mt_logo

నిర్మల్‌లో రూ.1157 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి నిర్మల్ నియోజకవర్గంలో పర్యటించి, రూ.1157 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.  తొలుత దిలాపూర్ మండలం గుండంపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద చేరుకున్న మంత్రి కేటీఆర్ కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పుష్ప‌గుచ్చం అంద‌జేసి స్వాగ‌తం ప‌లికారు.     

దిలావర్‌పూర్‌ మండలంలోని గుండంపెల్లి వద్ద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రూ. 714 కోట్ల వ్యయంతో నిర్మించిన  ప్యాకేజీ నంబర్‌ –27 ( శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకం) ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. స్థానిక మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ఎత్తిపోతల పథకానికి స్విచ్‌ ఆన్‌ చేసి కాలువలకు నీటిని విడుదల చేసి రైతులకు అంకితం ఇచ్చారు.

అనంత‌రం దిలావ‌ర్ పూర్ శివారులోని మాటేగాం వ‌ద్ద డెలివ‌రీ సిస్ట‌ర్న్ ను ప్రారంభించి కాలువ నీటికి పుష్పాభిషేకం చేశారు. అనంత‌రం సోన్ మండ‌లం పాత పోచం ప‌హాడ్ వ‌ద్ద 4 ఎక‌రాల విస్తీర్ణంలో రూ. 300 కోట్ల‌తో ఆయిల్ పామ్ ప్యాక్ట‌రీ నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. అక్క‌డి నుంచి హెలికాప్ట‌ర్ లో జిల్లా కేంద్రంలోని  ఇంటిగ్రెటేడ్ క‌లెక్ట‌రేట్ కాంప్లెక్స్ చేరుకున్నారు. అనంత‌రం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణానికి చేరుకుని పలు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాస‌న‌లు. ప్రారంభోత్స‌వాలు చేశారు. 

రూ. 10.15 కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు, మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కంలో భాగంగా నిర్మ‌ల్ పట్ట‌ణంలో మంచినీటి వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రిచేందుకు రూ. 39.91 కోట్ల వ్య‌యంతో పూర్తి చేసిన ప‌నుల‌కు ప్రారంభోత్స‌వం చేసి, న‌ల్లా నీళ్ళ‌ను స‌ర‌ఫరాను ప్రారంభించారు. మరికొన్ని అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను మంత్రి ఆవిష్కరించారు.


రూ. 2 కోట్ల టీయుఎఫ్ ఐడీసీ నిధులతో నిర్మించే దోబీఘాట్ పనులు, రూ. 4 కోట్ల టీయుఎఫ్ ఐడీసీ నిధులతో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టే పలు అభివృద్ధి పనులకు, అలాగే మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగు పరిచేందుకు అమృత పథకంలో భాగంగా రూ. 62.5 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 50 కోట్ల నిధులతో నిర్మల్ పట్టణంలో సీసీ రోడ్లు డ్రైనేజీల  నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. ఇలా మొత్తం రూ.1157 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం శంకుస్థాపనలు చేశారు.