mt_logo

కేంద్రం మాతృవందనం కంటే మ‌న కేసీఆర్ కిట్ త్రీ టైమ్స్ బెట‌ర్‌!

తెలంగాణ‌లో మాతాశిశు మ‌ర‌ణాల నివార‌ణ కోసం సీఎం కేసీఆర్ కేసీఆర్ కిట్ ప‌థ‌కానికి శ్రీకారం చుట్టారు. ప్ర‌భుత్వ ద‌వాఖాన‌లో పురుడు పోసుకొనే పేదింటి త‌ల్లుల‌కు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈ ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేశారు. ఇందులో భాగంగా బిడ్డ పుట్ట‌గానే మ‌చ్చ‌ర్‌దాన్‌, పౌడ‌ర్‌, కొబ్బ‌రినూనె.. ఇత‌ర వ‌స్తువుల కోసం బ‌య‌ట‌కు ప‌రుగెత్త‌కొని జేబు గుల్ల చేసుకోకుండా ఉండేందుకు 16 వ‌స్తువుల‌తో కూడిన కేసీఆర్ కిట్‌ను అంద‌జేస్తునారు. అలాగే, మ‌గ బిడ్డ పుడితే రూ.12వేలు.. ఆడ‌బిడ్డ పుడితే రూ. 13వేలు అంద‌జేస్తున్నారు. ఇలా..నిరుపేదల ఆడబిడ్డ‌ల‌ ప్ర‌స‌వం ఆర్థికంగా భారం కాకుండా ఆదుకొంటున్నారు. దీంతో ఈ ప‌థ‌కం దేశానికే ఆద‌ర్శంగా నిలిచింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా కేంద్ర స‌ర్కారు గ‌ణాంకాలే వెల్ల‌డిస్తున్నాయి.  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’ (పీఎంఎంవీవై) పథకం కన్నా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్‌ కిట్ మూడింత‌లు  ప్రయోజనకారిగా ఉన్నదని స్పష్టం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలన తొమ్మిదేండ్లు పూర్తయిన సందర్భంగా ఆరోగ్య రంగంలో సాధించిన అభివృద్ధిని వివరిస్తూ గురువారం ప్రధాని మోదీ ఓ ట్వీట్‌ చేశారు. పీఎంఎంవీవై పథకం కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.11 కోట్ల మంది గర్భిణులు సాయం పొందినట్టు పేర్కొన్నారు. వీరికి కేంద్రం ద్వారా రూ.12,100 కోట్ల ప్రయోజనం కలిగినట్టు వెల్లడించారు. ఈ లెక్కన సగటున ఒక్కో గర్భిణికి అందించిన సాయం రూ.3,890. ఈ పథకం ఫలితంగా దవాఖాన ప్రసవాలు 94.8 శాతానికి పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

కేసీఆర్‌ కిట్‌తో 13.90 లక్షల మందికి లబ్ధి

రాష్ట్రంలో కేసీఆర్‌ కిట్‌ ద్వారా ఇప్పటివరకు 13.90 లక్షల మంది గర్భిణులు ప్రయోజనం పొందారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,261 కోట్ల ఆర్థిక సాయం అందించింది. కేసీఆర్‌ కిట్‌ ద్వారా సగటున ఒక్కో గర్భిణికి రూ.9,079 సాయం అందింది. కేంద్రం సాయంతో పోల్చితే రాష్ట్ర ప్రభుత్వం రూ.5,189 అధికంగా సాయం అందించింది. ఇది కేంద్రం సాయం కన్నా 133 శాతం అధికం.

ఆడబిడ్డ పుడితే వెయ్యి ఎక్కువ‌

రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ పథకం కింద ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, బాబు పుడితే రూ.12 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నది. రిజిస్ట్రేషన్‌ సమయంలో, ఏఎన్సీ చెకప్స్‌ తర్వాత, ప్రభుత్వ దవాఖానలో ప్రసవం, పిల్లలకు టీకాలు వేయించిన తర్వాత.. ఇలా విడతలవారీగా నగదు జమ అవుతున్నది. కేసీఆర్ కిట్ ప‌థ‌కం.. ద‌వాఖాన‌ల్లో మెరుగైన స‌దుపాయాల‌వ‌ల్ల ప్ర‌స‌వాల సంఖ్య భారీగా పెరిగింది.  ఈ ఏడాదిలో 69శాతం ప్ర‌స‌వాలు ప్ర‌భుత్వ ద‌వాఖాన‌లోనే జ‌రిగాయి. ప్రైవేట్‌కెళ్లి జేబులు గుల్ల చేసుకొనే బ‌దులు..ప్ర‌భుత్వ ద‌వాఖాన‌ల్లో ఫ్రీగా.. నార్మ‌ల్ డెలివ‌రీ చేయించుకొనేందుకు నిరుపేద‌లు క్యూక‌డుతున్నారు. 

తెలంగాణ సో బెట‌ర్‌

పీఎంఎంవీవై కింద గర్భిణులకు సగటున అందిన సాయం- రూ.3,890  

కేసీఆర్‌ కిట్‌ ద్వారా సగటున అందుతున్నది -రూ.9,079

కేంద్రంతో పోల్చితే రాష్ట్ర సాయం- 133 శాతం ఎక్కువ