mt_logo

రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి: హరీష్ రావు

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. 2014లో పార్టీని లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించుకున్న స్ఫూర్తితో ఈ 2024లోనూ గెలిపించాలి.. నలభై రోజులు కష్టపడితే భువనగిరిలో గెలుస్తాం. ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసింది.. ఆ పార్టీకి గుణపాఠం చెబుతారు అని పేర్కొన్నారు.

దానం నాగేందర్, కడియం కావ్య, రంజిత్ రెడ్డి, పట్నం సునీతలు పార్టీ మారడాన్ని ప్రజలు హర్షించడం లేదు. స్వార్థపరులే పార్టీలు మారుతున్నారు.. వారిని ఓడించాలని కార్యకర్తలు కసితో ఉన్నారు ఆని అన్నారు.

భువనగిరిలో పోటీ చేస్తున్న క్యామ మల్లేష్ బలహీన వర్గాల నేత.. ఎన్నోఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఆయనను పార్లమెంటుకు పంపాలి.. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి.. రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి బహిష్కరింపబడిన వ్యక్తి . అతనితో జాగ్రత్తగా ఉండాలి అని హరీష్ తెలిపారు.

కాంగ్రెస్ నేతలు వందరోజుల్లో హామీలను అమలు చేయకపోగా అబద్ధాలు మాట్లాడుతున్నారు.. ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకున్నారు. కాంగ్రెస్ పాలనకు వందరోజులు నిండాకే కోడ్ అమల్లోకి వచ్చింది అని గుర్తు చేశారు.

ఆరు గ్యారంటీల్లో తొలి హామీ మహిళలకు రూ. 2,500లనే అమలు చేయలేదు.. రూ. 2 లక్షల రుణమాఫీ, వడ్లకు రూ. 500 బోనస్, రూ. 4 వేల ఫింఛన్, రూ. 15 వేల రైతుబంధు, తులం బంగారం, 4 వేల నిరుద్యోగ భృతి, విద్యార్థులకు రూ. 5 లక్షల బ్యాంకు కార్డు, వీటిలో ఒక్క హామీ కూడా అమలు కాలేదు.. మాట తప్పిన కాంగ్రెస్‌కు ఓడించి బుద్ధి చెప్పాలి అని పిలుపునిచ్చారు.

నిరుద్యోగులకు రూ. 4 వేలు ఇస్తామని రేవంత్ చెప్పిండు.. ప్రియాంక గాంధీ ఈ భువనగిరిలోనే హామీ ఇచ్చింది.. కానీ అలాంటి హామీనే ఇవ్వలేదని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి చెప్పిండు. కేసీఆర్ మాటంటే మాటే.. అధికారంలోకి రాగానే రూ. 200 పెన్షన్‌ను వెయ్యి చేసిండు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి పింఛన్ రూ. 2 వేలు చేసిండు అని అన్నారు.

కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే ఎన్నికల్లో ఆ పార్టీ మెడలు వంచాలి.. మళ్లీ కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ప్రజలను మోసం చేసినా తమకే ఓటేశారని ప్రచారం చేసుకుంటారు.. మేం అసెంబ్లీలో ప్రశ్నించడానికి వీలుండదు అని తెలియచేశారు

రేవంత్ పేగులు మెడలో వేసుకంటానని అంటున్నాడు.. ఆయనేమన్నా రాక్షసుడా? మానవీయ పాలన అందించాలి తప్ప ఇవేం మాటలు.. రైతులను, నిరుద్యోగులను, మహిళలను, విద్యార్థులను, నిరుపేదలను అందర్నీ మోసం చేసింది కాంగ్రెస్ అని హరీష్ విమర్శించారు.

రైతులకు ఇచ్చిన ఏ హామీని కూడా అమలుచేయని కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే హక్కు లేదు.. ఫిరాయింపులకు కాదు, పంటలను కాపాడ్డానికి గేట్లు తెరవాలి. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్‌కు ఓటేస్తే నష్టపోతామని అర్థం చేయించండి అని సూచించారు.

బీజేపీ కూడా ఒక్క హామీని కూడా నిలెబెట్టుకోలేదు.. గ్యాస్, పెట్రోల్ ధరలను భారీగా పెంచింది నల్లధనం తేలేదు, 2 కోట్ల ఉద్యోగాలివ్వలేదు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం కాదు, ప్రజలకు చేసిన మేలేంటో బీజేపీ చెప్పాలి అని ప్రశ్నించారు.

ఢిల్లీలో తెలంగాణ గళం వినిపించాలంటే మన క్యామ మల్లేష్‌ను గెలిపించాలి. తెలంగాణ ప్రయోజనాల పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్.. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే.. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి.. కేసీఆర్‌లా పోరాడాలి.. తెలంగాణ ఉన్నంతకాలం భూమి ఉన్నంత కాలం గులాబీ జెండా ఉంటుంది అని స్పష్టం చేశారు.