mt_logo

ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని నడిపించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్

• 60 రోజులు ప్రచారం..

• 70 రోడ్ షోలు

• 30 పబ్లిక్ మీటింగ్స్ మరియు వివిధ వర్గాలతో సమావేశాలు

• 30కి పైగా ప్రత్యేక ఇంటర్వ్యూలు

• 150కి పైగా టెలికాన్ఫరెన్స్‌లు

• వేలాది మందితో ప్రత్యేకంగా ముఖాముఖీ కార్యక్రమాలు

• లక్షలాది మందిని ఉద్దేశించి బహిరంగ సభల్లో ప్రసంగాలు

• ఎన్నికల వేళ.. కోట్లాది మంది మనసు గెలుచుకున్న కేటీఆర్

• బీఆర్ఎస్ పార్టీకి అన్నీ తానై వ్యవహరించిన కేటీఆర్

• అటు ప్రచార పర్వం, ఇటు పార్టీ వ్యూహరచన

• ఎప్పటికప్పుడు పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం

• క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో నూతనోత్తేజం

• ముచ్చటగా మూడోసోరి పార్టీ గెలుపుకోసం బాటలు వేసిన కేటీఆర్

• రెండు నెలలుగా అలుపెరగని ప్రచారం

• ప్రత్యర్థుల విమర్శలకు దీటుగా సమాధానం

• గత పాలకుల వైఫల్యాలను అడుగడుగునా ఎండగట్టిన కేటీఆర్

• అటు జిల్లాల్లోనే కాకుండా.. ఇటు మహానగరంలోనూ విస్తృత  ప్రచారం

• హైదరాబాద్‌లో పార్టీ గెలుపు కోసం బహుముఖ వ్యూహంతో ముందడుగు

• బీఆర్ఎస్ ను తన భుజాలపై మోసిన కేటీర్‌పై వెల్లువెత్తిన ప్రజాభిమానం

• కామన్ మ్యాన్ నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు బస్తీవాసుల నుంచి బంజారాహిల్స్ వరకు ప్రతి ఒక్కరి మనసు గెలుచుకున్న మోస్ట్ పవర్ ఫుల్ లీడర్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించిన కేటీఆర్

• పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం.. అడుగడుగునా ప్రజలతో మమేకం

• ఎన్నికల ప్రచారపర్వంలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన కేటీఆర్

గత 60 రోజులుగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ పార్టీ తరఫున అన్నీ తానై ముందుకు నడిపించారు. ఒకవైపు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ తర్వాత అత్యధిక సభలు, రోడ్ షోలు, ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్ మరోవైపు పార్టీ ప్రచార ప్రణాళికల నుంచి మొదలుకొని క్షేత్రస్థాయి సమన్వయం వరకు విస్తృతంగా పనిచేశారు.ఎన్నికల షెడ్యూల్‌కి ముందే మంత్రి హోదాలో దాదాపు 30 నియోజకవర్గాలు విస్తృతంగా పర్యటించి గత పది సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించిన మంత్రి కేటీఆర్, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అటువైపు ప్రభుత్వ పనితీరు, పదేళ్ల అభివృద్ధి ప్రస్థానాన్ని సమర్థంగా వివరిస్తూనే ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల పైన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. 

గత 60 రోజుల నుంచి మరింత విస్తృతంగా పర్యటించి రాష్ట్రం నలుమూలలా జరిగిన భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. తన పదునైన ప్రసంగాలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు, యువత, విద్యావంతులను ఆలోచింపజేసేలా సాగిన కేటీఆర్ ప్రసంగాలు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అత్యంత కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతను తన భుజాలపై మోసి.. ప్రతి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం రెండు రోడ్ షోలతో పాటు ఎల్బీనగర్ , శేర్లింగంపల్లి , మల్కాజ్ గిరి వంటి పెద్ద నియోజకవర్గాల్లో ఒకే రోజు నాలుగు నుంచి ఐదు రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రతి రోడ్ షోలో అడుగడుగునా ప్రజాభిమానం వెల్లువెత్తింది. అడుగడుగునా జన ప్రభంజనం కనిపించింది. 

ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాల్లో వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించి ఆ తర్వాత సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు హైదరాబాదులో తన ప్రచార కార్యక్రమాలను కొనసాగించారు. ఒకవైపు జయప్రకాష్ నారాయణ (జేపీ), గోరేటి వెంకన్న, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారితో ప్రత్యేక ఇంటర్వ్యూలు కొనసాగించిన కేటీఆర్ ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువకులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోవడంతోపాటు.. ప్రభుత్వ నియామక ప్రక్రియను శరవేగంగా పూర్తిచేసేందుకు చేపట్టిన పటిష్టమైన చర్యల గురించి వివరించారు. అలాగే ఓలా ఊబర్, జొమాటో వంటి వాటి ద్వారా సేవలు అందిస్తున్న గిగ్ వర్క్ చేస్తున్న యువకుల దాకా అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ వారితో సంభాషిస్తూ వారికి భరోసానిస్తూ ముందుకు సాగారు.

హైదరాబాద్‌లో ఫస్ట్ టైం ఓటర్లు, ఐటీ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు వంటి వివిధ వర్గాల ప్రముఖులు, ఉద్యోగులు, ప్రజలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. సమాజంలో సగభాగమైన మహిళలతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మరోసారి గెలిచిన తర్వాత మహిళల కోసం చేపట్టే అనేక కార్యక్రమాలపైన తన ఆలోచనలను పంచుకున్నారు. దీంతోపాటు అటు పలు కుల సంఘాల నాయకులు ప్రతినిధులతో మాట్లాడుతూనే మైనార్టీలతో ప్రత్యేకంగా సమావేశమై గత పది సంవత్సరాలలో ఆయా వర్గానికి జరిగిన లబ్ధిని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ భవిష్యత్తు ప్రణాళికలను ఆవిష్కరిస్తూ.. వారిలో కొండంత భరోసాను నింపారు.

కేవలం ప్రచార కార్యక్రమాలే కాకుండా పార్టీ చేపట్టాల్సిన పత్రిక ప్రకటనల నుంచి మొదలుకొని సామాజిక మాధ్యమాలలో రూపొందించాల్సిన కంటెంట్ వరకు విస్తృతంగా చర్చించి వారికి దిశా నిర్దేశం చేశారు. మొత్తం 60 రోజుల పార్టీ ప్రచారంలో అత్యంత హుందాగా పార్టీ ప్రచారాన్ని చేపట్టారు. ఓవైపు ప్రతిపక్ష పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేసినా, కేవలం పాజిటివ్ అంశాలే ఈ ఎన్నికల ఎజెండా కావాలన్న సానుకూల ఆలోచనతో.. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడంతో.. ఆ మేరకు మొత్తం క్షేత్రస్థాయి నుంచి కేంద్ర పార్టీ కార్యాలయం వరకు పూర్తి సమన్వయంతో ప్రచారపర్వంలో ప్రత్యర్థులకు అందనంత వేగంగా బీఆర్ఎస్ దూసుకెళ్లింది. దీంతోపాటు ప్రతిరోజు వేలాది మందితో టెలి కాన్ఫరెన్స్ ద్వారా కేటీఆర్ మాట్లాడారు. ఒకవైపు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ నియమించిన ఇన్చార్జిలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు , కార్యకర్తలతో ఎప్పటికప్పుడు టెలి కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. వీరితోపాటు పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలతో, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఒపీనియన్ మేకర్లు, ముఖ్యమైన వ్యక్తులతోనూ టెలికాన్ఫరెన్స్ ద్వారా సంభాషించి పార్టీ కోసం వారి మద్దతును కూడగట్టారు. 

