పాలమూరు అంటేనే ఠక్కున గుర్తొచ్చేది కరువు.. పనులకోసం ప్రజల వలసలు. సమైక్యపాలనలో పాలకుల పట్టింపులేమితో ఆ ప్రాంతమంతా కరువు విలయతాండవం చేసింది. తలాపునే కృష్ణమ్మ పారుతున్నా నిత్యం నీటికటేకటే. సాగునీటితో పాటు తాగునీటికి తండ్లాటే. నీళ్లు లేక.. పంటలు పండక పాలమూరు అన్నదాతలు ఆగమైపోయారు. కుటుంబాలను పోషించుకొనేందుకు వలసబాటపట్టారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో సాధించుకొన్న తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలమూరు కరువును సమూలంగా తరమాలని నిర్ణయించుకొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మొత్తం, రంగారెడ్డి జిల్లాలో 12.3 లక్షల ఎకరాలకు సాగునీటి తో పాటు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్‌ఎల్‌ఐఎస్) రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015 లో శ్రీకారం చుట్టారు. అయితే, ఈ ప్రాజెక్టుకు తెలంగాణకు చెందిన ప్రతిపక్షాలతోపాటు అటు కేంద్ర సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. అయినా సీఎం కేసీఆర్ మొక్కవోని దీక్షతో పాలమూరుకు అనుమతుల కోసం భగీరథ ప్రయత్నం చేశారు. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం 34వ ఈఏసీ సమావేశం నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా 49వ సమావేశంలో ఎట్టకేలకు అనుమతులు లభించాయి. ఎన్నో కేసులను ఎదుర్కొని, ఎన్నో అడ్డంకులను అధిగమించి పాలమూరు ప్రాజెక్టును తెలంగాణ సర్కారు పరుగులు పెట్టిస్తున్నది. త్వరలోనే కరువునేలపై కృష్ణమ్మను చిందులేసేలా చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నది.
చకచకా ఫేజ్-1పనులు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి దశలో తాగునీరు, రెండో దశలో సాగు నీటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని, తెలంగాణ సర్కారు లక్ష్యంగా పెట్టుకొన్నది. ఇప్పటికే చకచకా పనులు పూర్తిచేస్తుండగా, తాగునీటి సరఫరాకు సంబంధించి వర్క్ తుదిదశకు చేరుకొన్నది. ఇక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కూడా రావడంతో ఇందుకు సంబంధించిన నీటి ఎత్తిపోతలను కూడా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించిన టెస్టింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.