హైదరాబాద్: నిరుడు భారీ వర్షాలతో రోడ్లు దెబ్బతిన్నాయి. చాలాచోట్ల గుంతలుపడి ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. దీన్ని గమనించిన సీఎం కేసీఆర్ వెంటనే రోడ్లకు మరమ్మతులు చేయించాలని ఆర్అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రూ. 2,800 కోట్లు మంజూరు చేశారు. దీంతో రహదారులకు మహర్దశ వచ్చింది. పనులు ఊపందుకొన్నాయి. ఇప్పటివరకు రూ.670 కోట్ల వ్యయంతో 1,757 కిలోమీటర్ల పొడవునా మరమ్మతులు పూర్తై..ఆ రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. మరో 1,443 కిలోమీటర్ల పొడవున పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరుకు పనులు పూర్తిచేయాలని రోడ్లు భవనాల శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పాత ఆర్‌అండ్‌బీ సర్కిళ్ల పరిధిలో మొత్తం 6,641 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టు అంచనాలు రూపొందించిన అధికారులు, గత ఫిబ్రవరిలో టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు ప్రారంభించారు. మొత్తం పనులను 1,173 ప్యాకేజీలుగా రూపొందించగా, ఇందులో అత్యధికంగా కరీంనగర్‌లో 175, వరంగల్‌లో 162, నల్లగొండలో 138 ఉన్నాయి. ఈ రోడ్ల మరమ్మతు పనులు నాణ్యంగా, శరవేగంగా పూర్తిచేయాలని అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ క్రమంలోనే ఎక్కడా జాప్యం లేకుండా పనులు చేపట్టి కొనసాగిస్తున్నారు. మొదట్లో కార్మికుల కొరత, అనంతరం అకాల వర్షాల వల్ల పనుల్లో కొంత జాప్యం చోటుచేసుకొన్నప్పటికీ ప్రస్తుతం పనులు ఊపందుకొన్నాయి.
ముందు ప్రాధాన్యతా రోడ్ల పనులు..
జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి వెళ్లే ప్రధాన రోడ్లను ప్రాధాన్యత క్రమంలో ముందుంచి పనులు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయని, మరో 1,443 కిలోమీటర్ల పొడవున గల 261 ప్యాకేజీ పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని వెల్లడించారు. 2,389 కిలోమీటర్ల పొడవునా చేపట్టనున్న 370 ప్యాకేజీల పనులు వచ్చే ఒకటి-రెండు రోజుల్లో ప్రారంభించనున్నట్టు చెప్పారు. వర్షాలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నందున పనుల్లో కొంత జాప్యం చోటుచేసుకొనే అవకాశం ఉండటంతో ప్రధాన రోడ్ల పనులు ముందుగా పూర్తిచేసినట్టు వారు వివరించారు.
రోడ్ల మరమ్మతుల వివరాలు
పనులు పూర్తయిన రోడ్ల పొడవు-1,757.33 కిలో మీటర్లు
పనులు పురోగతిలో ఉన్న రోడ్ల పొడవు-1,443.46 కిలో మీటర్లు
పనులు చేపట్టాల్సిన రోడ్ల పొడవు-2,389.57 కిలో మీటర్లు
టెండర్ల దశలో ఉన్న రోడ్ల పొడవు-1051.52 కిలో మీటర్లు
మొత్తం రోడ్ల పొడవు- 6,641.88 కిలో మీటర్లు