మంత్రి కేటీఆర్ తన ప్రచార సభల్లోనూ సమావేశాల్లోనూ తన ప్రసంగాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందరం కలిసి సాధించుకున్న తెలంగాణలో కలిసి ముందడుగు వేద్దామని పిలుపునిచ్చారు . ఇప్పటికే ఎన్నో అంశాల్లో గొప్ప ప్రగతిని సాధించాం.. అని వివరిస్తూనే.. ఇంకా సాధించాల్సింది ఇంకా ఉందని భవిష్యత్ విజన్ ను ఆవిష్కరించారు. తెలంగాణ ఎవరి చేతిలో ఉంటే పదిలంగా ఉంటుందో ఆలోచించి ఓటు వేయాలని కేటీఆర్ ఇచ్చిన పిలుపు ప్రతిఒక్కరిని ఆకట్టుకుంది. ఒక పాజిటివ్ దృక్పథంతో ప్రజల్లో సానుకూల అభివృద్ధి ఎజెండాతో సాగిన ప్రచార పర్వమంతా ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. ఒకవైపు తెలంగాణ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక పార్టీ  భారత రాష్ట్ర సమితి మాత్రమే అని ప్రజలకు గణాంకాలతో సహా వివరించారు.  ప్రతిపక్షాల తప్పులు, వారి డొల్ల వాదనలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు చాలని, వ్యవసాయానికి 10 హెచ్.పీ, మోటర్లను బిగించాలని రైతు నడ్డి విరిచే చర్యలపై విరుచుకుపడ్డారు.

కర్ణాటకలో అడ్డగోలు హామీలిచ్చి ఏవిధంగా అక్కడి ప్రజల్ని కాంగ్రెస్ వంచించిందో ఉదాహారణలతో సహా వివరించారు. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల వైఫల్యాలు, తెలంగాణ రాష్ట్రానికి చేసిన తీవ్ర అన్యాయాలను ప్రజలకు మరోసారి గుర్తుచేశారు. నిన్న అయినా, నేడు అయినా, రేపు అయినా తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ మాత్రమేనని, దశాబ్దాల పాటు దగాచేసిన ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో మరోసారి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమైక్యరాష్ట్రంలో 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని తెలంగాణ కేవలం పదేళ్ల కాలంలోనే సాధించిందని, ఇది విజన్ ఉన్న నాయకత్వం ఉండటం వల్లే సాధ్యమైందని కేటీఆర్ అడుగడుగునా గుర్తుచేశారు. బుడిబుడి అడుగుల వయసులోనే బుల్లెట్ వేగంతో దూసుకెళ్లిన తెలంగాణ ప్రస్థానం మరింత ముందుకు సాగాలంటే.. బీఆర్ఎస్ తోనే సాధ్యమని వివరించారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉంది కాబట్టి.. సంక్షేమాన్ని దీవించి.. అభివృద్ధికి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

తెలంగాణ ఆత్మ తెలిసిన కేసీఆర్‌కి మూడోసారి విజయాన్ని అందించి దక్షిణ భారతదేశంలోని హ్యాట్రిక్ సాధించిన తొలి ముఖ్యమంత్రిగా సరికొత్త రికార్డు సాధించేందుకు నడుం కట్టాలని పిలుపునిచ్చారు.మొత్తంగా గత 60 రోజుల పాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీకి  అన్నీ తానై, స్టార్ క్యాంపెయినర్ గా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా అన్ని బాధ్యతలు తన భుజాలపైకి ఎత్తుకొని రోజుకి దాదాపు 15-18 గంటల వరకు పనిచేశారు కేటీఆర్. ముఖ్యంగా ప్రజల నుంచి లభించిన అపూర్వ స్పందనే తనను ముందుకు నడిపించిందని, ప్రజలకు మంచి చేస్తే, వారు అండగా ఉంటారన్న బలమైన నమ్మకంతో తన క్యాంపెయిన్ సాగిందని, భారత రాష్ట్ర సమితిని మరోసారి ప్రజలు గెలిపిస్తారన్న పూర్తి విశ్వాసం తనకుందని కేటీఆర్ అన్నారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో, 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో తమ వెంట నడిచిన తెలంగాణ సమాజం వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీని గుండెల నిండా ఆశీర్వదించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.