ యూనివర్సిటీల్లో పీజీ, రీసెర్చ్‌ చదువులకు వెళ్లాలనుకునేవారికి ఇచ్చే సాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షలకు పెంచింది. టోఫెల్‌, జీఆర్‌ఈ వంటి పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే గిరిజన విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కోచింగ్‌ కూడా ఇస్తున్నది.

ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో గిరిజన తెగల బాలబాలికలకు విడివిడిగా హాస్టల్‌ సౌకర్యం కల్పించేందుకు రూ.140 కోట్లు విడుదల చేసింది. ఎస్టీ విద్యార్థుల కోసం హాస్టళ్లు నిర్మించేందుకు రూ.20 కోట్ల చొప్పున నిధులు అందజేశారు. సమాజం అంచుల్లో నివసించే గిరిజనుల బిడ్డల జీవితాలను సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేలా చేసేందుకు విద్య ఒక్కటే సరైన మార్గమని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా నమ్ముతున్నది.