mt_logo

పాల‌మూరు ఎత్తిపోత‌ల‌లో కీల‌కఘ‌ట్టం..ఏదుల రిజ్వ‌రాయ‌ర్ పంప్‌హౌస్ రెడీ

-నీటి పంపింగ్‌కు అధికారుల సన్నాహాలు

-డిండి 400 కేవీ నుంచి పవర్‌ సరఫరా

-60 కి.మీ. మేర విద్యుత్‌లైన్‌ చార్జ్‌

స‌మైక్య రాష్ట్రంలో పాల‌మూరిది ఓ విషాద‌గాథ‌.  సీమాంధ్ర పాలనలో సాగునీరు అందించే ఆలోచనే లేని కారణంగా పాలమూరు ప్రజలు వ‌ల‌స‌బాట‌ప‌ట్టారు. జిల్లా గుండా కృష్ణా నది 300 కిలోమీటర్లు పారుతుంది. తుంగభద్ర నది కూడా ఈ జిల్లా సరిహద్దుగా పారుతుంది. అయినా జిల్లాలో తెలంగాణ ఏర్పడే దాకా ఈ దీన పరిస్థితి ఉన్నది. ప్రతిపాదిత బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు పథకాలు నిరంతరం ఫైళ్ళల్లో మగ్గుతూ వచ్చాయి. ఇక పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది ఒక పోరాట చరిత్ర. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న‌ సందర్భంలో తెలంగాణా రిటైర్డ్‌ ఇంజనీర్లు 2005 లో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రూపకల్పన చేసి అప్పటి సీమాంధ్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలు చేసింది. జిల్లా నాయకుల్లో దాన్ని పట్టించుకునే నాథుడే లేడు. 2009 ఎన్నికల ముందు సర్వేల గురించి జీవో ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ముఖం చాటేసి అనేక సాకులు చెప్పింది. ఇప్పటికే చాలా ఎత్తిపోతల పథకాలు వచ్చాయి కనుక వాటి పనితీరు చూసిన త‌ర్వాతే ఈ ఎత్తిపోతల పథకాన్ని చేప‌డతామ‌ని దాట‌వేశారు. ఈ విధంగా ఆనాడు మొత్తం పాలమూరు-రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులను అవ‌మానించారు. చివ‌ర‌గా పోతూ పోతూ కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం తుంగభద్రపై గండ్రేవుల జలాశయం తో పాటు పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సర్వే నిమిత్తమై 2013 ఆగస్టులో జీవో ఇచ్చినా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాకుండా అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఈ ప్రాజెక్టు సర్వే , సమగ్ర ప్రాజెక్టు నివేదిక మూడు నెలల్లోనే సమర్పించే విధంగా చ‌ర్య‌లు తీసుకొన్న‌ది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న పాలమూరు, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు భరోసా కలిగింది.

ఏదుల పంప్‌హౌస్‌కు నీటి పంపింగ్‌కు మార్గం సుగ‌మం

సీఎం కేసీఆర్ సంక‌ల్పంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకఘట్టానికి రంగం సిద్ధమైంది. ఏదుల పంప్‌హౌస్‌కు కనెక్టివిటీ చేస్తూ 400 కేవీ విద్యుత్‌ లైన్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా శుక్రవారం విద్యుత్‌ సరఫరా సాఫీగా సాగింది. దీంతో ఏదుల రిజర్వాయర్‌కు నీటి పంపింగ్‌ మార్గం సుగమమైంది. సీఎం ఇచ్చిన 14 రోజుల టార్గెట్‌కు ముందే అడ్డంకులను అధిగమించడం గమనార్హం. ఇటీవల మంత్రి నిరంజన్‌రెడ్డి, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్‌ ఏదుల పంపింగ్‌ స్టేషన్‌ను సందర్శించి జూలై ఆఖరు నాటికి నీరందించేలా పంపులు సిద్ధం చేయాలని ఇరిగేషన్‌ అధికారులకు సూచించారు. మే 6న మంత్రులు, ఎమ్మెల్యేల ప్రతినిధుల బృందం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న అన్ని రిజర్వాయర్లను సందర్శించారు. దీంతో ఇరిగేషన్‌ శాఖ అధికారులు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టి ఏదుల పంపింగ్‌ స్టేషన్‌ వద్ద నిర్మించిన 400 కేవీ సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ సరఫరా విజయవంతంగా పూర్తి చేశారు.

నల్లగొండ జిల్లా డిండి నుంచి 400 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి ఏదుల పంపింగ్‌ స్టేషన్‌ వరకు హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌ను కొత్తగా నిర్మించారు. 60కిలోమీటర్ల ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ను కూడా చార్జి చేయడం జరిగిందని ఇరిగేషన్‌ సీఈ వివరించారు. విద్యుత్‌ సరఫరా విజయవంతంగా ఏదుల పంప్‌హౌస్‌కు చేరడంతో ఇక్కడి పంపింగ్‌ స్టేషన్‌ పంప్‌లను నడపడానికి మార్గం సుగమమైంది. త్వరలోనే ఏదుల పంప్‌హౌస్‌లో పంప్‌ల డ్రై రన్‌ నిర్వహిస్తామని నీటి పారుదలశాఖ సీఈ హమీద్‌ఖాన్‌ వెల్లడించారు. రెండు విద్యుత్‌ సబ్‌స్టేషన్ల మధ్య విజయవంతంగా విద్యుత్‌ సరఫరా జరిగిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఫోన్‌లో ఇంజినీరింగ్‌ అధికారులను అభినందించారు. త్వరలో పంప్‌హౌస్‌లను ట్రయల్‌ రన్‌ నిర్వహించి నిర్దిష్ట గడువులోగా రిజర్వాయర్‌ నింపాలని అధికారులకు సూచించారు.