mt_logo

మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలకు యాక్టింగ్‌లో ఆస్కార్ అవార్డ్ ఇయ్యాలి: కేటీఆర్

వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొండా విశ్వేశ్వరరెడ్డి కాదు.. ఆయన విశ్వాసం లేని వ్యక్తి.. రంజిత్ రెడ్డి కాదు.. రన్నింగ్ రెడ్డి. వాళ్లిద్దరూ ఎవరో తెలియకపోయినా సరే మీరు గెలిపిస్తే విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు అని పేర్కొన్నారు.

విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా వ్యవహరించారు. రంజిత్ రెడ్డి అయితే మరీ దారుణంగా మోసం చేశాడు.. మహేందర్ రెడ్డి భార్య వికారాబాద్‌లో ఆనంద్‌ను ఓడిపోయేలా చేసింది. మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కలిసి పరిగి సమావేశంలో డ్రామాలు చేశారు.. యాక్టింగ్‌కు ఆస్కార్ ఇస్తే మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డికి ఇయ్యాలే అని ధ్వజమెత్తారు.

మహేందర్ రెడ్డిని జీవితంలో మంత్రిని చేసింది కేసీఆర్.. అనామకుడు రంజిత్ రెడ్డిని ఎంపీ చేసింది మన నాయకుడు. కేసీఆర్‌ను, పార్టీని మోసం చేసిన వాళ్లకు బుద్ధి చెప్పాలె. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన కాసానిని గెలిపించుకోవాలె అని అన్నారు. 

కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల లిస్ట్ చూడండి.. మొత్తం మన పార్టీ నుంచి పోయినవాళ్లే. మోడీ హవా ఉంటే పక్కా పార్టీల నుంచి కాళ్లు పట్టుకొని ఎందుకు తీసుకెళ్తున్నారు అని కేటీఆర్ అడిగారు.

చేవెళ్లలో బీజేపీకి ఓటు ఎందుకు వెయ్యాలే.. కొత్త ఫ్యాకర్టీ ఇయ్యలే, ఐటీఐఆర్ తీసుకపోయారు.. పాలమూరు రంగారెడ్డికి జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే? ఎందుకు మోడీకి ఓటు వేయాలే అని ప్రశ్నించారు.

రాముడుకి మొక్కుదాం.. బీజేపీని తొక్కుద్దాం.. రాముడు బొమ్మతో రాజకీయాలు చేయాలని చూస్తోంది బీజేపీ. దేశానికి, పేదలకు చేసిందేమీ లేదు.. కనుకనే దేవుడు పేరుతో రాజకీయాలు చేస్తోంది బీజేపీ అని విమర్శించారు.

ఒక్క మెడికల్ కాలేజ్, నవోదయ పాఠశాల ఇయ్యని, రైతుల ఆదాయం డబుల్ చేస్తా అని మోసం చేసిన దిక్కుమాలిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలే.. 70 రూపాయల పెట్రోల్‌ను 110 చేసినందుకా? డీజిల్ రేట్లు పెంచినందుకా? సిలిండర్ రేట్లు పెంచినందుకా? పప్పు, ఉప్పులు ఫిరం చేసినందుకా? ధరలు పెంచినందుకా ఎందుకు బీజేపీకి ఓటు వేయాలి? అని అడిగారు.

మోడీ ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన ప్రధాని.. 2 కోట్ల ఉద్యోగాలు, 15 లక్షల రూపాయలు అకౌంట్లలో వేశారా? ఎందుకు బీజేపీకి ఓటు వేయాలే అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కుమాలిన పార్టీ.. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. పదేళ్ల నిజానికి, 100 రోజుల అబద్ధానికి మధ్య పోటీ. మొన్నటి ఓటమిని ఇప్పుడు విజయానికి మెట్టుగా చేసుకోవాలె అని సూచించారు.

రేవంత్ రెడ్డి రూ. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నే చేస్తా అన్నాడు. కానీ ఇప్పుడు ఆ విషయం సీరియస్‌గా తీసుకోవద్దు అని చెప్తుండు. సిగ్గులేకుండా ఇప్పుడు పరిపాలన నా చేతిలో లేదు.. ఎన్నికల సంఘం చేతిలో ఉంది అంటున్నాడు. ముఖ్యమంత్రి గుంపుమేస్త్రీ, ప్రధాని మంత్రి తాపీ మేస్త్రీ.. వాళ్లిద్దరూ తెలంగాణకు సమాధి కట్టేందుకు కలిసి పనిచేస్తున్నారు అని పేర్కొన్నారు.

చేవేళ్లలో గెలవమని తెలిసే సీఎం అక్కడి ఇంఛార్జ్ పదవి నుంచి తప్పుకున్నాడు.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు సాయం చేసుకున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్‌ను లేకుండా చేసేందుకు కలిసి మళ్లీ పనిచేస్తున్నాయి..బీఆర్ఎస్ సమావేశాలకు వెళ్లొద్దని రంజిత్ రెడ్డి అందరికి ఫోన్లు చేస్తున్నాడు.. పార్టీ మారిన వ్యక్తి గురించి మనకు అవసరమా? అని కేటీఆర్ అన్నారు.

