mt_logo

రైతుల సమస్యలపై సీఎస్‌కు వినతిపత్రం అందించిన బీఆర్ఎస్ నేతల బృందం

రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి బీఆర్ఎస్ నాయకుల బృందం వినతిపత్రం సమర్పించింది. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం, పంటల మద్దతు ధరకు అదనంగా క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్ చెల్లింపు తదితర డిమాండ్లతో బీఆర్ఎస్ నేతలు వినతిపత్రం సమర్పించారు.

అనంతరం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ కక్షపూరిత వైఖరి వల్ల రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోయింది.. నీళ్ళను ఎలా ఇవ్వాలో తెలియక ప్రభుత్వం విఫలం అయ్యింది అని విమర్శించారు.

కేసీఆర్ గారిని నమ్ముకొని పంటలు పెట్టాము, నీళ్ళు ఉండి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం నీళ్ళు ఇవ్వడం లేదని బాధపడుతున్నారు . కేసీఆర్ హయంలో చెక్‌డ్యామ్‌లు నిర్మించి కాళేశ్వరం నీళ్ళను, అందించాము.. కేసీఆర్ కాళేశ్వరం ప్రాధాన్యతను గుర్తించి కేంద్రంతో మాట్లాడి, మహారాష్ట్రను ఒప్పించి నిర్మించారు అని గుర్తు చేశారు.

కేసీఆర్ గారు ఇప్పుడు ఉండి ఉంటే ఒక్క ఎకరం కూడా ఎండనిచ్చే వాడు కాదు.. కరీంనగర్‌కు కేసీఆర్ వస్తున్నాడని తెలిసి గాయత్రి పంప్ ద్వారా నీళ్ళను లిఫ్ట్ చేసి కాలువలకు వదిలారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులు ఉన్నారని సోయి కూడా లేదు, ఆయన మూటలతో ఢిల్లీకీ పోవడమే సరిపోతోంది అని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు.

ప్రతిదానికి నోరు పారేసుకోని కేసీఆర్‌పై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు.. వంద రోజుల్లోనే 200 మందీ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు. భట్టి విక్రమార్కకు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్నడూ బాధ్యత తెలియదు, రైతుల గురించి తెలియదు అని అన్నారు.

పత్రికలలో లీక్‌లు ఇచ్చి పెద్ద పెద్దగా రాపించి బ్రతుకుదామని అనుకుంటున్నారు.. తెలంగాణ రాకముందు ఇంతకంటే ఎక్కువ కుట్రలు చేసి పెద్ద పెద్దగా వార్తలు రాశారు.. అయినా పట్టుదలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము అని పేర్కొన్నారు

కేసీఆర్ ఉంటే ఇంత బాధ ఉండకపోతుండే అని రైతులు బాధపడుతున్నారు.. ఒకవైపు కరువు పరిస్థితిలు వస్తున్నాయి.. సాగు నీరు, తాగు నీరు ఎలా ఇవ్వాలో సోయి లేకుండా ఉన్నారు. గత 15 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ పొలాల్లో రైతుల దగ్గరకు వెళ్ళింది అని అన్నారు.

పంట నష్టం అంచనా వేసి ఈరోజు సీఎస్ గారికీ వినతిపత్రం ఇచ్చాము.. 100 రోజుల్లోనే 2014 కంటే ముందు పరిస్థితిలు రాష్ట్రంలో వచ్చాయి. చేనేత కార్మికుల ఆత్మహత్యలను ఆపేందుకు జోలె పట్టుకోని ఎలానైతే కేసీఆర్ గారు తిరిగారో, ఇప్పుడు రైతులకు ధైర్యం చెప్పేందుకు రైతుల దగ్గరకు కేసీఆర్ వెళ్తున్నాడు అని తెలిపారు.

రైతుబంధు, రూ. 2 లక్షల రుణమాఫీ ఏంటనే అమలు చెయ్యాలి… ఎన్నికల కోడ్ ఉందని ఆగొద్దు.. మేము ఎక్కడా ఈసీకి ఎటువంటి ఫిర్యాదులు చెయ్యం.. రూ. 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.. వెంటనే క్వింటాల్‌కు 500 బోనస్ ఇచ్చి వడ్లు, మొక్కజొన్నలు కొనాలి అని డిమాండ్ చేశారు.

నీళ్ళు ఇస్తామని చెప్పితే… మిమ్మల్ని నమ్మి వరి పెట్టారు… నీళ్ళు ఇవ్వకపోవడం వల్లనే పంటలు ఎండిపోయాయి..ప్రకృతి కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువే.. కరెంట్ సరిగ్గా ఇవ్వలేక, మోటర్లు కాలిపోతున్నాయి అని విమర్శించారు.

కరెంట్ పోవడం లేదని మాట్లాడుతున్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో దావత్‌కి వెళ్ళితే అక్కడ కరెంట్ పోయింది.. ఎట్టి పరిస్థితుల్లో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. హైదరాబాద్‌లో దారుణంగా నీళ్ళ ఇబ్బంది ఉన్నది.. ట్యాంకర్ బుక్ చేస్తేనే వారం దాకా రావడం లేదు అని జగదీష్ రెడ్డి అన్నారు.

కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి పరిస్థితి దాపురించింది.. నష్టపోయిన రైతాంగానికి వెంటనే ఎకరాకు రూ. 25,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.