mt_logo

రేవంత్ రెడ్డి, బీజేపీ మల్కాజ్‌గిరికి చేసింది గుండుసున్నా: కేటీఆర్

మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎంతో కమిట్మెంట్‌తో 10 కార్పొరేషన్లను మేడ్చల్ కార్యకర్తలు గెలిపించారు. మంచి సేవ చేసే గుణమున్న రాగిడి లక్ష్మారెడ్డిని మనం గెలిపించుకోవాలె అని పిలిపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని తీసుకొచ్చి మన మీద రుద్దే ప్రయత్నం చేసింది.. మల్కాజ్‌గిరిలో బీజేపీతోనే మనకు పోటీ.. ఇది అందరికీ తెలుసు. పదేళ్లలో మోడీ చేసిందేమిటీ? పదేళ్లలో కేసీఆర్ పాలనలో చేసిందేంటో ఒక్కసారి చూసుకోవచ్చు అని అన్నారు.

కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశారు.. కేసీఆర్ ఏం చేసిండో మేము చెప్తాం. ఈటల రాజేందర్ గారికి దమ్ముంటే మోడీ మల్కాజ్‌గిరికి ఏం చేసిండో చెప్పి ఓట్లు అడగాలె.. బీజేపీ మల్కాజ్‌గిరికి చేసింది గుండుసున్నా అని కేటీఆర్ విమర్శించారు.

పదేళ్లు కంటోన్మెంట్‌లో భూములు కావాలని అడిగితే పట్టించుకోలేదు.. తెలుగు అధికారి గిరిధర్ అనే వ్యక్తి ద్వారా ఆ ఫైల్ కదిలింది.. మందికి పుట్టిన బిడ్డలను నా బిడ్డలని చెప్పుకునే తత్వం రేవంత్ రెడ్డి.. సిగ్గు, శరం ఉండాలి.. బీఆర్ఎస్ చేసిన పనులను నేను చేశానని చెప్పుకోవటానికి అని దుయ్యబట్టారు.

గెలుస్తానని రేవంత్ రెడ్డి కూడా అనుకోలేదు.. కానీ అదృష్టం కొద్ది గెలిచిండు. మొన్నటి దాకా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అంటివి.. ఇప్పుడు గత గవర్నమెంట్ బీజేపీతో లొల్లి పెట్టుకుందంటున్నావ్.. రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తుండటం చూస్తే జాలేస్తోంది అని పేర్కొన్నారు.

కాంగ్రెసోళ్లు పచ్చి మోసగాళ్లు.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పిన ఉద్యోగాలు ఇయ్యలే.. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగులు నీ ఖాతాలో వేసుకుంటే విద్యార్థులు చైతన్యవంతులు మీ అంతు చూస్తారు అని అన్నారు.

రేవంత్ రెడ్డి గానీ, బీజేపీ గానీ మల్కాజ్‌గిరికి చేసింది గుండుసున్నా.. ఒక్క కొత్త మెడికల్ కాలేజ్, నవోదయ పాఠశాల, కొత్త కాలేజ్ కూడా ఇయ్యలే.. కానీ మోడీ దేవుడని బండి సంజయ్ అంటాడు.. అసలు మోడీ ఎవరికీ దేవుడు? రేట్లు పెంచినందుకా, మహిళలకు దేవుడా, ఏం అభివృద్ధి చేసిండని దేవుడు అని ప్రశ్నించారు.

మతం పేరుతో మనం రాజకీయాలు చేయలేదు.. నిజమైన హిందూవు మతం పేరుతో రాజకీయాలు చేయడు. ఏం చేశావంటే జై శ్రీరామ్ పేరుతో రాజకీయాలు చేయటమే బీజేపీకి తెలిసింది అని విమర్శించారు.

రుణమాఫీ చేయలేదని మాట్లాడుతున్నందుకు ఈటల రాజేందర్‌కు సిగ్గు అనిపియ్యాలే.. నువ్వు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడే రూ. 16 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసింది కేసీఆర్.. మోడీ మాత్రం పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు పెద్ద పారిశ్రామిక వేత్తలకు రుణమాఫీ చేసిండు అని అడిగారు.

