mt_logo

ఫోర్జరీ చేసిన సీఎంను జైల్లో పెట్టుకుండా.. అది తప్పని చెప్పిన వాళ్లను జైల్లో పెట్టటం ఏంటి: కేటీఆర్

బీఆర్ఎస్ నేత క్రిషాంక్ రిమాండ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మార్చి 18న ఓయూలో నీటి కొరత, కరెంట్ సమస్య ఉందంటూ నెల సెలవులు ఇస్తున్నామని ఒక నోటీసు ఇవ్వటం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఓయూ విద్యార్థులంతా ధర్నాకు దిగారు.. ఇది సోషల్ మీడియా ద్వారా కేసీఆర్ గారి దృష్టికి వచ్చింది… అదే సమస్యను ప్రస్తావిస్తూ చేతగాని ప్రభుత్వమంటూ కేసీఆర్ గారు ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు అని తెలిపారు.

ఈ పోస్ట్ చేసిన వెంటనే చీఫ్ వార్డెన్‌కు ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చింది..ఎస్పీడీసీఎల్ నుంచి కూడా కరెంట్ సమస్య లేదంటూ వైస్ ఛైర్మన్ పేరుతో నోటీసు ఇచ్చారు. వైస్ ఛాన్సలర్‌కు బదులు వైస్ ఛైర్మన్ అని పేర్కొనటం చూస్తుంటే ఈ ప్రభుత్వం తెలివి ఎలా ఉందో అర్థమవుతోంది అని అన్నారు.

కేసీఆర్ గారు ట్వీట్ చేసిన మరుసటి రోజే రేవంత్ రెడ్డి ట్విట్టర్లో ఒక నోటీస్ పెట్టారు. గతేడాది కూడా అలాగే నోటీసు ఇచ్చారంటూ ఆయన ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. అయితే సీఎం పెట్టిన నోటీస్ ఫేక్ అంటూ ఉస్మానియా స్టూడెంట్సే అసలైన నోటీసును సోషల్ మీడియాలో వెలుగులోకి తెచ్చారు. 2023లో ఇచ్చిన నిజమైన నోటీసు మొత్తం ఉస్మానియా విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు కొట్టింది అని తెలిపారు.

రేవంత్ రెడ్డి అనే ఒక పనికి మాలిన నాయకుడు తన పర్సనల్ ఖాతా ద్వారా ఫేక్ నోటీసును ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇంత చిల్లరగా సీఎం ఫేక్ డాక్యుమెంట్ చేస్తారా? అని అనుకున్నాం.. కానీ ఆయన ప్రజలను తప్పుదోవ పట్టించారు.. ఛీఫ్ వార్డెన్ స్టాంప్‌ను కూడా మార్చేసిండు.. సీఎం తప్పుడు డాక్యుమెంట్ పెట్టాడు అని కేటీఆర్ విమర్శించారు.

తప్పు చేసింది సీఎం అయితే.. మా నాయకుడు క్రిశాంక్‌ను అరెస్ట్ చేశారు.. అసలు జైల్లో ఉండాల్సింది ఎవరు? ఫేక్ డాక్యుమెంట్ పెట్టిన రేవంత్ రెడ్డా? అది తప్పని చెప్పిన క్రిశాంకా? నేను చెప్పింది తప్పు అయితే చంచల్‌గూడ జైలుకి వెళ్లటానికి సిద్ధం.. లేదంటే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తాడా? అని సవాల్ విసిరారు.

ఈ ప్రభుత్వం తప్పులను సోషల్ మీడియాలో బయటపెడుతున్నందుకు క్రిశాంక్ మీద కక్ష గట్టి అరెస్ట్ చేశారు.. నకిలీ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలే.. క్రిశాంక్‌ను వెంటనే విడుదల చేయాలె.. క్రిషాంక్‌ను అరెస్ట్ చేయటం దుర్మార్గమైన చర్య.. కోర్టులో దీనిపై మేము పోరాడుతాం అని స్పష్టం చేశారు.

సీఎం ఫేక్ డాక్యుమెంట్ చేశారని ఆయనపై ఫోర్జరీ కేసు పెట్టాలని ఓయూ విద్యార్థులు కూడా ఫిర్యాదు చేశారు. ఫేక్ సర్య్యూలర్ పోస్ట్ చేసినందకు ఈసీ రేవంత్ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు. 14 ఏళ్ల ఉద్యమంలో ఇలాంటి ఎన్నో వేధింపులు చూశాం.. ఇలాంటి ఉడుత ఊపులకు మేము భయపడం అని తేల్చి చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా మా సోషల్ మీడియా వారియర్స్‌పై దాడులు జరుగుతున్నాయి.. రాహుల్ గాంధీ గారు మాత్రం మెహబ్బత్ కా దుకాణ్ అంటున్నారు.. కానీ మా కార్యకర్తల మీద ఈ ప్రభుత్వం దాడులకు తెగబడుతోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకుంటుందా? లేదా? చెప్పాలె అని అడిగారు.

ఇలాంటి వారికి ఓటు ద్వారానే ప్రజలు బుద్ధి చెప్పాలిని కోరుతున్నా.. సత్యమేవ జయతే.. సత్యమే గెలుస్తుంది.. మాకు ఆ నమ్మకం ఉంది.. న్యాయస్థానంలో పోరాడుతాం. కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటే.. ఈసీ ఖచ్చితంగా మోడీ, రేవంత్‌పై కూడా చర్యలు తీసుకోవాలె అని డిమాండ్ చేశారు.

ఫోర్జరీ చేసిన సీఎంను జైల్లో పెట్టుకుండా.. అది తప్పని చెప్పిన వాళ్లను జైల్లో పెట్టటం ఏంటి.. ప్రజలు అన్ని గమినిస్తున్నారు.. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాటం ఖాయం అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.