ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. క్యామ మల్లేశం గారికి ఒక్క ఇబ్రహీంపట్నం నుంచే 50 వేల మెజార్టీ ఇవ్వాలె అని కోరారు.
ఫూలే గారు విద్యతోనే వికాసం, వికాసంతోనే అభివృద్ధి అని చెప్పారు. మహాత్మా ఫూలే, డాక్టర్ అంబేడ్కర్ మాటలను ఆచరణలలో పెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్. 1008 గురుకుల పాఠశాలలు పెట్టే ఒక్కో విద్యార్థిపై రూ. లక్షా 20 వేలు ఖర్చు పెట్టింది కేసీఆర్. వచ్చే తరం విద్యతో వికాసం అందుకోవాలని కేసీఆర్ భావించారు అని తెలిపారు.
కులవృత్తులు కూడా ఎంతో ముఖ్యమని గౌడ్లకు వైన్స్‌లలో రిజర్వేషన్లు ఇచ్చారు. గొల్ల కురుమల కోసం గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించారు. రూ. 33 వేల కోట్ల మత్స్య సంపదను సృష్టించింది కేసీఆర్ గారు.. జీవ సంపదను పెంచింది కూడా కేసీఆర్ గారేనని గుర్తు పెట్టుకోవాలె అని అన్నారు.
చేనేత మిత్ర, చేనేత చేయూత, బతుకమ్మ చీరలతో నేతన్నలకు ఉపాధి ఇచ్చింది కేసీఆర్. చేతి వృత్తులు, కుల వృత్తులకు ప్రాధాన్యం ఇచ్చింది కేసీఆర్ గారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చింది కేసీఆర్ గారే. పార్లమెంట్ సీట్లలో కూడా బీసీలకు ఇప్పుడు 50 శాతం టికెట్లు ఇచ్చింది కూడా కేసీఆరే అని గుర్తు చేశారు.
ఫూలే ఆశయాలను ఆచరణలో పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే.. దళితుల కోసం ఇన్ని కార్యక్రమాలను తీసుకున్నది కేసీఆర్ ప్రభుత్వమే. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, అంబేడ్కర్ సచివాలయం, దళిత బంధు పేరుతో దళితులకు ఎన్నో కార్యక్రమాలు చేసిండు. బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం ఉండాలనే ఆలోచనతో క్యామ మల్లేశం గారిని భువనగిరి పార్లమెంట్‌కు కేసీఆర్ పంపిండు అని తెలిపారు.
మీరంతా కలిసికట్టుగా పనిచేసిన ఖచ్చితంగా క్యామ మల్లేశం గారిని గెలిపించాలె. రేవంత్ రెడ్డి మైక్ వీరుడు మాత్రమే.. అరచేతిలో వైకుంఠం చూపించిండు..రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి అన్నాడు.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్ల ఉంది? పదేళ్లు అధికారంలో ఉండి మనం మంచి పనులు చేసే పనిలో పెట్టుకున్నాం.. వాళ్ల లాగా లంగ పనులు, రాజకీయ కుట్రలు చేయాలని మనం ఎప్పుడు ఆలోచన చేయలె అని కేటీఆర్ అన్నారు.
ఇక్కడికి ఫాక్స్‌కాన్‌తో కేన్స్ అనే మరొక కంపెనీని ఇక్కడి రప్పించాం. కొత్త ప్రభుత్వం రావటంతో ఆ కంపెనీ మేము వెళ్లిపోతున్నామని గుజరాత్‌కు వెళ్లిపోయింది. ప్రభుత్వానికి తెలివి లేకపోయినప్పుడే రియల్ ఎస్టేట్ పడిపోతది. ఫార్మాసిటీ కోసం మేము అన్ని తయారు చేసి సిద్ధం చేసినం. దాన్ని కూడా నడుపుకునే చేతగాని అసమర్థ నాయకులు కాంగ్రెసోళ్లు. పరిశ్రమలు వస్తే రియల్ ఎస్టేట్ వస్తది.. ఆ అవగాహన కూడా ప్రభుత్వానికి లేదు ఆని విమర్శించారు.
డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణం తెచ్చుకోమన్నాడు.. మరి ఇప్పటికి 4 నెలలు గడిచిన 2 లక్షల రుణమాఫీ లేదు. పేగులు కత్తిరిస్తా అంటాడు? జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా అంటాడా. ముఖ్యమంత్రి నోటి నుంచి అన్ని గలీజ్ మాటలే.. ఒక్కటన్న సక్కని మాట వస్తలే.. లంక బిందెల కోసం పచ్చి దొంగలు మాత్రమే వెతుకుతారు అని పేర్కొన్నారు.
మగాడివైతే అని రేవంత్ రెడ్డి అంటాడు.. ఆయన భాషలోనే చెప్పాలంటే.. మగాడివైతే రుణమాఫీ చేసి ఓటు అడుగు. మగాడివైతే మా ఆడబిడ్డలకు రూ. 2500 ఇస్తా అన్నావ్.. ఇచ్చినంకనే ఓటు అడుగు.. మగాడివైతే ముసళ్లోళ్లకు నాలుగు వేలు ఇస్తా అన్నావ్.. 4 వేలు ఇచ్చినంకనే మాట్లాడు. మగాడివైతే రైతులకు రైతుభరోసా ఇస్తా అన్నావ్.. ఇచ్చినంకనే ఓటు అడుగు. మాటలు చెప్పుడు మస్త్ చెప్పొచ్చు.. మేము అట్ల చేయలే అని అన్నారు.
కాంగ్రెస్ రాగానే మళ్లీ కరెంట్ కోతలు మొదలైనయ్.. నీళ్ల కష్టాలు మొదలనయ్. తినే అన్నంలో మన్ను వేసుకున్నట్లు అయిపోయిందని ప్రజలు భావిస్తున్నారు. అసలు ఎందుకు కాంగ్రెస్ ఓటు వేయాలె?
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే హామీలు అమలు చేయకపోయినా సరే మాకే ఓట్లు వేసిన్రు అని రేవంత్ రెడ్డి అంటాడు..ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఖచ్చితంగా అన్ని పథకాలు పోతయ్ అని దుయ్యబట్టారు.
బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో నాకైతే తెలియదు. మోడీ వచ్చిన తర్వాత అన్ని ధరలు ప్రియం చేసిండు. మోడీ ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన ప్రధాని. 4 వందల సిలిండర్‌ను 12 వందల రూపాయలు చేసిండు.. రాముడు అందరివాడు.. రామునితో మనకు పంచాయితీ లేదు. మన 5 మండలాలు తీసుకున్నందుకా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ జాతీయ హోదా ఇవ్వనందుకా? ఐటీఐఆర్ తీసుకపోయినందుకా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇయ్యనందుకా? దేనికి బీజేపీకి ఓటు వేయాలె.. రామున్ని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం అని పిలుపునిచ్చారు.
యాదగిరి గుట్టను మనం కూడా కట్టినం.. కానీ రాజకీయాలకు వాడుకోలె.తెలంగాణకు ఇది చేసినం అని చెప్పే మొఖం బీజేపీ నేతలకు ఉందా. మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం పండిస్తే కొనేందుకు చేతగాక చేతులేత్తిసిన బీజేపీకి ఓటు ఎందుకు వేయాలె.. మీవోళ్లకు నూకలు తినుడు నేర్పియ్ అని కేంద్రమంత్రి పియూష్ గోయల్ అన్నందుకు బీజేపీకి ఓటువేయాల్నా అని కేటీఆర్ అడిగారు.
మోడీని బండి సంజయ్ దేవుడంటాడు.. దేనికి మోడీ దేవుడో చెప్పాలె. దేశంలో కాంగ్రెస్‌కు గానీ బీజేపీ కూటమి గాని మెజార్టీ వచ్చే అవకాశం లేదు. మనకు 10-12 సీట్లు వస్తే కేంద్రంలో చక్రం తిప్పవచ్చు అని అన్నారు.
సీఎం గుంపు మేస్త్రి, ప్రధాని తాపీ మేస్త్రి.. వీళ్లద్దరూ బీఆర్ఎస్‌ను ఖతం చేయాలనే ఉద్దేశంతో కలిసి పనిచేస్తున్నారు అని ఎద్దేవా చేశారు.