mt_logo

ఓట్ల కోసం కాదు తెలంగాణ బతుకు దెరువు కోసం పోరాటం: కొల్లాపూర్ సభలో సీఎం కేసీఆర్

ఇప్పుడు ఓట్ల కోసం కాదు తెలంగాణ బతుకు దెరువు కోసం పోరాటం అని సీఎం కేసీఆర్ తెలిపారు. కొల్లాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎలక్షన్లు వస్తే మంచి ఆలోచన చేసి ఓట్లు వెయ్యాలని సూచించారు. ప్రజల దగ్గర ఉన్న ఆయుధం ఓటు. దీనిని సక్రమంగా వేస్తే మంచి జరుగుతుంది. దేనికో ఆశపడి ఓటేస్తే మన తలరాతను వంకర చేస్తదని తెలిపారు. 

ఇందిరమ్మ రాజ్యమంతా దరిద్రమే  

ఎన్టీఆర్ పార్టీ పెట్టి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చేదాక జనాలకు సగం కడుపులే నిండేవి కదా? ఇందిరమ్మ రాజ్యం సరిగ్గా ఉంటే ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టిండు. 2 రూపాయలకు కిలో బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని అడిగారు. ఇందిరమ్మ రాజ్యమంతా దరిద్రం ఇంకొకటి లేకుండే. రాచిరంపాన పెట్టిండ్లు. దోపిడీలు చేశారు తప్ప కాంగ్రెస్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. 

రాహుల్ గాంధీ ముళ్ల కిరీటం పెట్టడానికి వచ్చిండా?

కాంగ్రెస్‌లో కొల్లాపూర్‌లో మంచి పరిస్థితి లేదు. గుంపు మేస్త్రీలు ఉండేవాళ్లు. బొంబాయికి ఇక్కడి నుంచి వలస పోయేందుకు ప్రత్యేక బస్సులు ఉండేవి.  ఇయ్యాల హౌల పోసిగాళ్ల లెక్క గోల్ మాల్ అవుదామా? ఎవడో ఏదో చెబితే ఆగమవుదామా? అని అడిగారు. తెలంగాణను సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నరు కాంగ్రెస్ నాయకులు. ఇందిరమ్మ వారసుడు రాహుల్ గాంధీ కొల్లాపూర్‌కు వచ్చిండు. గడ్డి కోయడానికి వచ్చిండా? తెలంగాణను ఆగం పట్టియ్యడానికా. ముళ్ల కిరీటం పెట్టడానికి వచ్చిండా? అని సీఎం ప్రశ్నించారు. మంచి ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించండి. కారు గుర్తుకే ఓటు వేయండని సీఎం కేసీఆర్ కోరారు.