- ప్రగతి భవన్‌లో కేటీఆర్‌ను కలిసిన ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర నాయకులు
- ప్రైవేట్ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం(TPTF) బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌తో TPTF రాష్ట్ర అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో సంఘం నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రైవేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఈఎస్ఐ, ఈపీఎఫ్ అమలు, 12 నెలల జీతం, ప్రభుత్వం ప్రకటించిన సెలవుల అమలు, అధిక సమయపాలన వంటి సమస్యలతో పాటు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించాలని మంత్రిని కోరారు.
ప్రైవేటు విద్యా సంస్థలను నియంత్రించడానికి ప్రభుత్వం రెగ్యులేషన్ కమిటీ వేయాలని, జీవో ఎంఎస్ నెం-1 లో మార్పులు చేసి పునరుద్దరించాలని కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని పరిష్కారంలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 12 వేల ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను యూ-డీఐఎస్ఈ (U-DISE) ద్వారా ఆన్లైన్‌లో పొందుపరచాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఉపాధ్యాయుల వివరాలు వారి సంఖ్య తెలిస్తే వారికి కావాల్సిన సౌకర్యాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా వారికి అందేలాగా చేస్తామని తెలిపారు.
ప్రభుత్వం ఏర్పడిన తరువాత మరోసారి ప్రైవేట్ ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే పరిష్కారమయ్యే సమస్యలకు పరిష్కారం చేస్తామని , అన్ని సమస్యలను విడతల వారిగా పరిష్కరించుకుందామనీ హామీ ఇచ్చారు. అనంతరం సంఘం అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు లక్షల మంది ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం, ఆత్మగౌరవం కోసం 13 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న ఏకైక సంఘం తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం (TPTF) అని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్భవించిన TPTF, నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, నేడు తెలంగాణ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తుందని తెలిపారు.
కరోనా కష్ట సమయంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలని మేము చేసిన విజ్ఞప్తికి స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి, మానవతా దృక్పథంతో ప్రతి ప్రైవేట్ టీచర్‌కు నెలకు 2 వేల రూపాయల నగదు, 25 కిలోల సన్న బియ్యాన్ని ఇచ్చి ఆదుకున్న విషయాన్ని మేము మరవలేదని తెలిపారు. భారతదేశంలనే ప్రైవేట్ ఉపాధ్యాయులను గుర్తించి ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే అని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా బీఆర్ఎస్(BRS) పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు.
రాష్ట్ర సాధన కోసం చిత్తశుద్ధితో ప్రాణాలకు తెగించి పోరాడిన నాయకుడు, అదే చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, సుపరిపాలనను అందించే సమర్థవంతమైన నాయకుడు కేసీఆర్ అని, అతని చేతిలోనే తెలంగాణ సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందని తెలిపారు.అందుకోసం రాష్ట్రంలోని ప్రైవేట్ ఉపాధ్యాయులు మరియు వారి కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. అదే విధంగా తమ సమస్యల పరిష్కారం కోసం హామీ ఇచ్చిన కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.