తెలంగాణ కోసం తాను బయల్దేరి 24 ఏళ్లు అవుతోందని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. అచ్చంపేట సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో.. ఎవరి బూట్లు తుడిచారో.. అందరికీ తెలుసన్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చాక.. కేసీఆర్.. కొడంగల్‌కు రా అని ఒకరు, గాంధీభవన్ దగ్గరికి రా అని మరొకడు నాకే సవాళ్లు విసిరుతున్నారు’ అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ పరిస్థితి దారుణంగా ఉండేదని.. రైతులకు కనీసం కరెంట్ కూడా వచ్చేది కాదని సీఎం కేసీఆర్ తెలిపారు. నాటి గోసలు యాది కొస్తే భయమేస్తదని అన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలోనూ 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాలన సరిగ్గా లేదని.. కానీ, వాళ్లు రేపు తెలంగాణకు వచ్చి మనకు నీతులు చెప్పేందుకు వస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. నవంబర్ 30న తెలంగాణలో దుమ్మురేగాలని.. మరోసారి అచ్చంపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి బాలరాజును గెలిపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఒకరు కొడంగల్‌కు రా.. కొడవలి పట్టుకు రా అంటున్నారు. కేసీఆర్ దమ్మేందో దేశం మొత్తం చూసింది. నా దమ్ము గట్టిగా బయల్దేరితే దుమ్ము దుమ్ము లేస్తదన్నారు. మీ కళ్లకు కనిపించేది కేసీఆర్ దమ్మే. ఈసారి ఎన్నికల్లో దమ్ము కాదు.. దుమ్ము రేగాలి. ప్రజలు దుమ్మురేపాలి అని కేసీఆర్ తెలిపారు. ప్రపంచంలో ఎవరూ ఆలోచించని విధంగా రైతుబంధు గురించి ఆలోచించి, రైతుబంధును పుట్టిచ్చిందే తానని సీఎం కేసీఆర్ తెలిపారు. పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు.
తెలంగాణ కోసం తన వంతు పోరాటం అయిపోయిందని.. ఇక చేయాల్సింది ప్రజలేనని కేసీఆర్ చెప్పారు. ఎన్నికలు రాగానే ప్రజలు ఆగం కావొద్దని.. విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్ వాళ్లకు తెలంగాణ బాగోగులు అవసరం లేదని.. వాళ్లకు రాష్ట్రంపై పెత్తనం కావాలని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. 1969లో తొలి తెలంగాణ ఉద్యమం చేపడితే.. వేలమందిని కాల్చిచంపారని ధ్వజమెత్తారు. తాను మలివిడత ఉద్యమం చేపట్టి.. ‘‘కేసీఆర్ శవయాత్రనా.. తెలంగాణ జైత్రయాత్రనా’’ అని ముందుకు దూకితే.. 14 ఏళ్లు ఏడ్పించి.. తప్పనిసరి పరిస్థితుల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఏర్పాటు చేసిందని చెప్పారు.