mt_logo

అగ్రి టెక్నాల‌జీలో తెలంగాణ భేష్‌. వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం ప్ర‌శంస‌

– మ‌న పీపీపీ పద్ధతి ఇతర దేశాలకు అనుసరణీయం

-వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నివేదికలో వెల్ల‌డి

హైద‌రాబాద్‌:  కాళేశ్వ‌రం ప్రాజెక్టు, రైతు సంక్షేమ ప‌థ‌కాల‌తో వ్య‌వ‌సాయ రంగాన్ని ప‌రుగులు పెట్టించ‌డ‌మేకాదు.. అగ్రి టెక్నాల‌జీలోనూ తెలంగాణ దూసుకుపోతున్న‌ది. వ్య‌వ‌సాయానికి అధునాత‌న టెక్నాల‌జీని జోడించి అరుదైన ఘ‌న‌త సాధించింది. సాండ్‌బాక్స్‌ టెక్నాలజీలో భాగంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ వంటి సాంకేతికతలను వినియోగించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సలహాలు ఇచ్చే విధానాన్ని మ‌న ప‌రిశోధ‌కులు అభివృద్ధి చేశారు. దీంతో నియంత్రిత వాతావరణంలో నూతన ఉత్పత్తుల పరీక్షలు, సర్టిఫికేషన్‌ వంటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇది రైతులకు భరోసా ఇవ్వడంతో పాటు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ సహకారంతో అగ్రికల్చర్‌ డాటా ఎక్స్‌చేంజ్‌ వేదికను రూపొందించింది. డాటా ప్రొవైడర్లు, వినియోగదారులు ఒకరినొకరు నేరుగా సమాచారం ఇచ్చిపుచ్చుకునేలా, రైతులకు డిజిటల్‌ సేవలు అందించేలా తెలంగాణ ఒక ఎకోసిస్టమ్‌ను రూపొందిస్తున్నది. ఫ‌లితంగా అగ్రి టెక్నాల‌జీలో మ‌న తెలంగాణ దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌తోపాటు దేశాల‌కూ ఆద‌ర్శంగా మారింది. ఏకంగా వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం (డ‌బ్ల్యూఈఎఫ్‌) ప్ర‌శంస‌లు అందుకొన్న‌ది. 

తెలంగాణ‌పై డ‌బ్ల్యూఈఎఫ్ ప్ర‌శంస‌ల జ‌ల్లు

వ్యవసాయ రంగానికి, అత్యాధునిక టెక్నాలజీని జోడించే ‘అగ్రిటెక్‌’ వినియోగంలో తెలంగాణ గ్లోబల్‌ లీడర్‌గా నిలిచిందని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) ప్రశంసించింది. ‘అగ్రిటెక్‌’తో వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకురావడంతోపాటు సాగును లాభాల గనిగా మార్చి, రైతులకు అండగా ఎలా నిలువొచ్చో ఇతరులకు తెలంగాణ విలువైన పాఠాలు నేర్పుతున్నదని పేర్కొన్నది. అగ్రిటెక్‌ విస్తృతికి ప్రభుత్వాలు ఎలాంటి సహాయం అందించాలి? ఎలాంటి విధానాలు రూపొందించాలి? అన్నదానికి తెలంగాణ ఒక మార్గదర్శిగా నిలిచిందని కొనియాడింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో (పీపీపీ) తెలంగాణ అనుసరిస్తున్న విధానాల ఫలితంగా డిజిటల్‌ వ్యవవసాయ పాఠాలు గ్రామీణ ప్రాంతాలకు చేరుతున్నాయని డబ్ల్యూఈఎఫ్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది. సంస్థకు చెందిన సెంటర్‌ ఫర్‌ నేచర్‌ అండ్‌  క్లైమేట్  విభాగం ఎండీ జిమ్‌ హుయే నియో, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఈ నివేదికను రూపొందించారు.

ఇందులో అగ్రిటెక్‌ సామర్థ్యం, దీనిని విరివిగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాలు చేపట్టాల్సిన విధానాలను స్పష్టంగా వివరించారు. భారతదేశంలో అత్యధిక శాతం సన్న, చిన్నకారు రైతులు, చిన్న కమతాలే ఉన్నాయని పేర్కొన్నారు. దేశ వ్యవసాయ రంగ ఉత్పత్తుల్లో సగానికిపైగా వీరే ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. రైతులకు మద్ధతు కోసం దేశంలో అనేక నిర్ణయాలు తీసుకుంటున్నా.. అనూహ్య వాతావరణ పరిస్థితులు వంటివి పెను సవాళ్లుగా మారుతున్నాయని, ఇదే సమయంలో చిన్న కమతాల వల్ల అగ్రిటెక్‌ విస్తరణకు ఆటంకం కలుగుతున్నదని విశ్లేషించారు. అయినా వ్వయసాయానికి, టెక్నాలజీని జోడించడంలో తెలంగాణ గ్లోబల్‌ లీడర్‌గా ఎదిగిందని ప్రశంసించారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన ఒప్పందాలు చేసుకోవడం, సరైన పాలసీలు రూపొందించడం, వాటిని సమర్థంగా అమలు చేయడం, పెట్టుబడులు పెట్టడం, డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరచడం వంటివి తెలంగాణను గ్లోబల్‌ లీడర్‌గా నిలిపాయని వివరించారు. ఇతర ప్రభుత్వాలు ‘తెలంగాణ మాడల్‌’ నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు.

నాలుగు పిల్లర్లు

దేశంలోనే తెలంగాణ అతిపిన్న వయసున్న రాష్ట్రమైనా గ్రామీణ ప్రాంతాలకు సైతం అత్యాధునిక టెక్నాలజీని చేరవేసేందుకు ఉత్తమ మార్గాలను అనుసరించిందని నివేదికలో పేర్కొన్నారు. ముఖ్యంగా డిజిటల్‌ అగ్రికల్చర్‌ను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ పద్ధతిని ఎంచుకొని, డబ్ల్యూఈఎఫ్‌ సహాయంతో సరైన విధానాలు రూపొందించిందని, ఈ క్రమంలో వ్యాల్యూ చైన్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌, అగ్రిటెక్‌ సాండ్‌ బాక్స్‌, అగ్రికల్చర్‌ డాటా ఎక్స్‌చేంజ్‌, అగ్రికల్చర్‌ డాటా మేనేజ్‌మెంట్‌ ఫ్రేమ్‌వర్క్‌ను నాలుగు పిల్లర్లుగా వాడుకున్నదని తెలిపారు.

నివేదికలోని అంశాలు

డిజిటల్‌ గ్రీన్‌, బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ సహాయంతో 2022లో అమలు చేసిన ప్రాజెక్టు ‘సాగు బాగు’తో చివరి వినియోగదారు వరకు అగ్రిటెక్‌ ప్రయోజనాలు చేరాయి. ప్రస్తుతం 7 వేల మంది మిరప రైతులు కృత్రిమ మేధ ఆధారిత సలహాలను పొందుతున్నారు. మృత్తిక పరీక్షలు, ఉత్పత్తుల నాణ్యతా పరీక్షలు, ఈ కామర్స్‌ వంటి సేవలు వారికి అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2025 నాటికి దశలవారీగా లక్ష మంది రైతులకు అమలు చేయాలని భావిస్తున్నది.