ఏం మొఖం పెట్టుకొని బీజేపీ ఓట్లు అడుగతదో ఈటల చెప్పాలె.. మల్కాజ్‌గిరిలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా బీజేపీకి ఎందుకు రాలేదు.. ఇక్కడ కాంగ్రెస్‌కు ఓటేస్తే… బీజేపీకి ఓటేసినట్లే అని కేటీఆర్ అన్నారు.

రాహుల్ గాంధీ ఏమో చౌకిదార్ చోర్ హై అంటాడు.. రేవంత్ రెడ్డి ఏమో మోడీ హమారా బడే భాయ్ అంటాడు.. రాహుల్ గాంధీ అదానీ ఫ్రాడ్ అంటే రేవంత్ రెడ్డి అదానీ నా ఫ్రెండ్ అంటాడు.. రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కాం ఏం లేదంటాడు.. కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయమని అంటాడు.. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కవితమ్మ అరెస్ట్ కరెక్టే అంటాడు.. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా? మోడీ కోసం పనిచేస్తుండా అని ప్రశ్నించారు.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లే మొట్ట మొదటి వ్యక్తి జంపింగ్ జపాంగ్ రేవంత్ రెడ్డే.. రేవంత్ రెడ్డి బీజేపీలో వెళ్లటం పక్కా.. ఈ విషయం మీద ఎందుకు రేవంత్ స్పందిచటం లేదో చెప్పాలె అని అడిగారు.

రేవంత్ రెడ్డి జేబుదొంగలా మాదిరిగా జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండట.. మెడల పేగులు వేసుకొని తిరిగేటోడు ముఖ్యమంత్రా? నీ ప్రభుత్వాన్ని పడగొడితే మానవబాంబు అవుతా అంటాడు.. ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం మాకు లేదు.. నీ పక్కనే నల్గొండ, ఖమ్మం మానవబాంబులే నిన్ను కూలగొడుతాయి అని అభిప్రాయపడ్డారు.

నువ్వే 5 ఏళ్లు సీఎం ఉండాలె.. చెప్పిన 420 హామీలు అమలు చేయాలే అని మేము కోరుకుంటున్నాం..దమ్ముంటే రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనీ నేరవేర్చు.. రుణమాఫీ చేస్తా అన్న పొంకనాల రెడ్డి.. రేవంత్ రెడ్డి ఎక్కడ? రుణమాఫీ అయినవాళ్లు కాంగ్రెస్‌కు ఓటు వెయ్యండి.. మిగతా వాళ్లు బీఆర్ఎస్ ఓటు వేయండి అని అన్నారు.

రేవంత్ రెడ్డి పొంకనాల పోశెట్టి.‌‌. మహిళలకు రూ. 2,500 ఇస్తా అన్నాడు.‌. ఎవరికైనా వచ్చాయా? రైతులు, ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఏ వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేదు అని కేటీఆర్ తెలిపారు.

ఏప్రిల్ 1 న గ్రూప్ 2 నోటిఫికేషన్ అన్నాడు.. అది కూడా ఇచ్చకొట్టిండు.. కరెంట్ కోతలు మొదలైనయ్.. బావుల కాడా పండుకునే రోజులు మళ్ల వచ్చినయ్.. ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు అని రేవంత్ రెడ్డి ముందే చెప్పిండు అని గుర్తు చేశారు.

మనమే తప్పు చేసినం.. మనం చేసిన మంచి పనులను చెప్పుకోవాల్సినంత చెప్పుకోలే.. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు జరగకుండా చూసుకోవాలె.. రాష్ట్రంలో సెక్యులర్ పార్టీ ఉందంటే అది బీఆర్ఎస్ మాత్రమే అని స్పష్టం చేశారు.

ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు ఇచ్చే వాళ్లు కావాలని అందరికీ అర్థం చేయించాలె.. మనమే అభ్యర్థి అన్నట్లుగా కష్టపడి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించుకుందాం అని పిలుపునిచ్చారు.