ఒక పార్టీలో ఉండి మరొక పార్టీకి పనిచేస్తే విలువ ఉంటదా? అవకాశవాదిని ఓడించాలె.. రంజిత్ రెడ్డి మనకు శత్రువే.. అతన్ని ఖచ్చితంగా ఓడించాల్సిందే. బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో, కేసీఆర్ కూతురును అరెస్ట్ చేసిన సమయంలో నవ్వుతూ కాంగ్రెస్ చేరిన వ్యక్తికి మనం మద్దతుగా ఉండాలా? అని అడిగారు.

రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్ష నాయకుడిగానే మాట్లాడుతున్నాడు .. మల్కాజ్‌గిరిలో పోటీకి రమ్మంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డి నుంచి స్పందన లేదు. ఓడిపోతామని రేవంత్‌కు తెలుసు.. మల్కాజ్‌గిరి, చెవేళ్లలో డమ్మీ అభ్యర్థులను పోటీలో పెట్టాడు..చేవెళ్లలో మనకు బీజేపీతోనే పోటీ అని స్పష్టం చేశారు.

మెడల పేగులు వేసుకొని తిరిగేటోడు ముఖ్యమంత్రా? లంకె బిందెల కోసం వెతికే వ్యక్తి ఎవరు? ముఖ్యమంత్రి లంకెబిందెలు కోసం వెతుకుతాడా? ప్రభుత్వాన్ని పడగొడితే మానవబాంబు అవుతా అని రేవంత్ రెడ్డి అంటాడు.. ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం మాకు లేదు ఆని అన్నారు.

నీ పక్కనే నల్గొండ, ఖమ్మం మానవబాంబులే నిన్ను పడగొడుతాయి చూసుకో.. నువ్వే 5 ఏళ్లు సీఎం ఉండాలె.. చెప్పిన 420 హామీలు అమలు చేయాలే అని మేము కోరుకుంటున్నాం అని కేటీఆర్ తెలిపారు.

రేవంత్ రెడ్డి ఎప్పుడు మగాడివైతే అంటాడు కదా..నేను కూడా అంటున్న.. రేవంత్ నువు మగాడివైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చు.. మగాడివైతే మహిళలకు ఇస్తా అన్న రూ. 2,500 ఇవ్వు.. రుణమాఫీ చెయ్, అవ్వ, తాతాలకు రూ. 4 వేలు ఇవ్వు.. మగాడివైతే పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురా? అని దుయ్యబట్టారు.

పొరపాటున కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకోపోయినా నాకే ఓటు వేసిన్రు అంటాడు.. అందుకే ఇక మేము హామీలు నేరవేర్చాం, కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేసిండు అని ఖచ్చితంగా అంటాడు. ఇక్కడ కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీజేపీకి ఓటేసినట్లే అని అన్నారు.

రాహుల్ గాంధీ ఏమో చౌకిదార్ చోర్ హై అంటాడు.. రేవంత్ రెడ్డి ఏమో మోడీ హమారా బడే భాయ్ అంటాడు.. రాహుల్ గాంధీ అదానీ ఫ్రాడ్ అంటే రేవంత్ రెడ్డి అదానీ నా ఫ్రెండ్ అంటాడు. రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కాం ఏం లేదంటాడు.. కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయమని అంటాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కవితమ్మ అరెస్ట్ కరెక్టే అంటాడు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా? మోడీ కోసం పనిచేస్తుండా? అని ప్రశ్నించారు.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లే మొట్టమొదటి వ్యక్తి జంపింగ్ జపాంగ్ రేవంత్ రెడ్డే. రేవంత్ రెడ్డి బీజేపీలో వెళ్లటం పక్కా.. ఈ విషయం మీద 15 సార్లు అన్నప్పటికీ ఎందుకు రేవంత్ స్పందించటం లేదో చెప్పాలె అని అడిగారు.

రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ కేసీఆర్ చెల్లని వెయ్యి రూపాయల నోటు అంటున్నాడు. కానీ కాంగ్రెస్‌కు 40 సీట్లు రావని ఇండియా కూటమి నేతలే అంటున్నారు. ఈ లెక్కన ఎవ్వరూ చెల్లిని వెయ్యి రూపాయలో చెప్పాలె అని అన్నారు.

మొన్నటి ఓటమి మన పార్టీకి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. మనం ఓడిపోయింది స్వల్ప ఓట్ల తేడాతోనే. పార్టీలో చెత్త అంతా వెళ్లిపోతోంది.. నిఖార్సైన పార్టీ కార్యకర్తలు ఉన్నారు.. వాళ్లకు పార్టీ అండగా ఉంటుంది.. పార్టీ వదిలి వెళ్లిన వాళ్లు మళ్లీ పార్టీ గెలిచాక వస్తా అంటే కాళ్లు పట్టుకున్న తీసుకునేది లేదు ఆని స్పష్టం చేశారు.

విశ్వేశ్వర్ రెడ్డి రాముడున్నాడు అనొచ్చు.. రంజిత్ రెడ్డి రేవంత్ పేరు చెప్పొచ్చు.. కానీ మనకు కేసీఆర్ ఉన్నాడు.. కాసాని జ్ఞానేశ్వర్ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన చిత్తశుద్ధి కలిగిన నేత.. కేసీఆరే అభ్యర్థి అన్నట్లు కాసానిని గెలిపించుకుందాం అని పిలుపునిచ్చారు.