- మంచిర్యాలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
- రూ.6 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల అందజేత
సమైక్య రాష్ట్రంలో కునారిల్లిన కులవృత్తులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ జీవంపోస్తున్నారు. మూగజీవాల పోషణతో పొట్టపోసుకొంటున్న గొల్లకుర్మలకు తెలంగాణలో పెద్దపీట వేటవేశారు. రాష్ట్రంలోని గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అర్హులను గుర్తించి వారికి గొర్రెల యూనిట్లను అందజేస్తున్నారు. ఇప్పటికే మొదటి విడత పంపిణీ పూర్తికాగా, తెలంగాణలో మూగజీవాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. బక్కపల్చని మందతో అష్టకష్టాలు అనుభవించిన గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ పథకం బతుకుదెరువును చూపింది. ఫలితంగా మాంసం ఉత్పత్తిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇదిలా ఉండగా, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ మరికొంతమంది గొల్లకుర్మల జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రెండో విడత గొర్రెల పంపిణీకి పచ్చజెండా ఊపారు. దీంతో నేటి నుంచి రెండో విడత మొదలు కానున్నది. అర్హులైన గొల్ల కురుమల జాబితాను పశు సంవర్ధక శాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీని శుక్రవారం లాంఛనంగా ప్రారంభిస్తారు. నల్లగొండ జిల్లాలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు గొర్రెలు అందజేస్తారు.
పంపిణీ ఇలా..
-అర్హులైన గొల్ల కురుమలందరికీ ఒక్కొక్కరికి ఒక యూనిట్ (21) గొర్రెలను పంపిణీ చేస్తున్నారు.
-మొత్తం 7.61 లక్షల మందిని అర్హులుగా తేల్చారు.
-వీరందరికీ రూ.11వేల కోట్లతో రెండు విడతల్లో గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -తొలి విడత గొర్రెల పంపిణీ పూర్తి కాగా, రెండో విడత శుక్రవారం నుంచి మొదలు కానున్నది.
-గొర్రెల పంపిణీకి పశు సంవర్ధక శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
-లబ్ధిదారులను గుర్తించడంతోపాటు ఎక్కడెక్కడి నుంచి గొర్రెలను
తీసుకురావాలనే దానిపై కసరత్తు పూర్తి చేశారు.
-రెండో విడతలో రూ.6,085 కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేస్తారు.
-ఇందులో ప్రభుత్వ వాటా రూ.4,563 కోట్లు కాగా.. లబ్ధిదారుల వాటా రూ.1,521 కోట్లు.
-ఈ పథకం తొలినాళ్లలో యూనిట్ ధర రూ.1.25 లక్షలు గా కాగా, మార్కెట్లో గొర్రెల ధర పెరగడంతో లబ్ధిదారులపై భారం పడకుండా ఒక్కో యూని ట్ ధరను రూ.1.75 లక్షలకు ప్రభుత్వం పెం చింది. -గొర్రెలు ప్రమాదవశాత్తు మరణిస్తే ఒక్కో గొర్రెకు రూ.5 వేల బీమా ఇస్తుంది. పొట్టేలు కు రూ.7 వేలను అందిస్తున్నది.
-దేశంలో అత్యధిక గొర్రెలు గల రాష్ట్రంగా తెలంగాణ టాప్‌లో నిలిచింది.
-కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర ఏర్పాటు సమయంలో తెలంగాణలో గొర్రెల సంఖ్య 1.28 కోట్లు ఉండగా, ఇప్పుడు ఇది 1.91 కోట్లకు పెరిగింది.
గొర్రెల పంపిణీ పూర్తి వివరాలు
గొర్రెలు, మేకల పెంపకందారుల కోఆపరేటివ్ సొసైటీలు- 8109
మొత్తం సభ్యుల సంఖ్య- 7,61,895
తొలి విడతలో గొర్రెల పంపిణీ- 3.93 లక్షల మందికి
తొలి విడతలో పంపిణీ చేసిన గొర్రెలు- 82.64 లక్షలు
చేసిన ఖర్చు -రూ.5,064.42 కోట్లు
పుట్టిన గొర్రె పిల్లల సంఖ్య- 1.35 కోట్లు
సృష్టించిన ఆదాయం -రూ.8 వేల కోట్లు
యూనిట్ ధర రూ.1.25 లక్షల – రూ.1.75 లక్షలకు పెంపు
రెండో విడత అర్హుల సంఖ్య -3.38 లక్షలు
అవసరమైన మొత్తం -రూ.6,085 కోట్లు