సిద్దిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ నిర్వహణపై మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లక్ష మందితో సిద్దిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ నిర్వహణ జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అన్నిట్లో ముందుంది. అభ్యర్థుల ప్రకటనలో, మ్యానిఫెస్టో ప్రకటనలో, అదేవిధంగా రేపు గెలుపులో కూడా ముందుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సిద్దిపేటలో పుట్టిన బిడ్డగా సిద్దిపేట కీర్తిని ప్రపంచ పటంలో నిలబెట్టిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని తెలిపారు.
సిద్దిపేట మట్టి బిడ్డ కేసీఆర్ సిద్దిపేట జిల్లాను సాధించాడు. స్వచ్ఛందంగా తరలివచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘన స్వాగతం పలకాలి. 4:45 ప్రాంతంలో సిద్దిపేటకు హెలికాప్టర్‌లో సిరిసిల్ల నుండి రానున్నారు. 5.30 సభ ప్రారంభించుకుంటాం. 20వేల మంది విద్యార్థులు బైక్ ర్యాలీ ద్వారా స్వచ్ఛందంగా సభకు రానున్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, లాయర్లు, డాక్టర్లు అందరూ ఈ సభకు విచ్చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రజల హృదయాలు ఆనందంతో పొంగుతుంటే ప్రతిపక్షాల గుండెలు జారిపోయాయన్నారు. ముఖ్యమంత్రి కుటుంబ పెద్దలా ఆలోచించి ఆచి తూచి మేనిఫెస్టోని తయారు చేశారు. ఆసరా పెన్షన్ అయినా, దళిత బంధువైన, రైతు బంధువైన, రైతు బీమా అయినా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలకు నగదు పెంచి పేరు మార్చి ప్రవేశపెడతామని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మా పథకాలను కాపీ కొట్టిందని చెప్పారు. రానే రాదు కనే కాదు అన్న తెలంగాణను తెచ్చి చూపించిన నాయకుడు కేసీఆర్. అంత బాధ్యతగా తెలంగాణ పట్ల ఎవరు ఉండరని అన్నారు.
కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా.. సౌభాగ్య లక్ష్మి వంటి పథకాలను మహిళ కోసం తెచ్చిన మహిళా పక్షపాతి కేసీఆర్ అని అన్నారు. ప్రతి నెల మహిళకు 3000 ఇవ్వాలని సౌభాగ్య లక్ష్మి తేనున్నారు. గ్యాస్ పొయ్యితో, గ్యాస్బండతో బీజేపీ సెగ పెట్టింది. సిలిండర్ ని 400 రూపాయలకే పేదలకు అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మరో అద్భుతమైన పథకం ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టారు. గత పాలకులు ముక్కిపోయిన, కుళ్ళిపోయిన బియ్యం ఇచ్చేవారు. ఆసరా పెన్షన్లను 5 వేలకు పెంచడం వికలాంగులకు 6000పెంచడం రైతుబంధుని 16000 కు పెంచుతూ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్, మహిళలందరూ కొంగులు నడుముకు కట్టి నడవవే రామక్క బీఆర్ఎస్‌కి ఓటేద్దామని పాట రూపంలో ఉత్సాహంగా బీఆర్ఎస్‌కి మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను ఆపి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీ పార్టీ తెలంగాణకు చేసిన ఒక రూపాయి అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే మా పథకాలు కాపీ కొట్టి ఎందుకు అమలు చేశారు. తెలంగాణ పేరు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఒక అవార్డు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. తెలంగాణలో అభివృద్ధి జరగకుంటే ఢిల్లీలో తెలంగాణకు అవార్డులు ఎందుకు ఇచ్చారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమాన్ని ఇతర రాష్ట్ర మేనిఫెస్టోలలో పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ ఆచరిస్తది దేశం అనుసరిస్తది అన్న విధంగా మారింది. మూడోసారి మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆరే అని అన్నారు. సిద్దిపేట కలను నిజం చేసిన నాయకుడు సిద్దిపేట ముద్దుబిడ్డ సీఎం కేసీఆర్ సిద్దిపేటకు వస్తున్న నేపథ్యంలో వారి సభను విజయవంతం చేయాలని కోరారు.