mt_logo

కాంగ్రెస్‌ అంటేనే.. రైతు వ్యతిరేక ప్రభుత్వం: మంత్రి హరీశ్ రావు 

ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వ్యక్తి కావాలో.. ఉద్యమ కారుల భుజాలపై తుపాకీ గురి పెట్టిన వ్యక్తులు కావాలో ప్రజలే ఆలోచించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉద్యమం సందర్భంగా కిషన్‌ రెడ్డి  పదవికి భయపడి రాజీనామా కూడా చేయలేదని, ఇప్పుడు ఆయనకు అధికారం కట్టబెడితే ఎంత మేరకు అభివృద్ధి చేస్తారో ఆలోచించాలన్నారు. కేసీఆర్​ తలచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఎప్పుడో జైలులో వేసేవారని కానీ పక్క రాష్ట్రాల్లాగా అలాంటి కుటిల రాజకీయాలు చేయబోమని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు- నోటుకు సీటు అనే వ్యక్తులను ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో.. ధరణిని బంగాళఖాతంలో కలపాలన్న వారినే ప్రజలు అదే బంగాళాఖాతంలో ముంచుతారని విమర్శించారు. 

ఎవరు ఎన్ని కుట్రలు, ఆరోపణలు చేసిన రాబోయేది కేసీఆర్‌ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి వస్తామని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. తాజాగా హరీశ్‌రావు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలోని చాలా పథకాలను కేంద్రం, ఇతర రాష్ట్రాలు కాపీ కొట్టాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రైతులంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ రైతులపై కోపం పెంచుకుందన్నారు. రైతుబంధు పథకం ఓట్ల కోసం తెచ్చిన పథకం కాదని చెప్పారు. కాంగ్రెస్‌ అంటేనే.. రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు రైతులు బాధ పడుతున్నారని వెల్లడించారు.