mt_logo

99 మంది నిర్వాసితులకు రూ. 6.85 కోట్ల విలువైన పరిహారం చెక్కుల పంపిణీ

  • పాల‌కుడు మంచివాడైతే …. ప్ర‌కృతి స‌హక‌రిస్తుంది: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
  • భూ నిర్వాసితుల‌కు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్: ప్రజలకు మంచి చేయాలని పాలకుడు చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే.. దేవుని ఆశీస్సులు, ప్రకృతి కటాక్షం లభిస్తుందనడానికి  పుష్క‌లంగా కురుస్తున్న వ‌ర్షాలే నిద‌ర్శ‌మ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ అంత‌టా జ‌ల‌క‌ళ సంత‌రించుకుంద‌ని, ప‌చ్చ‌ద‌నం ప‌రుచుకుంద‌ని వ్యాఖ్యానించారు.  కాళేశ్వ‌ర్యం ప్రాజెక్ట్ లో భాగంగా చేప‌ట్టిన ప్యాకేజీ -27, స‌ద‌ర్మాట్ బ్యారేజ్ భూ నిర్వాసితుల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. మామ‌డ‌ మండ‌లం లింగాపూర్ గ్రామానికి చెందిన 19 మంది ల‌బ్ధిదారుల‌కు రూ. 58. 20 ల‌క్ష‌ల విలువ చేసే చెక్కులు, ఆరెప‌ల్లి గ్రామానికి చెందిన 70 మంది ల‌బ్ధిదారుల‌కు రూ. 2. 98 కోట్ల విలువ చేసే చెక్కుల‌ను   కాళేశ్వ‌రం ప్రాజెక్ట్  లో భాగంగా చేప‌ట్టిన ప్యాకేజీ 27- (ల‌క్ష్మి న‌ర్సింహాస్వామి లిఫ్ట్ ఇరిగేష‌న్ స్కీం) భూ నిర్వాసిత ల‌బ్ధిదారుల‌కు న‌ష్టంప‌రిహారం అంద‌జేశారు. 
మామ‌డ మండ‌లం క‌మ‌ల్ కోట్ కుర్రుకు చెందిన స‌ద‌ర్మాట్ బ్యారేజీ నిర్వాసితులకు రూ. రూ. 3.28 కోట్లు విలువ చేసే చెక్కుల‌ను 10 మంది ల‌బ్ధిదారుల‌కు అంద‌జేశారు.  మొత్తం 99 మంది నిర్వాసితులకు రూ. 6.85 కోట్ల విలువైన పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ…. సీఎం కేసీఆర్‌ పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు  అమ‌లు అవుతున్నాయ‌ని అన్నారు.  రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.  ప్రాజెక్ట్ ల నిర్మాణంతో తెలంగాణ స‌స్య‌శ్యామల‌మైంద‌ని, సంవృద్దిగా పంట‌లు పండుతున్నాయ‌ని తెలిపారు. అర్హులైన ప్రతి నిర్వాసితుడికీ న్యాయం చేస్తామ‌ని, వారికి  సాధ్యమైనంత త్వరగా ప‌రిహారం అందేలా చూస్తామ‌న్నారు.