టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది.. వెన్నుపోటు రాజకీయం.. రెండు కండ్ల సిద్ధాంతం. కుట్ర, కుతంత్ర రాజకీయాలకు ఆయన ఆద్యుడని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణపై చిన్నచూపు చూసినవారిలో బాబు ముందుంటారు. రెండు కండ్ల సిద్ధాంతంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని కూడా తన రాజకీయం కోసం వాడుకొన్న ఘనుడు చంద్రబాబు అనే విమర్శలున్నాయి. ఆయన హయాంలో ఆంధ్ర, రాయలసీమలను పట్టించుకొన్నంత తెలంగాణపై శ్రద్ధ చూపలేదు.
పైగా హైదరాబాద్‌లో ఒక్క సైబర్ టవర్ ఏర్పాటు చేసిన ఆయన.. దాన్నే చూపిస్తూ తెలంగాణను, హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానంటూ ఎక్కడపడితే చెప్పుకొని తిరుగుతుంటారు. అసలు హైదరాబాద్‌కు పురుడుపోసింది తానే అన్నట్టు ఊదరగొడుతుంటారు. తాజాగా, ఆయన హైదరాబాద్ అభివృద్ధిని తన ఖాతాలో వేసుకొని, ఏపీ ప్రజల దృష్టిలో హీరో అయ్యేందుకు యత్నించారు. తెలంగాణకు, ఆంధ్రకు.. ఉత్తర కొరియాకు, దక్షిణ కొరియాకు ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యానించి.. తనవల్లే తెలంగాణ అభివృద్ధి జరిగిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా ప్రస్తుతం హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకొంటున్నదంటే తనవల్లేనని అవలీలగా అబద్ధాలను వల్లెవేశారు.
హైదరాబాద్ అభివృద్ధిపై చంద్రబాబు గొప్పలు!
హైదరాబాద్ ఇప్పుడు అద్భుతంగా ఉన్నదంటే నేనే కారణం.. హైదరాబాద్ అభివృద్ధికి పునాది రాయి వేసిందే నేను.. ఐటీ, బయోటెక్నాలజీ, ఫార్మా, ఫైనాన్స్.. ఇలా విశ్వనగరంగా మారేందుకు నేనేసిన ఫౌండేషనే కారణం ఇవీ చంద్రబాబునాయుడు ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు. మరో అడుగు ముందుకేసి అసలు తెలంగాణ తలసరి ఆదాయంలో నంబర్ వన్ అయ్యిందంటే తనే కారణమని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో మూడెకరాల భూమి వచ్చేది.. ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే.. ఆంధ్రాలో వందల ఎకరాల భూమి కొనుక్కోవచ్చు.. ఇదీ నా ఘనతే అని ఊదరగొట్టారు. అయితే, చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు, మేధావులు మండిపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధికి.. 20 ఏండ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా చేసిన చంద్రబాబు ఎలా కారణం అవుతారని మండిపడుతున్నారు. ఒకవేళ ఆయన చెప్పిన మాటలు నిజమే అయితే.. ఆయన తర్వాత వచ్చిన కాంగ్రెస్ సీఎంల ఆధ్వర్యంలో తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నిస్తున్నారు. 20 ఏండ్లు అభివృద్ధి ఆగిపోయి.. ఆ తర్వాత పదేండ్లలో ఎలా సాధ్యమైందని ప్రశ్నిస్తున్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లాంటి సమర్థ నాయకత్వంవల్లే హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకొంటున్నది తప్ప చంద్రబాబు ఘనతేమీ లేదని అంటున్నారు. ఏపీ సీఎంగా ఐదేండ్లు పనిచేసిన చంద్రబాబు కనీసం రాజధాని ఏర్పాటుకు కూడా పునాది రాయి ఎందుకు వేయలేదని, అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా ఎందుకు నిర్మించలేదని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధిని చూపిస్తూ ఏపీ సీఎం జగన్‌నుంచి ప్రజల దృష్టిని మళ్లించి.. ఓట్లు దండుకొనేందుకు చంద్రబాబు కొత్త ప్లాన్ వేశారని అంటున్నారు. కేసీఆర్ సాధించిన ప్రగతిని తన గొప్పతనంగా చెప్పుకొని, ఏపీ ప్రజలను మోసం చేసేందుకు బాబు యత్నిస్తున్నారని మండిపడుతున్నారు.