సమైక్య రాష్ట్రంలో సాగు, తాగునీటికి పాలమూరు జిల్లా అరిగోసలు పడ్డది. తలాపునే కృష్ణమ్మ ప్రవహిస్తున్నా నాటి పాలకుల పట్టింపులేమి, నిర్లక్ష్యంతో ఈ గడ్డపై చుక్కనీరు లేని దయనీయ స్థితి. సమైక్య పాలకులు ఏదో ముక్తసరిగా ఒక్క జూరాల ప్రాజెక్టును పూర్తి చేసినా.. అందులో ఎనిమిది నుంచి తొమ్మిది టీఎంసీల కంటే ఎక్కువ నీటిని నిల్వచేసుకోలేని దుస్థితి. మళ్లీ అందులోనుంచి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమకు నీళ్లను తరలించుకుపోయే కుట్రలు.. వెరసి అన్నదాతలు కన్నీళ్ల సాగు చేయలేక కాడి వదిలేశారు. సాగునీరు, కరెంట్ లేక పొలాలన్నీ బీళ్లుగా మారిపోయాయి. పాలమూరు జిల్లా మొత్తం వలస బాటపట్టింది. అన్నదాతలు, కౌలు రైతులు, కూలీలు ఇలా అందరూ పిల్లాజెల్లను వదిలి హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాలు, దేశాలకు పని వెతుక్కంటూ వెళ్లిపోయారు. సమైక్య పాలనలో పాలమూరు జీవశ్చవంలా మారిపోయింది. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ విజన్‌తో పాలమూరు సాగునీటి గోసకు చెక్ పడింది. నాడు నీళ్లు లేక వెలవెలబోయిన పాలమూరు గడ్డపై నేడు కృష్ణమ్మ జలతారు నృత్యం చేయనున్నది.
పదేండ్లలో పాలమూరు గడ్డపై జలదృశ్యం
ఏడాదంతా సాగునీరు ఉండాలంటే వర్షం పడ్డ మూడు నెలల్లో వచ్చే వరదను ఒడిసిపట్టాలి. ఇందుకోసం భారీ ప్రాజెక్టులు కట్టాలి. అవికూడా ఓ నిర్మాత్మక ప్లాన్‌తో ఉండాలి. అప్పుడే మూడు పంటలకూ నీళ్లందించొచ్చు. అయితే, ఉమ్మడి పాలకులు ఇలాంటి ఆలోచనే చేయకపోవడంతో పాలమూరు జిల్లా కరువుకు కేరాఫ్‌గా మారిపోయింది. సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి చిరునామాగా నిలిచిపోయింది. ఒక్క జూరాలను మాత్రమే పూర్తిచేసిన ఉమ్మడి పాలకులు భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌లాంటి ప్రాజెక్టులను మధ్యలోనే వదిలేశారు. దీంతో కేవలం ఓ తొమ్మిది టీంఎసీల నీళ్లను మాత్రమే స్టోర్ చేసుకొనే వీలుండడంతో కనీసం ఒక పంటకు.. అదీ 70 వేల ఎకరాలకు కూడా నీరందించలేని దుస్థితి. అయితే, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఈ దుస్థితిని మార్చేందుకు ప్రాజెక్టుల రీఇంజినీరింగ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. భారీ రిజర్వాయర్లు, పంపుహౌజ్‌లు, సర్జ్‌పూల్స్‌తో కావాల్సినన్ని నీళ్లను స్టోర్ చేసుకొనేలా మహా ప్రాజెక్టును నిర్మించారు. అంజనగిరి (8.51 టీఎంసీలు), వీరాంజనేయ (6.55), వెంకటాద్రి (16.74), కురుమూర్తిరాయ (17.34), ఉద్దండాపూర్ (16.03), కేపీ లక్ష్మీదేవిపల్లి (2.80టీఎంసీలు) జలాశయాలను నిర్మించి, కృష్ణమ్మ నీటిని ఒడిసిపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గుట్టలే ఆనకట్టలుగా ఐదు రిజర్వాయర్లను నిర్మించారు. ఫలితంగా రాష్ట్ర ఏర్పాటు నాటికి కృష్ణా బేసిన్‌లో కేవలం 8 టీఎంసీలుగా ఉన్న నీటి నిల్వ సామర్థ్యాన్ని ఏకంగా పదింతలు చేసి.. 67 టీఎంసీలకు పెంచారు. కరువు కరతాళ నృత్యం చేసిన పాలమూరు గడ్డపై కృష్ణమ్మ జలసవ్వడులు వినిపించేలా చేశారు.